Thursday, January 23, 2025

ఉద్యమ నేత కెసిఆర్‌ను కాదంటే..రాష్ట్రం ఆగమవుతుంది..!

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమ నేత చేతుల్లోంచి మరొకరి చేతుల్లోకి పోతే ఆగమవుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మునిపల్లి మండల పరిధిలోని చిన్నచెల్మెడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ నేతలు సింగూరు ప్రాజెక్టును హైదరాబాద్‌కు అప్పగించారని,మెదక్ జిల్లాను ఎండబెట్టారని ఆరోపించారు. రూ.2653 కోట్లతో ఈ ఎత్తి పోతల పథం నిర్మాణం జరుగుతోందన్నారు. నాడు సింగూరు జలాల కోసం ఏనాడు కాంగ్రెస్ నేతలు అప్పటి సిఎంను అడగ లేదన్నారు. వాన పడ్డా, పడకపోయినా రెండు పంటలు పండే భూములుగా మారబోతుందన్నారు.

ఎన్నికల ముందు నినాదాలు, ఎన్నికల తర్వాత పెదవి మూసుకున్న వారు కాంగ్రెస్ నేతలన్నారు. పోయేది ఒక పైసా, రెండు పైసలు..కానీ పారేది మాత్రం 98 శాతం భూములన్నారు. గోవిందా పూరు నుంచి 660 మీటర్లకు ఎత్తిపోయడం ద్వారా ఈ ఎత్తి పోతల పథకాన్ని సిఎం కెసిఆర్ ఆలోచించారన్నారు. కెసిఆర్ లాంటి నేత చేతిలో రాష్ట్రం ఉండడం వల్లనే ఇవన్నీ సాధ్యం అవుతున్నాయన్నారు. వేరొకరి చేతుల్లోకి పోతే ఏమవుతుందో అర్థం చేసుకోవాలన్నారు. అలాంటి ఉద్యమ నేతను కాదని, మరొకరి చేతుల్లోకి రాష్ట్రం పోతే…ఆగమవుతుందన్నారు. ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నాడు తండాలన్నింటిని గ్రామ పంచాయతీలుగా మారుస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఆ పని చేయలేకపోయారన్నారు.

కానీ, సిఎం కెసిఆర్ మాత్రం ప్రతి తండాను గ్రామ పంచాయతీగా మార్చారని తెలిపారు. సింగూరు నీళ్లు ఇక్కడి ప్రజల తాగు నీరు, సాగు నీరు, పరిశ్రమల అవసరాలకే ఉపయోగపడేలా బిఆర్‌ఎస్ చర్యలు తీసుకుందన్నారు. సంగారెడ్డికి ప్రభుత్వ వైద్య కళాశాల ఇవ్వడంతోపాటు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఆస్పత్రులను కూడా అభివృద్ధ్ది చేశామన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ ఇచ్చే బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మహిళలు ఆదరించాలన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా , ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతు పక్షపాతిగా సిఎం కెసిఆర్ నిలిచారన్నారు. దీనికి గాను రైతులు కూడా బిఆర్‌ఎస్‌ను ఆదరించాలని కోరారు.

జహీరాబాద్,ఆందోల్ వెనుక బడ్డ ప్రాంతాలు కాదని, వెనకపడేయబడిన ప్రాంతాలని హరీశ్‌రావు పేర్కొన్నారు.50 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని కేవలం 9 సంవత్సరాల్లో సిఎం కెసిఆర్ చేసి చూపించారని అన్నారు. అందువల్ల బిఆర్‌ఎస్‌ను ఆదరించడం ద్వారా కెసిఆర్‌ను మరింత బలోపేతం చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి ఛైర్‌పర్సన్ మంజుశ్రీ,జిల్లా కలెక్టర్ శరత్, ఎంపి బిబి పాటిల్, ఎంఎల్‌సి రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్‌రావు, చేనేత కార్పోరేషన్ ఛైర్మన్ చింత ప్రభాకర్, ఎస్‌పి రమణకుమార్, డిసిఎంస్ ఛైర్మన్ మల్కాపురం శివకుమార్, జాగృతి రాష్ట్ర నాయకుడు మఠం బిక్షపతి,సాయికుమార్, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News