Sunday, January 19, 2025

కాంగ్రెస్ వస్తే రైతు చేతికి చిప్పే

- Advertisement -
- Advertisement -

గాలి లేదు, గత్తర లేదు… ఉన్నదంతా బిఆరెస్సే..
నా తన్లాట..కొట్లాటంతా రాష్ట్ర సుభిక్షిం కోసమే
ఎవరెన్ని చేసినా…మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే
ముఖ్యమంత్రి కుర్చీ కోసం 12 మంది కాంగ్రెస్ నేతల ఆరాటం
గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారం
ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి, వేములవాడ, దుబ్బాక(సిద్దిపేట ప్రతినిధి), ఖానాపూర్‌:  కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతులకు చిప్పే మిగులుతుందని, రైతుబంధు పథకాన్ని అమలుచేసే క్రమంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు, ఇబ్బందులపై అవగాహన లేకపోవడంతోనే ఆ పార్టీ నేతలు సాధ్యంకాని హామీలను ఇస్తున్నారని, వాటిని నమ్మవద్దని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలను కోరారు. వ్యవసాయ భూములపైన హక్కులున్న రైతులకే రైతుబంధును వర్తింపజేయాలని, అలా కాకుండా కౌలు రైతులకు కూడా అమలుచేస్తే రైతుల భూములపై హక్కులను కోల్పోయో ప్రమాదం ఏర్పడుతుందని, అలా చేయడం సాధ్యంకాదని, అదే జరిగితే రైతులకు చిప్పే మిగులుతందని ఆదివారం జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ అన్నారు.

పంట పొలాలపై హక్కులున్న రైతులను పక్కబెట్టి కౌలు రైతులకు రైతుబంధును వర్తింపజేస్తే రైతుల భూములు ప్రమాదంలో పడతాయని అన్నారు. ఇప్పుడు తాము గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ కాంగ్రెస్ నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని, వారి మాటలు నమ్మితే మోసపోయి గోసపడుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తొందని గాలీ గత్తరంటూ లేనిపోని ప్రచారం చేసుకుంటున్నారని, “గాలి లేదు& గత్తర లేదు& ఉన్నదంతా బిఆర్‌ఎస్ ప్రభంజనమే” సిఎం కెసిఆర్ అన్నారు. అయినా వాల్లు గెలిచేది లేదు, సచ్చేది లేదని, బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. అక్కడొకడు, ఇక్కడొకడు కాంగ్రెసోల్లు గెలిచినా, వాళ్లు కెసిఆర్‌ను తిట్టడం తప్పా చేసేదేమీ ఉండదన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రా ప్రాంత నాయకుల కంటే ఎక్కువగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులే అన్యాయం చేశారని, వారిని తెలంగాణ సమాజం క్షమించదన్నారు.

నా తన్లాట… కొట్లాట..అంతా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసమేనని, తనకు పదవులు ముఖ్యం కాదని, పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన… ఆకాశమంత కీర్తి..ప్రతిష్టలు వచ్చాయి… బాగుచేసుకున్న తెలంగాణ ఎక్కడ ఆగమైపోతదోననే ఉద్దేశ్యంతోనే ఈ మాటలు చెబుతున్నానని అన్నారు. తెలంగాణ తేవడమే నాకు ఆకాశమంతా పెద్ద పదవని, దానిని మించిన పదవి ఇంకేమైనా ఉంటుందా అన్నారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా అవకాశమిస్తే రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేసి చూపించానన్నారు. వందశాతం పేదరికం లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే నా పంతం, కేరళ రాష్ట్రం మాదిరిగ వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు. రైతాంగం గుండె మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోయి పంటలు బ్రహ్మాండగా పండే తెలంగాణ కావాలని తాపత్రాయపడుతున్నానే తప్పా పదవుల కోసం కాదన్నారు. అందుకే ఓట్ల సమయంలో ఆగమాగమం కావద్దని, ఆలోచించి ఓటు వేయాలని, గత 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏంచేసింది, ఈ పదేళ్లలో బిఆర్‌ఎస్ పార్టీ ఏం చేసిందనే విషయాలపై గ్రామాల్లో చర్చ జరగాలన్నారు.

