Friday, December 20, 2024

కాంగ్రెస్ కు ఓటు.. కరెంటుకు పోటే!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం.. ఇచ్చినమనేందుకు సిగ్గుండాలె

5 గంటలోడు వచ్చి 24గంటలు ఇస్తున్న మాకు సుద్దులు చెప్తుండు

మన తెలంగాణ/కోదాడ/సూర్యాపేట/యాదాద్రి భువనగిరి: గులాబీ జెండా లేకముందు తెలంగాణ పేరు ఎత్తినోడే లేకుండెనని, ఎవడన్నా మాట్లాడితే వాన్ని నక్సలైట్ అని, ఇంకోటి అని జైల్లో పెట్టి న పరిస్థితి ఉండేదని సీఎం కెసిఆర్ అన్నారు. ఆదివారం నాడు కోదాడ, తుంగతుర్తి, ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలలో సిఎం కెసిఆర్ ప్రసంగించారు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో ఆ రోజు నుంచే మొత్తం రాష్ట్రం పరిస్థితిని సమీక్ష చేసుకున్నామని, ఎన్నికలు పూర్తయినయని, టిఆర్‌ఎస్ పార్టీతో పార్టీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో గెలిచి అధికారంలోకి వచ్చింద ని వెల్లడించారు. తెలంగాణ ఇవ్వకుండా ఏళ్లు కాంగ్రెస్ ఏడిపించిందని విమర్శించారు. చివరికి కెసిఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చు డో అని దీక్ష చేస్తే, మీరంతా నాకు మద్దుతుగా పోరాడితే ఆ దెబ్బకు దిగొచ్చి తెలంగాణ ఇచ్చిండ్రని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ రా ష్ట్రం మేమే ఇచ్చినం అని చెప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలె అని కేసీఆర్ మండిపడ్డారు. ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మందిని జైల్లో పెట్టిండ్రని, కేసుల పేరుతో వేధింపులకు గురి చేసిండ్రని ఆయన గుర్తుచేశారు. చివరికి చెరుకు సుధాకర్‌ను కూడా పిడి కేసులు పెట్టి జైల్లో వేసిండ్రని గుర్తుచేశారు. కరెంటు 24 గంటలుండాల్నా? మూడు గంటలుండాల్నా? మీరందరూ ఆలోచించాలి. కర్ణాటక డిప్యూటీ సిఎం మాట్లాడుతూ మా కర్ణాటక రాష్ట్రంలో రైతులకు బ్రహ్మాండంగా 5 గం టల కరెంటు ఇస్తున్నం అంటుండు. 24 గంటల కరెం టు ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటల కరెంటు ఇస్తున్నమని చె ప్పటానికైనా ఇజ్జత్ ఉండాల్నా? లేదా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో నమ్మి ఓటు వేస్తే 5 గంటల కరెంటు ఇస్తే అక్కడి రైతులందరూ ధర్నాలు చేస్తున్నరని తెలిపారు. తెలంగాణలో కూడ నమ్మి ఓటేస్తే గ్యారంటీగా కాంగ్రెస్ కరెంటును కాట కలుపుతదన్నారు. కోదాడ బిసి, దళితులు, గిరిజనులు, ము స్లిం సోదరుల చైతన్యం ఈ ఎన్నికల ద్వారా బయటపడాలన్నారు.

