న్యూఢిల్లీ : ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి ఒకరు శుక్రవారంర ఢిల్లీ చాణక్యపురి ప్రాంతంలో ఒక భవనం నాలుగవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆయన మృతిపై అనుమానాలు ఏవీ లేవని పోలీస్ అధికారి చెప్పారు. పోలీసుల సమాచారం ప్రకారం, విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ)లో విదేశీ ఉద్యోగాలు, వలసదారుల పరిరక్షణ విభాగం (ఒఇపిజిఇ) డైరెక్టర్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ అధికారి డిప్రెషన్‌కు చికిత్స చేయించుకుంటున్నారని, ఆయన తల్లి ఎంఇఎ సొసైటీలో మొదటి అంతస్తులో ఆయనతో పాటు నివసిస్తున్నారని అధికార వర్గాలు తెలియజేశాయి. 35, 40 ఏళ్ల మధ్య వయస్కుడైన జితేంద్ర రావత్‌గా గుర్తించిన మృతుడు మొదటి అంతస్తులో నివసిస్తున్నారు. ఆయన భవనం నాలుగవ అంతస్తుకు వెళ్లి కిందకు దూకారు.
ఆ ప్రదేశంలో మాకు ఎటువంటి ఆత్మహత్య పత్రమూ లభించలేదు’ అని పోలీస్ అధికారి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, వారికి సొసైటీ సెక్యూరిటీ గార్డు నుంచి ఉదయం 6.20 గంటలకు ఈ ఘటనకు సంబంధించి ఒక పిసిఆర్ కాల్ వచ్చింది. ఆ అధికారిని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆయన మరణించినట్లుగా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ప్రకటించారు. ‘ఆయన భార్య, పిల్లలు డెహ్రాడూన్‌లో ఉంటున్నారు. వారికి ఈ ఘటన గురించి సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు ఢిల్లీకి బయలుదేరారు’ అని పోలీస్ శాఖ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. కాగా, ఢిల్లీలో తమ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న ఒక అధికారి శుక్రవారం ఉదయం ‘మరణించారు’ అని ఎంఇఎ తెలిపింది. కానీ ఆయన పేరును మంత్రిత్వశాఖ వెల్లడించలేదు. మృతుని కుటుంబానికి సాధ్యమైన సహాయం అందజేస్తున్నామని, ఢిల్లీ పోలీసులను సంప్రదిస్తున్నామని మంత్రిత్వశాఖ తెలియజేసింది.