Friday, November 22, 2024

కాంగ్రెస్ పార్టీ మార్పు తెస్తామని చెబితే.. ప్రజలు ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు

- Advertisement -
- Advertisement -

ఈ మార్పు తిరోగమనంలా ఉంది
సాగర్‌లో నీళ్లున్నా రైతులకు నీళ్లివ్వడం ప్రభుత్వానికి చేతకావడం లేదు : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అవుతుందని.. ఈ సమయం తక్కువేం కాదని బిఆర్‌ఎస్ నాయకులు మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మార్పు తెస్తామని చెబితే..ప్రజలు ఆ పార్టీకి అవకాశం ఇచ్చారని.. ఈ మార్పు తిరోగమనంలా ఉందని విమర్శించారు. బిఆర్‌ఎస్ పాలనలో పొందిన అనేక అవకాశాలు ఇవాళ తెలంగాణ ప్రజలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో నీళ్లు లేక ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నాయకులు గ్యాదరి కిశోర్, నర్సింహ్మారెడ్డిలతో కలిసి ఎంఎల్‌ఎ జగదీశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కెసిఆర్‌పై నమ్మకంతో అత్యధికంగా యాసంగి పంట వేశారని.. కాంగ్రెస్ పార్టీ రావడంతోనే కరువు వచ్చిందని చెప్పారు. నాగార్జున సాగర్‌లో 510 అడుగుల నీరున్నా రైతులకు బిఆర్‌ఎస్ హయాంలో నీరు ఇచ్చామని, ప్రస్తుతం సాగర్‌లో నీళ్లున్నా ప్రభుత్వానికి రైతులకు నీళ్లివ్వడం చేతకావడం లేదని మండిపడ్డారు. కర్ణాటకలో నీళ్లున్నా.. ప్రభుత్వం కాంగ్రెస్సే ఉన్నా అడగడం చేతకావడం లేదని విమర్శించారు. మానవ బాంబులు అయితం.. పేగులు మెడలో వేసుకుంటాం అంటూ సిఎం రేవంత్‌ రెడ్డి ఏం భాష మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ రైతులు పేగులు  మెడలో వేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. వ్యవసాయరంగంపై సమీక్ష లేదని.. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. కాళేశ్వరంలో 400 క్యూసెక్కుల నీరు వృథాగా పోతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కరువు కనపడడం లేదని.. బిఆర్‌ఎస్ శంకుస్థాపనలు చేసిన పనులు మొదలుపెట్టుకుంటూ.. 90 రోజుల్లో అది చేశాం.. ఇది చేశామనీ గొప్పలు చెప్తున్నారని విమర్శించారు.

మేడిగడ్డ ప్రాజెక్ట్ కొట్టుకొని పోవాలని చూస్తున్నారని.. బిఆర్‌ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే నీటి పారుదలపై సమీక్ష చేయాలని.. రైతాంగానికి ఏం భరోసా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు మాని.. కరువు పర్యటన చేయాలన్నారు. గుత్తా అమిత్‌ రెడ్డిని ఎవరూ అడ్డుకోవడం లేదని.. ఆయనే ప్రకటన చేసుకున్నాడన్నారు. ఆయనే అడ్డుకుంటున్నారని చెబుతున్నారన్నారని పేర్కొన్నారు. రెండు రోజుల్లో నల్లగొండ, భువనగిరి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.

Jagadeesh Reddy 2

Jagadeesh Reddy 3

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News