Wednesday, January 22, 2025

ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే లైసెన్స్ రద్దుతో పాటు జైలుకే ?

- Advertisement -
- Advertisement -

10 నెలల్లో 13,765 మంది వాహనదారుల లైసెన్స్‌ల రద్దు
ట్రాఫిక్ పోలీసుల నివేదికతో చర్యలు చేపట్టిన రవాణాశాఖ అధికారులు
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డిలో అత్యధిక కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్: ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపే వారిపై రవాణాశాఖ చర్యలు చేపట్టింది. 10 నెలల్లో ర్యాష్‌ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమైన వారితో పాటు, డ్రంక్ డ్రైవ్ చేసిన వారి లైసెన్సులను రద్దు చేయడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే సుమారుగా 13 వేల పైచిలుకు వాహదాదారుల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు చేసినట్టు రవాణా శాఖ అధికారులు తెలిపారు. అందులో హైదరాబాద్ పరిధిలోనే 3207, గ్రేటర్ పరిధిలో 9,505 మంది లైసెన్స్‌లు రద్దు కావడం విశేషం. ప్రస్తుతం డ్రంక్‌డ్రైవ్‌తో పాటు ర్యాష్ డ్రైవింగ్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒకచోట ప్రమాదాలు జరగడంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ అధికారులు ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి నడుం బిగించారు. అందులో భాగంగానే ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆరునెలల వరకు లైసెన్స్‌ల రద్దు
ఈ నేపథ్యంలోనే నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై రవాణశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రవాణాశాఖ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ప్రమాదాలకు కారకులుగా భావించి ఏడాది కాలంలో 13,765 మంది వాహనదారుల లైసెన్స్‌లను రవాణాశాఖ రద్దు చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈనెల 22వ తేదీ వరకు జరిగిన ఈ కేసులకు సంబంధించి ఈ లైసెన్స్‌లు రద్దయిన వారిలో ఉన్నారు. ఇందులో అత్యధికంగా డ్రంక్ డ్రైవ్ కేసులే అని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువతే ప్రాణాలు పోగొట్టుకుంటున్నట్టు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్న వారిని ట్రాఫిక్ పోలీసులు గుర్తించి వారికి చలానాలు విధిస్తున్నారు. డ్రంక్ డ్రైవ్ చేస్తున్న వారికి జరిమానాలు వేస్తున్నారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో ఈ విధంగా వ్యవహారిస్తున్న, వాహనదారుల లైసెన్స్‌లను రద్దు చేయాలని రవాణాశాఖకు ట్రాఫిక్ పోలీసులు నివేదించారు. దీంతో స్పందించిన రవాణాశాఖ కొరడా ఝుళిపించింది. గతేడాదిలో ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడిపిన వాహనదారుల లైసెన్స్‌లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ విధంగా రద్దు చేసిన లైసెస్‌లను తిరిగి ఆరు నెలల వరకు పునరుద్దరించే అవకాశం ఉండదని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అతివేగం, రేసింగ్‌లకు పాల్పడితే రూ.5 వేలు జరిమానా
మొదటిసారి తాగి వాహనం నడిపి పట్టుబడితే రూ.10వేల జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి ఇదే నేరం చేస్తే రూ.15వేలు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇటువంటి వాహనదారులకు సంబంధించిన లైసెన్స్‌లను ఆరు నెలల పాటు రద్దు చేస్తారు. విదేశాలకు వెళ్లే యువత ఎక్కువ శాతం అంతర్జాతీయ లైసెన్స్ తీసుకుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి లైసెన్స్ సస్పెండ్ అయితే ఆరు నెలల వరకు తిరిగి లైసెన్స్ పునరుద్దరణ చేసుకునేందకు వీలుండదని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అతివేగం, రేసింగ్‌లకు పాల్పడే వారికి మొదటి నేరమైతే రూ.5వేలు జరిమానా, మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి దొరికితే రూ.10వేలు జరిమానా, ఏడాది వరకు జైలు శిక్ష ఉంటుంది. అయితే శిక్ష పడ్డ వారు మళ్లీ తిరిగి ఇలా చేస్తుంటే ట్రాఫిక్ పోలీసులు రవాణాశాఖకు ప్రతిపాదనలు రాగానే రవాణాశాఖ ఆన్‌లైన్‌లో వాహనదారులకు షోకాజ్ నోటీసు ఇచ్చి తర్వాత వారి లైసెన్స్‌లను సస్పెండ్ చేస్తుంది.
డ్రంక్ డ్రైవ్ కేసులు 7,564
రాష్ట్ర వ్యాప్తంగా రద్దయిన 13,765 లైసెన్స్‌ల్లో అత్యధికంగా డ్రంక్ డ్రైవ్ కేసులు 7,564 కాగా, ప్రమాదాలకు కారణమైన వాహదారులవి 783 వరకు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున ప్రతి నెలకు సుమారు 1,147 లైసెన్స్‌లను రవాణాశాఖ సస్పెండ్ చేసింది. రాష్ట్రంలో 70శాతం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ మూడు జిల్లాలోని కేసుల వివరాలు ఇలా…
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో అధిక వేగంగా ప్రయాణించిన వాహనాలకు సంబంధించి 13 లైసెన్స్ కేసులు, అధిక లోడ్ 84 లైసెన్స్ కేసులు, రవాణా వాహనాల్లో మనుషుల ప్రయాణానికి సంబంధించి ఒక్క కేసు, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేసే వాహనదారులకు సంబంధించి 10 లైసెన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి 5,757 కేసులు, ప్రమాదాలకు కారణమైన వాహనదారులవి 304 లైసెన్స్ కేసులు, కోర్టు కేసులు 198, ఇతర కేసులకు సంబంధించి 3,138 లైసెన్స్‌లను రద్దు చేసినట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు కమిటీ, రోడ్డు సేఫ్టీ మార్గనిర్దేశాల ప్రకారం చర్యలు: సి.రమేశ్, హైదరాబాద్ సంయుక్త రవాణాశాఖ అధికారి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏప్రిల్ నుంచి ఈనెల 22వ తేదీ వరకు 9,505 లైసెన్స్‌ను రద్దు చేసినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణాశాఖ అధికారి రమేశ్ తెలిపారు. హైదరాబాద్ పరిధిలో 3,207 లైసెన్సులు, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 3,433 లైసెన్స్‌లు, రంగారెడ్డిలో 2,865 లైసెన్స్‌లను రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రవాణా శాఖ, పోలీస్ శాఖతో డేటా షేరింగ్ అనుసంధానం ఉంది. వాళ్లు బుక్ చేసిన చలానాలకు, కొన్ని కేసుల్లో కూడా డ్రైవింగ్ లైసెన్‌లను కోర్టులు రద్దు చేస్తాయి. అటువంటి జాబితా రవాణా శాఖ అధికారుల వద్ద ఉండదని ఆయన తెలిపారు. అలానే మిగలినవి చూసుకుంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్‌కు సంబంధించి గతేడాది ఏప్రిల్ నుంచి ఈనెల 22వతేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,765 లైసెన్స్‌లను సస్పెండ్ చేశామన్నారు. ఇవి ముఖ్యంగా సుప్రీం కోర్టు కమిటీ రోడ్డు సేఫ్టీ మార్గనిర్దేశకాల ప్రకారం సస్పెండ్ చేశామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News