మల్లయ్య యాదవ్‌ను ఓడగొట్టాలని కొందరు బలిసిన వాళ్లు ఒక్కటై కుట్రలు చేస్తున్నారన్నారు. కుట్రలు గెలువాల్నా? మ ల్లయ్య యాదవ్ గెలువాల్నా? అని మీరు ఆలోచించాలె అని అన్నారు. నవంబర్ 30 వరకూ ఈ చైతన్యం కొనసాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరును కలిసి ఓట్లు వేయించాలె అని తెలిపారు. భవిష్యత్తులో సాగర్ ఆయకట్టుకు గానీ, సూర్యపేట జిల్లాను గానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు. తెలంగాణకు సముద్రం లేదు. మన పారిశ్రామిక ఉత్పత్తులు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. విదేశాలకు ఎగుమతులు కూడా పెరుగబోతున్నాయని తెలిపారు. మచిలీపట్నం దగ్గర ఉంది కాబట్టి, కోదాడ ప్రాంతంలోనే వందల వేల ఎకరాల్లో డ్రై పోర్ట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. చావు నోట్లో తలకాయ పెట్టి కెసిఆర్ సచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో అని ఎట్లైతే మనం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామో, అట్లనే పోరాటం సాగాలేనన్నారు. యాదవ సోదరుల వృత్తి నైపుణ్యం పెరగాలని, మాంసం చేసే స్థాయికి ఉత్పత్తి పెరగాలని గొర్రెల పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ దేశంలో దళిత సోదరులను, ముస్లిం సోదరులను ఓట్లకు వాడుకున్న పార్టీ ఏది? భారతదేశంలో దళితుల బతుకుల బాగుచేయాలని ఎవడన్నా ఆలోచించాడా? ప్రతి దళిత సోదరునికి రూ.10 లక్షలు అందిస్తామన్నారు.

తెలంగాణ ప్రజలకు అండదండలు ఇచ్చే పార్టీ, తెలంగాణ బిడ్డల్ని కడుపులో పెట్టుకునే పార్టీ, తెలంగాణ ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునే పార్టీ బీఆర్‌ఎస్ పార్టీ అని అన్నారు. తెలంగాణకు బిఆర్‌ఎస్సే శ్రీరామరక్ష అని అన్నారు. కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరుకుంటూ తనను, మల్లయ్య యాదవ్ ను దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు వేస్ట్ అంటుండని, రాహూల్ గాంధీ, భట్టి, పిసిసి అధ్యక్షుడు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నడన్నారు. ధరణి తీసేస్తే రైతుబం ధు డబ్బులు, రైతు బీమా సొమ్ము, ధాన్యం కొంటే డబ్బులు ఎట్లా వస్తయ్?, ధరణి వల్ల ఎవరికి దరఖాస్తు పెట్టకుండా, ఎవరికి రూపాయి ఇవ్వకుండానే మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. గతంలో కాంగ్రెసోళ్లు ఆపద్భందు రూ.50 వేలకు చెప్పులరిగేలా ఆర్నెల్లు తిరిగినా ఐదు వేలో, పది వేలో చేతిలో పెట్టేటోళ్లన్నారు. ఎవరు అడుగకున్నా ధర్నాలు చేయకున్నా రైతు బంధు ఇచ్చామన్నారు. అంతకుముందు వందల్లో ఉన్న పెన్షన్‌ను వేలల్లోకి తీసుకెళ్లిందే కెసిఆర్ అని, మొదటి వెయ్యి, తర్వాత రెండు వేలు పెంచుకున్నామన్నారు. రాష్ట్రం ఆదాయం పెరుగుతున్నా కొద్దీ పెంచుకుం టూ వస్తున్నామన్నారు. నాలుగు వేల నుంచి ఐదు వేలకు పెం చుకోబోతున్నామని తెలిపారు. రైతుబంధును మొదట్లో నాలుగు వేలుగా, తర్వాత ఐదు వేలుగా పెట్టుకున్నాం. ఎన్నికల తర్వాత పన్నెండు వేల నుంచి దశలవారీగా పదహారు వేలకు పెంచుకుందామన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో రైతు బంధు వద్దు అంటున్నడు, జగదీష్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ ఏమో రైతు బంధు కావాలంటున్నడు, ఎవరు కావాల్నో మీరు ఆలోచించాలె అని అన్నారు. 70 ఏండ్లపైబడి ఉన్న పెద్ద పెద్ద రాష్ట్రాలన్నింటినీ తలదన్ని నేడు తెలంగాణ తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగాలే అభివృద్ధికి సూచికగా పరిగణిస్తామని తెలిపారు. భారతదేశంలోనే 3,18,00 రూపాయలతో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నంబర్ వన్‌గా ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయం ఎంత? ఇప్పుడెంత? ఆనాడు తలసరి విద్యుత్ వినియోగం కేవలం 1100 యూనిట్లు మాత్రమే. నేడు తలసరి విద్యుత్ వినియోగం 2200 యూనిట్లు అంటే డబుల్ అయిందన్నారు. ఈ సదుపాయాలన్నీ కోల్పోదామా? ఉంచుకుందామా? అని మీరు ఆలోచించాలెనని కోరుతున్నానని తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రణాళిక రాస్తున్నప్పుడు తనతోపాటే పలువురు రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు ఉన్నారని, పెన్షన్‌లు ఎందుకు ఇవ్వాలి?అనే ప్రశ్న వేస్తే ఒక్కరూ సరైన సమాధానం చెప్పలేదని తెలిపారు. అనుకోకుండా విధి వంచితులు అయ్యే అభాగ్యుల కోసం, ఆసరా లేని వారి కోసం పెన్షన్‌లు అని వెల్లడించారు. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే మనం విజ్ఞతతో ఆలోచన చేయాలన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏండ్లు అయినా మనం ఎవరో చెప్పిండ్రని గాయి గత్తరగా ఓటేయ్యొద్దని సూచించారు.

