మనతెలంగాణ/హైదరాబాద్ : ములుగు అటవీ కళాశాలలో బిఎస్‌సి ఫారెస్ట్రీ పూర్తి చేసిన రాజు (2017 -బ్యాచ్)కు మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో ఐఎఫ్‌ఎస్ 86వ ర్యాంకు దక్కింది. జాతీయ స్థాయి అధికారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ములుగులో అటవీ కళాశాలను నెలకొల్పారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కళాశాలల్లో ర్యాంకులు పొంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న కళాశాల విద్యార్థులు. అటవీ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన రాజు స్వస్థలం జనగామ జిల్లా సూరారం గ్రామం. గతేడాది బిఎస్‌సి ఫారెస్ట్రీ పూర్తిచేసి రాజు ప్రస్తుతం ఎంఎస్సీ చదువుతున్నాడు. మొదటి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్‌ను సాధించాడు. తన విజయానికి కారణమైన ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు అటవీ కళాశాల డీన్ ప్రియాంక వర్గీస్, పిసిసిఎఫ్ డోబ్రియల్, శాంతికుమారి,అధికారులు శ్రీనివాస్, నర్సింహా, అధ్యాపకులకు రాజు కృతజ్జతలు తెలిపారు.