రాష్ట్రం ఎవరి చేతిలో పెడితే సురక్షితంగా ఉంటుంది…అనే అంశాలపై చర్చించాలని కోరారు. 30వ తేదిన ఓట్లు పడతాయి, 3వ తారీఖున లెక్కబడుతరు, ఆ తరువాత దుకాణం బంద్ అని అందరూ అనుకుంటరు…కానీ 3వ తారీఖునే అసలు దుకాణం చాలైతదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సీమాంద్ర పాలనలో 58 ఏళ్లు మంచినీళ్లు లేవు, కరెంట్ సక్కగా రాదు, సాగునీరు లేవు, దుబాయ్‌కి వలసపోయే బ్రతుకులు, చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతులు ఉరిపోసుకొని చచ్చుడు, భయంకర పరిస్థితులతో గొడగొడ ఏడ్చినం. 2004 ఎన్నికల్లో మాతో కలిసి పనిచేయండి, తెలంగాణ ఇస్తామని వాళ్లు చెబితే వాళ్లతో కలిసి ఎన్నికల్లో పోటీచేశాం. అయితే 2004 ఎన్నికల్లో ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా తెలంగాణ ఇవ్వకుండా ధోఖా చేసిండ్రు. ఇదేంటని అడిగితే అప్పటి పిసిసి అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు మాతోటి మీరు గెలిచారు తప్పా మీతోటి మేం గెలువలేదు…దమ్ముంటే రుజువు చేయమని సవాల్ విసిరితే తాను ఎంపి పదవికి రాజీనామా చేసి ఆయన ముఖం మీద కొట్టినా, అప్పుడు ఇదే జీవన్‌రెడ్డి సమైక్యవాదుల తరపున నాపై పోటీ చేస్తే 2.50 లక్షల మెజార్టీతో నన్ను మీరంతా గెలిపించారు. మీ పక్కనే ఉన్న వరద కాలువలో ఎప్పుడన్నా ఇన్ని నీళ్లుంటే రైతులు కాలువకు మోటార్లు పెట్టుకుంటే సహించక కరెంట్ తీగలు కోసి మోటార్లను నీళ్లలో తోయడమో, లేదంటే పోలీస్ స్టేషన్‌లోనో పెట్టి రైతులను అరిగోస పెట్టేవారన్నారు. కాలువకు నాలుగు తూములు పెట్టి చెరువులు నింపాలని కనీస ఆలోచన కూడా వారు చేయలేదన్నారు.