ఓటు మన తలరాతను మారుస్తది అని అన్నారు. మన భవిష్యత్తును నిర్ణయం చేస్తది. ఓటేసే ముందు పార్టీల వైఖరి, దృక్ఫథం తెలుసుకోవాలన్నారు. పంటపొలాలు పండాల్నా? ఎండాల్నా? ఆలోచన చేసేది ఓటు. మన చేతుల్లో ఉన్న బ్రహ్మాస్త్రం ఓటు. ప్రజాస్వామ్యంలో దాన్ని మించిన శక్తి లేదు.ప్రజలను నమ్ముకొనే తెలంగాణ ఉద్యమాన్ని పెట్టినం అని అన్నారు. కోదాడలో నాడు నీళ్ల కోసం ధర్నాలు చేసే పరిస్థితి ఉండేదన్నారు. 2003 లో పంట పొలాలు పండించుకోండని నీళ్లు విడిచి ఆపేసినారన్నారు. 24 గంటల్లో నీళ్లు ఇవ్వకపోతే 5 లక్షల మందితో ధర్నాకొస్తమని ఆనాటి ప్రభుత్వానికి ఆల్టిమేటం ఇస్తే నీళ్లిచ్చిండ్రు అని గుర్తు చేశారు. కొత్త తరం పిల్లలు మన చరిత్రను తెలుసుకోవాలన్నారు. నాగార్జునా సా గర్ ప్రాజెక్ట్ అసలు పేరు నందికొండ ప్రాజెక్ట్ అని పేర్కొంటూ నందికొండ ప్రాజెక్ట్ ను ఇప్పుడున్న దానికంటే 20 కి.మీ. ఎగువన ఏలేశ్వరం దగ్గర కట్టాల్సి ఉండెనన్నారు. నందికొండ ప్రాజెక్ట్ ను గోల్ మాల్ చేసి దిగువకు తీసుకొచ్చిండ్రు. ఫలితంగా తెలంగాణకు తక్కువ నీళ్లు అనే కుట్ర జరిగిందని విమర్శించారు. నాడు కాంగ్రెస్ నాయకులు మౌనం గా నోరుమూసుకొని ఉండటం వల్ల ఈరోజు మనం శిక్ష అనుభవిస్తున్నాం, మనకు శాపం తగిలిందన్నారు.

