Sunday, December 22, 2024

ఎన్నికల వేళ…పాతబస్తీలో ఇఫ్తార్ రాజకీయాలు…!

- Advertisement -
- Advertisement -

ఇఫ్తార్ పార్టీలతో జనంలోకి మజ్లిస్ నేతలు
ఓటర్లను అకట్టుకునేందుకు పడరాని పాట్లు

మన తెలంగాణ / హైదరాబాద్ : ముస్లింల పవిత్ర మాసం రంజాన్ అంటే మనకు గుర్తుకు వచ్చేది ఇఫ్తార్ విందులు… అది ఎన్నికల సమయంలో అయితే ఇక చెప్పనక్కర లేదు. ఓట్ల కోసం తాపత్రపడే రాజకీయ నేతలు ఇఫ్తార్ పార్టీల పేరుతో ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడడం సహజం. పార్లమెంటు ఎన్నికల వేళ ఇప్పుడు హైదరాబాద్ పార్లామెంటు నియోజకవర్గ పరిధిలో అదే జరుగుతోంది. ఇఫ్తార్ విందు రాజకీయాలు ఊపందుకున్నాయి. గత కొంత కాలంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఓటింగ్ సరళి నెమ్మదిస్తూ వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలను చూస్తే అతి తక్కువ పోలింగ్ జరిగింది హైదరాబాద్‌లోనే. ఎంఐఎం సామ్రాజ్యంగా చెప్పుకునే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో మెజారిటీ వర్గం ముస్లిం మైనారిటీలు.

అయినప్పటికీ ఓటింగ్ సరళి పడిపోతూ వస్తోంది. ముఖ్యంగా చదువుకు యువత ఓటింగ్‌కు ఆసక్తి కనబరుచడం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 40 శాతం లోపే పోలింగ్ జరగడం ఆందోళన కల్గిస్తోంది. ఎంఐఎంకు పోలయ్యే ఓట్ల శాతం కూడా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి పార్లమెంటు ఎన్నికలను ఎంఐఎం తేలిగ్గా తీసుకోవడం లేదు. ప్రధాన ప్రత్యర్థి బిజెపి ఈ సారి మహిళను రంగంలోకి దింపడం, బిజెపి జాతీయ నాయకత్వం హైదరాబాద్‌పై గురి పెట్టడంతో ఎంఐఎం శ్రేణులు అప్రమత్తమయ్యాయి. దేశవ్యాప్తంగా పోటీ చేస్తామన్న ఎంఐఎంను హైదరాబాద్‌కే కట్టడి చేసేందుకు కమలనాథులు పాచికలు పారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు మరో రెండు చోట్ల ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించింది. మరిన్ని రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా అసదుద్దీన్ ఓవైసి ఇతర రాష్ట్రాల కంటే హైదరాబాద్‌పైనే ఎక్కువ దృష్టి సారించినట్లు కనబడుతోంది. ఆయన ప్రతిరోజు హైదరాబాద్‌లోనే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతుండడంతో ఆ పార్టీ నేతలు ప్రతిరోజు ఇఫ్తార్ పార్టీలతో ఓటర్లను ఆకట్టుకునే యత్నాలు చేస్తున్నారు. ఎంఐఎం అగ్రనేతలు అసదుద్దీన్ ఓవైసి, అక్బరుద్దీన్ ఓవైసితో పాటు ఆ పార్టీ ఎంఎల్‌ఎలు ఇఫ్తార్ విందుల్లో పాల్తొంటూ ఓటర్లను దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి ప్రతి రోజూ ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటున్నారు. అసదుద్దీన్ సోదరుడు, ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఓవైసి ఏకంగా చారిత్రాత్మక మక్కా మసీదులో ప్రతి రోజు 1500 మందికి ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. రంజాన్ ఉపవాసాలు కొనసాగినన్ని రోజులు ఈ విందు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే సాలార్ ఎ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, హబీబ్ ఎ మిల్లత్ పోలిటికల్ రిసెర్చ్ సెంటర్ తరఫున ఆయన ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏది ఏమైనా ఇఫ్తార్ రాజకీయాలతో మజ్లిస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుందని రాజకీయ వర్గాలు భా౩విస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News