మూడేళ్లు నా నెత్తి పగులగొట్టుకొని రెవెన్యూ రికార్డులను శుద్దీకరణ చేసి ధరణి పోర్టల్ తీసుకువస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని రాహుల్‌గాంధీ అంటున్నాడని, ధరణిని తొలగిస్తే ఈ రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి, రైతుభీమా డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. వాళ్లు అధికారంలోకి వస్తే భూమాత తెస్తామని చెబుతున్నారని, వారు తెచ్చేది భూమాత కాదు, భూమేత అని మళ్లీ వెనుకటిలా మల్లయ్య భూమి ఎల్లయ్యకు, ఎల్లయ్య భూమి ఇంకొకల్లకు రాసి కొట్లాటలు పెడుతారని, వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, జగిత్యాలలో ఒకవేళ జీవన్‌రెడ్డి గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేదిలేదు, సచ్చేదిలేదని కెసిఆర్ అన్నారు. డాక్టర్ సంజయ్‌ని ఎంఎల్‌ఏగా గెలిపిస్తే కరీంనగర్‌కు ధీటుగా అభివృద్ది చేస్తానని, సంజయ్ అడిగిన ప్రతీ అవసరాన్ని తీరుస్తానని కెసిఆర్ హామీఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపి దామోదర్‌రావు, ఎంఎల్‌సి ఎల్.రమణ, మధుసూదనాచారి, మాజీ మంత్రి రాజేశంగౌడ్, జడ్పి చైర్‌పర్సన్ దావ వసంత, డిసిఎంఎస్ చైర్మెన్ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ చంద్రశేఖర్‌గౌడ్, మున్సిపల్ చైర్మెన్ గోలి శ్రీనివాస్, మాజీ జడ్పి చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కారు గుర్తుకు ఓటేయ్యండి:  కెసిఆర్
వేములవాడ: తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కారు గుర్తుకు ఓటేయ్యాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. వేములవాడ చాలా చైతన్యవంతమైన నియోజకవర్గమని, మేధావులు ఉండే ప్రాంతమని సీఎం అన్నారు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ ఉద్యమం చేశామని, అప్పుడు ఏడుగురు విద్యార్థులను కాల్చి చంపిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 55 ఏళ్ల పాలనలో మన బ్రతుకులు ఆగమయ్యాయని, 10 సంవత్సరాల బిఆర్‌ఎస్ పాలనలో ప్రజల బతుకులు బాగయ్యాయని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టెవాడు కాదన్నారు. వేములవాడ చుట్టు రింగ్ రోడ్డు వేశామని, పట్టణ అభివృద్దిపై ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు. మూలవాగు చుట్టు మంచి కాటేజిల నిర్మాణం చేసుకుందామన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రమేష్ బాబు సౌమ్యుడని, సియం కేసిఆర్ కొనియాడారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశాడని, పట్టణం చుట్టు రింగ్ రోడ్డు పట్టుబట్టి తీసుకొచ్చాడని అన్నారు. పౌరసత్వం వివాదం చేయబట్టే అభ్యర్థిని మార్చే పరిస్థితి వచ్చిందన్నారు. లక్ష్మి నర్సింహరావు యువకుడు, వేములవాడ ముఖ చిత్రాన్ని అభివృద్ది దిశగా మార్చుతాడు.. ఆశీర్వదించాలని కోరారు.
కత్తీ పోట్ల సంస్కారం ఎప్పుడైనా చూశామా: కెసిఆర్
దుబ్బాక: తెలంగాణలో ఎప్పుడైన కత్తి పోట్ల సంస్కారం చూశామా అని రాష్ట్ర ముఖ్యంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. కత్తులు పట్టుకొని రావాలంటే వారికంటే పెద్ద పోడవు కత్తులు తేగలుగుతామని అన్నారు. తమకు ఎంత కోపం వచ్చిన అణచివేసుకొని మర్యాదను పాటించామన్నారు. దేవుని దయ, ప్రజల ఆశీస్సులతో కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారని అన్నారు. కత్తి పోట్ల దాడి జరిగిన వెంటనే హరీశ్‌రావు హుటాహుటిన ఆసుపత్రికి పరుగెత్తుకుంటూ వచ్చారని అలాగే తాను సైతం వెంటనే ఆసుపత్రికి చేరుకొని ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించామన్నారు. శస్త్ర చికిత్స చేసి 15 సెంటీ మీటర్ల పేగును కత్తిరించి కడుపులో పెరుకపోయిన చెడు రక్తాన్ని వైద్యులు తొలగించారని అన్నారు. రామలింగారెడ్డి మరణించిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికలలో తాను దుబ్బాక ఎన్నికల ప్రచారానికి రాలేదని ఒక వేళ వచ్చి ఉంటే అప్పుడు బిజేపి కథ ఒడిసిపోయేదన్నారు. నోటికి వచ్చినట్లు వాగ్థానాలు చేసిన రఘునందన్‌రావు ప్రజల కోసం ఏమి చేయలేదన్నారు. మళ్లా కొత్త డ్రామాలు మొదలు పెట్టి ఆసైన్డ్ భూములను లాక్కుంటామని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

మూడవ సారి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న ఆసైన్డ్ భూములకు భూ బాధితులకే పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. 24 గంటల కరెంట్ వద్దు మూడు గంటలే సరిపోతుందని పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నాడని మూడు గంటలు సరిపోతుందా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో మళ్లీ కరెంట్ కష్టాలు వస్తాయన్నారు. బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే చేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా 157 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేస్తే తెలంగాణ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. అలాగే జిల్లాకో నవదోయ పాఠశాలలు ఏర్పాటు చేయాల్సి ఉన్న తెలంగాణకు ఒక్కటి కూడా మంజూరు చేయలేదన్నారు. దీనిపై ప్రదాని మోడీకి స్వయంగా తానే 100 ఉత్తరాలు రాసిన కనికరించలేదన్నారు. ఇప్పుడిప్పుడే తెల్లబడుతున్న తెలంగాణను ఆగం చేయడానికి కాంగ్రెస్, బిజేపోళ్లు అబద్దపు వాగ్థానాలు చేస్తున్నారని వారి మాటలను ప్రజలను నమ్మవద్దన్నారు. ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం పట్టించుకోలేదని ప్రజలు నీలదీయాలన్నారు.