ఆనాటి నుంచి ఈనాటి వరకూ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందని మీమీ ఊర్లల్లకు పోయా క చర్చ చేయాలని పిలుపునిచ్చారు. ఉన్న తెలంగాణను, ఉన్న హైదరాబాద్‌ను ఊడగొట్టింది ఎవరు? అని ప్రశ్నించారు. కడుదామనుకున్న ప్రాజెక్టులు ఆపింది ఎవరు? వాటిని ఆపితే నోరు మూసుకొని ఉన్న దద్దమ్మలు ఏ పార్టీ వాళ్లు? నాటి చిన్న పొరపాటుకు మళ్లీ తాను పోరాటం మొదలు పెట్టేదాక మాట్లాడిన మొగోడే లేరన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎన్నడూ కూడా సమైక్య రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులతో కొట్లాడి మన హక్కుల గురించి కొట్లాడలేదని తెలిపారు. మరో 15 రోజుల్లో నీళ్లు వదిలేలా చేసి పంటల్ని కాపాడుకునే బాధ్యత తనదేనన్నారు. ఆసిఫ్ నగర్ కెనాల్ ఉదయ సము ద్రం దాకా వస్తది. కాళేశ్వరం జలాలు మూసీ దాటించి ఉద య సముద్రంలోకి పంపిస్తే పెద్దదేవుల పల్లి చెరువులో కలుస్తాయన్నారు. కోదాడ, నాగార్జున సాగర్, హుజూర్ నగర్‌లకు జీవితంలో నీళ్ల కరువు రాదు. రెండు పంటలు పండుతయ్ అని అన్నారు. మనసు పెట్టి ఆలోచన చేయాలె. అర్ధం కాకుం టే పెద్దల్ని అడగాలె. నిజా నిజాలు గమనించి మనం ఎప్పటివరకైతే నిజం వైపు నడువమో అప్పటిదాకా మనం ఓడిపోతనే ఉంటం అని అన్నారు. మల్లయ్య యాదవ్ ఒక బిసి బిడ్డ, కోదాడలో చాలా ఏండ్ల నుంచి ఒక బిసికి అవకాశం రాలేదు. విద్యావంతుడని రెండోసారి కూడా అవకాశం ఇచ్చిన. నవంబర్ 30 నాడు మీ తడాఖా చూపాలె అని అన్నారు. ఆర్నెళ్ల నుంచి మల్లయ్య యాదవ్ గెలువడని నా దగ్గరకొచ్చి ఒకటే గులుగుడు.

గెలుకపోతే గెలువకపాయె అయినా నేను టిక్కెట్ ఇస్తా అన్న..ఇచ్చిన. కోదాడలోని బిసి,ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలకు చెందిన చదువుకున్నటువంటి, ఉద్యోగాలు చేస్తున్నటువంటి, రిటైర్ అయినటువంటి బిసిల చైతన్యం మొత్తం కనబడాలే అని అన్నారు. 60 శాతం ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలు ఎందుకు ఓడిపోవాలె? ఆ చైతన్యాన్ని చూపెట్టాల్సిన బాధ్యత కోదాడ మీద ఉంది. కోదాడలో విజయ బావుటా ఎగురేయాలన్నారు. మల్లయ్య యాదవ్ ను బంపర్ మెజార్టీతో గెలిపించండి, కోదాడలో రూ.10 కోట్లతో బిసి భవన్ కట్టించే బాధ్యత తనదేనన్నారు. ఆనాడు నీళ్ల కోసం చేసిన తండ్లాటలో తాను కోదాడ నుంచి హాలియా వరకు రెండో పాదయాత్ర చేసిన అని తెలిపారు. కోదాడ, బాలాజీనగర్ ప్రాంతాల్లో ఆనాడు ఎక్కడ చూసినా మొరం కుప్పలు కనిపించేవి, రైతులందరూ దిక్కులేక క్రేన్లు పెట్టి బావులు తవ్వుతుండేది. ఆ బావులను చూస్తూ ఎంతో బాధపడ్డానన్నారు. ఇలాంటి పీడలు పోవాలంటే పసలేని పిసపిస మాట్లాడే కాంగ్రెస్ నాయకులతోని కాదు. బీఆర్‌ఎస్‌తోనే అవుతవి అని అన్నారు. కర్ణుడుకి కవచ కుండలాలు ఎట్లనో తెలంగాణకు బిఆర్‌ఎస్ అట్ల అని అన్నారు. బిఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన, ప్రయోజనాల కోసం. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడి వారికి అడుగడుగునా కాపాలా ఉండటం కోసం, ఒకే ప్రాజెక్ట్ మీద రెండు కాలువలుంటే.. కుడి కాలువకో నీతి.. ఎడమ కాలువకో నీతియా.. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించానన్నారు. కోదాడలో పాదయాత్రకు పోతే నాకు కాళేశ్వరం నీళ్లే కనిపించలేదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సిగ్గులేకుండా అబద్ధాలు చెప్తున్నడన్నారు. దాదాపు మూడున్నర సంవత్సరాల నుంచి నడిగూడెం, మోతే, మునగాల మండలాలకు కాళేశ్వరం నీళ్లు వస్తున్నయ్. పంటలు పండుతున్నయ్ అని తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీళ్లను అనుసంధానం చేయిస్తామని వెల్లడించారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పంటలు పచ్చగా పండాలంటే పాసుబండ్ల కాంగ్రెస్‌తోని కాదన్నారు. ఇవ్వాల కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాళేశ్వరం నీళ్లు జన్మల కూడా రాకపోవన్నారు. మీ ఆశీస్సులతోనే బీఆర్‌ఎస్ గెలువపోతావున్నదని తెలిపారు. గత వందేండ్లలో తెలంగాణ ఎప్పుడూ ఉద్యమాలతో అట్టుడుకుతా ఉండేది, బతుకపోవుడు, ఆరిపోవుడు, వలసపోవుడు, ఎండిన పంటలు, రైతుల ఆత్మహత్యలు లాంటి దారుణమైన పరిస్థితులు నాడు ఉండేవి.గత పదేండ్ల నుంచి బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ రాలే, కరువు లేదు, బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయన్నారు. 24 గంటల కరెంటు వస్తున్నదని వెల్లడించారు.
తుంగతుర్తి ప్రాంతమంతా పోరాటాల గడ్డ
తుంగతుర్తి ప్రాంతమంతా పోరాటాల గడ్డ. కరువుకు గురైం ది. నాడు ఏ ఊరికి పోయినా చెరువుల్లో చారెడు నీళ్లు కనిపించేవి కావు. నేడు తుంగతుర్తిలో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తయ్ అని అన్నారు. తుంగతుర్తిని చూస్తే ఒక తృప్తి కలుగుతున్నదని, గతంలో ఉన్న బాధలు ఇప్పుడు లేవు. మీ ముఖాల్లో సంతోషం కనిపిస్తున్నదని వెల్లడించారు. అనుకోకుండా విధివంచితులైన దివ్యాంగులు, వితంతువులు, అనాధలను ఆదుకునే బాధ్యత సమాజంపై, ప్రభుత్వంపై ఉంటది అని అన్నారు. ఆనాడు లెక్కలన్నీ తీసి అధికారులు పెన్షన్‌ను ఆరువందలు పెట్టమంటే భావ్యం కాదని చెప్పి వెయ్యి రూపాయలు పెట్టానన్నారు. ఆ తర్వాత పెన్షన్ రెండు వేలకు పెం చుకున్నామన్నారు. ఆనాటి ఆర్థిక పరిస్థితులను బట్టి యాభై వేలతో కళ్యాణ లక్ష్మి ప్రారంభించినం. ఆ తర్వాత 75 వేలకు పెంచుకున్నాం. ఇప్పుడు లక్షా పదహారు వేల రూపాయలకు పెంచి ఇస్తున్నామని వెల్లడించారు. ఆనాడు రైతులు కో ఆపరేటివ్ బ్యాంకుల్లో అప్పులు కట్టకుంటే దర్వాజలు తీసుకపోయిండ్రు తప్ప రైతులకు సాయం చేయాలని ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదన్నారు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా రైతుబంధును పుట్టించి, పేద రైతుల బాధలు పోవడానికే రైతుబంధును ప్రారంభించినమన్నారు. విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, ఐక్యరాజ్య సమితిలు కూడా రైతుబంధుకు కితాబు నిచ్చారని గుర్తు చేశారు. తొమ్మిదిన్నరేండ్లలోనే ఎన్నో పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ నంబర్ వన్ గా ఉండటం ఎంతో గర్వకారణమన్నారు. గొర్రెల పెంపకం దారులకు గొర్రెలు, చేపల పెంపకం దారులకు చేపలు అందిస్తే 33 వేల కోట్ల రూపాయల చేపలను తెలంగాణ అమ్మిందని వెల్లడించారు. సుక్క నీరు లేని తిర్మలగిరి, తుంగతుర్తిలలో నేడు ఎండా కాలంలో కూడా మత్తెడులు దుంకుతూ మత్స్య సంపద కూడా పెరిగిందన్నారు. యూపీలో అన్నానికి గతిలేదు. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ ల నుంచి నాట్లేయడానికి మన దగ్గరికి కూలీలు బతకడానికి వస్తున్నరు. ఆ సీఎం లు వచ్చి మనకు పాఠాలు చెబుతున్నరు? ఇక ఏం నవ్వాల్నో అర్థం కాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు పిడికెడు మందితో బయలుదేరాం. ప్రారంభించామన్నారు. మేం ఉద్యమానికి ద్రోహం చేస్తేవదిలేస్తే మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపండ్రి అని ప్రజలతో సీరియస్ గా చెప్పినామని గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్, బిజెపి నాయకులెవరూ ఉద్యమంలో కలిసి రాలేదు. రాజీనామా చేయాలంటే పారిపోయిండ్రని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపోళ్లు పదవులు, పైసలే మాకు ప్రామాణికమని చెప్పిండ్రు. ఉద్యమంలో కలిసి రాలేదన్నారు. నల్లగొండ జిల్లా దామెరచర్ల మండలంలో 30 వేల కోట్ల రూపాయలతో భారతదేశంలోనే మొట్టమొదటి ఆల్ట్రా మె గా పవర్ ప్లాంట్ రాబోతున్నదన్నారు. 