మల్లన్న సాగర్‌తో ఒక్క లక్ష 75 వేల ఎకరాలకు కాల్వల ద్వారా సాగునీరు అందుతుందన్నారు. తాను ఈ స్ధాయిలో సీఎంగా నిలబడ్డానంటే దుబ్బాక ప్రభుత్వ పాఠశాలనే తనకు ఈ బిక్ష పెట్టిందన్నారు. దుబ్బాకపై తనకు ఎంతో ప్రేమ ఉందన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి రెండు సార్లు ఎంపీగా పని చేశాడని మూడవ సారి దుబ్బాక బిఆర్‌ఎస్ అభ్యర్ధిగా మీ ముందుకు వచ్చారని ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చీమకు సైతం హాని తలపెట్టని ప్రభాకర్ తనకు టికెట్ ఇవ్వమని కోరలేదని తానే టికేట్ ఇచ్చి మీ ముందుకు పంపానని అన్నారు. నెలలోపు దుబ్బాకను డివిజన్ కేంద్రంగా మార్చడంతో పాటు చుట్టు రింగురోడ్డు, కళాశాలలు లాంటి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని సిఎం కెసిఆర్ హమీ ఇచ్చారు.

ఖానాపూర్‌ను కేటిఆర్ దత్తత తీసుకుంటే…నేను తీసుకున్నట్లే: కెసిఆర్
ఖానాపూర్: సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు బాగలేకపోతేనే అభ్యర్థిని మార్చాననీ, అమెరికాలో ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నా జాన్సన్ నాయక్‌ను నేనే పిలిచి ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చానని భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. జాన్సన్ నాయక్ విద్యావంతుడు, సంపన్నుడని ఆయన అయితేనే ఖానాపూర్ నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని ఆలోచించి ఆయనకు టికెట్ ఇచ్చి ఇక్కడికి పంపించడం జరిగిందని, ఆయనకు ఒటు వేస్తే నాకు ఓటు వేసినట్లే అని నియోకవర్గ ప్రజలందరూ జాన్సన్‌ను ఆశీర్వాదించి ఎమ్మెల్యే గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ కెటిఆర్‌కు జాన్సన్‌ నాయక్‌లు క్లాస్‌మెట్లు అని మా కుటుంబ సభ్యుల్లో ఒకడని, నా కొడుకులాంటి వాడు కాబట్టి ఆయనను ఆశీర్వాదించాలని ప్రజా దీవెన సభలో జాన్సన్ నాయక్‌ను సిఎం కెసిఆర్ ఉద్దేశించి అన్నారు. ఖానాపూర్‌ను దత్తత తీసుకుంటానని, తనకు కేటిఆర్ చెప్పిండని ఖానాపూర్‌ను కేటిఆర్ దత్తకు తీసుకుంటే ఇక నేను తీసుకున్నట్లే కదా… ఖానాపూర్ సమస్యలన్నీ తీర్చే బాద్యత తనదేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత రాష్ట్రంలోని 3600 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి మావనాటే మావసాతే మా తండాలో మాదే రాజ్యాంగా తీర్చిదిద్దామన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో 7500 మందికి పోడు భూముల పట్టాలు ఇచ్చి వీళ్లందరికి రైతుబంధు, రైతుభీమా పథకాలు అందిస్తున్నామన్నారు. దేశంలో రైతులకు రైతు బంధు పథకం ఇచ్చేది ఒక కేసీఆరే అని ఆయన స్పష్టం చేశారు. సదర్మాట్, కడెం ఆయకట్టదారులకు పన్ను లేకుండా సాగునీరు అందిస్తున్నామని, దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనన్నారు. రైతులు ఎదుర్కొంటున్నా భూ సమస్యల పరిష్కారానికి ధరణి తీసుకొచ్చి ఇబ్బందులను తొలగించామని, మళ్లీ కాంగ్రెస్ పార్టీ వారు వస్తే ధరణిని తీసేస్తామంటున్నారని ధరణి ఉండాలన్న వద్దా అని ప్రజలను ప్రశ్నించారు. సదర్మాట్ ఆయకట్టను భ్యారేజీగా మార్చింది ఈ ప్రాంత రైతుల కోసమేనని ప్రత్యేక కాలువ అవసరం లేకుండా సాగునీరు అందిస్తామని ప్రస్తుతం 15వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని త్వరలో మరో 20వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. మాయమాటలు చెప్పే ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని మోసపోతే ఆగం అయ్యేది మనమేనని ఓటు వేసే ముందు అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నా బిఆర్‌ఎస్ పార్టీకే మరోసారీ పట్టంకట్టాలని, మూడోసారీ అధికారంలోకి వచ్చిన తరువాత గల్ఫ్ బాధితుల సమస్యలను కూడా తీరుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్థన్ రాథోడ్, మాజీ స్పీకర్ మధుసుధన చారీ, రాష్ట్ర నాయకులు పైడిపెల్లి రవీంధర్‌రావు, బదావత్ పూర్ణచందర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News