4000 మెగా వాట్ల విద్యుత్ అదనంగా ఉత్పత్తి కాబోతున్నదని వెల్లడించారు.జవహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధాని అయిన్నాడే దళితుల చరిత్ర చాలా దారుణంగా ఉండేది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో అంబెద్కర్ మాట గౌరవించి దళితుల అభివృద్దికి శ్రీకారం చుడితే 75 ఏండ్ల స్వతంత్రం తర్వాత దళితులకు ఈ దుస్థితి ఎందుకుండేది? అని ప్రశ్నించారు.

దళిత బంధు గురించి ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు..కొట్లాడలేదన్నారు. గ్యాదరి కిశోర్ కొట్లాడి తిర్మలగిరి మండలాన్ని దళితబంధు లో పెట్టించిండని అన్నారు. కిశోర్ చేసిన సేవకు, తెచ్చిన నీళ్లకు, సబ్ స్టేషన్లకు ఈసారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలే అని విజ్ఞప్తి చేశారు. మొదటి నుంచి ఉద్యమంలో నా తో ఉండి, పోలీసులతో దెబ్బలు తిని, జైలుకు పోయినోడు గ్యా దరి కిశోర్ అని అన్నారు. లక్ష మెజార్టీతో గెలిపిస్తే మొత్తం తుంగతుర్తికి దళిత బంధును పెడుతానన్నారు. గతంలో అ ధ్వాన్నంగా ఉన్న దంతాలపల్లి రోడ్డును బ్రహ్మండంగా చేసినమన్నారు. మా తండాల్లో మా రాజ్యం కావాలనే నినాదాన్ని నిజం చేస్తూ తాండాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని వెల్లడించారు.తుంగతుర్తి నియోజకవర్గంలో 27 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నం. గిరిజనుల అభివృద్ధి కోసం పోడుపట్టాలను కూడా ఇస్తున్నామన్నా రు. గ్యాదరి కిశోర్ పట్టుదలతో వంద పడకల ఆసుపత్రిని తె చ్చాడన్నారు. కిడ్నీ రోగులకు 103 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి, వాళ్లకు పెన్షన్ ను వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసుకున్నామన్నారు. ఎన్నికల తర్వాత మూడు వేల నుంచి ఐదు వేలు చేస్తామని వెల్లడించారు. గతంలో తుంగతుర్తి ప్రాంతంలో కమ్యూనిస్ట్, కాంగ్రెస్ ల కొట్లాటలతో హత్యలు, కేసులు ఉండేవి. స్థూపాలు కనిపించేవి. నాడు వల్లకాడులుగా ఉన్న తుంగతుర్తి నేడు అద్భుతంగా అభివృద్ధి చెం దింది..చెందుతున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లేక గత పదేండ్ల నుంచి ఆవురావురుమని ఆకలితో ఉన్నదని, ఛాన్స్ ఇస్తే గొర్రెల మంద మీద తొడేండ్లు పడ్డట్టుగా పడదామని రెడీ గా ఉందన్నారు.
సునీత నా బిడ్డ.. ఆశీర్వదించండి…
సునీత ఎమ్మెల్యే కాకముందు తెలంగాణ రాకముందు ఆలేరు నియోజక వర్గం పరిస్థితి ఎట్లాఉండే. ఇప్పుడు ఎట్లా ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరువు ఏర్పడి .సాగు, త్రాగు నీళ్లు లేకుండేవి. ఒక్కో రైతు డజను బోర్లు వేసినా నీళ్లు రాక అప్పుల పాలయ్యారని వెల్లడించారు.ఎన్నికలు వస్తే ఆవేశంతో పనిచేయోద్దు. ఆలోచనతో పని చేయాలన్నారు. సరైన పార్టీకీ ఓటు వేస్తే నాయకులు గెలువడం కాదు. ప్రజలు గెలవడం ప్రారంభమైతదన్నారు. అందరి సంక్షేమం గురించి ఆలోచించి ఓటేయాలన్నారు. యాదగిరి గుట్ట ఒక నాడు ఎలా ఉండేది, కళియుగ వైకుంఠధామం వంటి పుణ్యక్షేత్రాన్ని మనం నిర్మించుకున్నామన్నారు. ఆలేరు నియోజకవర్గం హైదరాబాద్ నుంచి వచ్చి పెద్ద పెద్ద షావుకారులు అగ్గువకే భూములు కొనుక్కుని వెళ్లారన్నారు. ఆనాడు భూములు తక్కువ ధరకు లభించేవి. ఈ నాడు ధరలు పెరిగాయి. ఎవరి వల్ల పెరిగాయో మీకు తె లుసునన్నారు.సునీతనాబిడ్డ. ఎమ్మెల్యే కాకముందు 2001 లో ఉద్యమ జెండా ఎగర వేసినాడు .పిడికెడు మంది ఉన్నరు. అందులోసునీత కూడా ఒక్కరన్నారు. జడ్పీటీసీ గా గెలిచి రెండు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచిందన్నారు.

బిడ్డ అని చెప్పిన తర్వాత సునీత అడిగితే కాదనేదీ ఏమీ ఉండదని, మీ నియోజకవర్గం గురించి ఏది అడిగినా ఇస్తానన్నారు. బిడ్డకు తండ్రి మీద సాగుతది. ఆమె కోరికలు అన్ని తీరుతయి అని అన్నా రు. రాహూల్ గాంధీకి ఎద్దు ఎరుకనా. ఎవుసం ఎరుకనా? ఎవడో పిచ్చోడు రాసిస్తే చిలుక పలుకులు పలుకుతున్నడు. ఇక్కడి సన్నాసులు రాసిస్తున్నారు. కాకతీయ ఎక్స్ ప్రెస్ లో ఆలేరు నుంచి హైదరాబాద్ కు వెళ్లేవారన్నారు. కూలీ చేసి తిరిగి వచ్చేవారని తెలిపారు. మల్లన్న సాగర్ ఎప్పుడూ ఆలేరు నెత్తిమీద కుండ లాగ ఉంటుందన్నారు. గంధమల్ల చెరువు ఎండా కాలంలో మత్తడి దునికే పరిస్థితి ఉందని, ఆలేరు మండలం మొత్తానికి బస్వాపురం రిజర్వాయర్ ద్వారా సరిపడా నీళ్లు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో ఆలేరులో 27 వేల ఎకరాలు యాసంగిలో పారేది. ఇప్పుడు 2 లక్షల 16 వేల ఎకరాలు పారుతున్నాయని గుర్తు చేశారు. ఇదంతా సునీత చలువేనన్నారు.
నీళ్లు పారించే సునీత గెలువాలని ఆకాంక్షించారు. యాదగిరి గుట్ట గురించి కాంగ్రెస్ పాలనలో పట్టించుకోలేదని, యాదగిరి గుట్ట శిఖరం ఎత్తున బిఆర్‌ఎస్‌కు కు ఓట్లు పడాలన్నారు. భిక్షమయ్య గౌడ్‌కు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు. ఉద్యమ కాలంలో కూ డా నా వెంట నడిచిన సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కల్లూరు రాంచంద్రారెడ్డి తన అనుచరులతో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎంపీపీలు, సర్పంచ్ లు చేరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్, ఎమ్మె ల్సీ మధుసూదనాచారి, బొంతు రామ్మోహన్, గొంగిడి సునీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News