Tuesday, December 24, 2024

ఫ్రెంచ్ క్వీన్ స్వియాటెక్

- Advertisement -
- Advertisement -

ఫ్రెంచ్ క్వీన్ స్వియాటెక్
ఇగా ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్
రూడ్‌తో నాదల్ ఢీ
నేడు పురుషుల సింగిల్స్ తుది పోరు
పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ క్రీడాకారిణి, పోలండ్ యువ సంచలనం ఇగా స్వియాటెక్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ ఇగా 6-1, 6-3 తేడాతో అమెరికాకు చెందిన యువ క్రీడాకారిణి కొకొ గాఫ్‌ను ఓడించింది. స్వియాటెక్‌కు ఇది రెండో ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. ఇక ఫైనల్ మ్యాచ్‌లో ఇగా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. కళ్లు చెదిరే షాట్లతో గాఫ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక స్వియాటెక్ ధాటికి అమెరికా యువ సంచలనం గాఫ్ ఎదురు నిలువలేక పోయింది. ఏ దశలోనూ ఇగాకు పోటీ ఇవ్వలేక పోయింది. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో విరుచుకు పడిన ఇగా అలవోకగా తొలి సెట్‌ను దక్కించుకుంది. ఈ సెట్‌లో గాఫ్ కేవలం ఒక్క గేమ్‌ను మాత్రమే గెలిచింది. అయితే రెండో సెట్‌లో గాఫ్ కాస్త పోటీ ఇచ్చింది. అయినా దూకుడుగా ఆడిన ఇగా ఏమాత్రం చెమటోడ్చకుండానే సెట్‌ను కైవసం చేసుకుంది. అసాధారణ షాట్లతో గాఫ్‌ను ముప్పుతిప్పలు పెట్టిన ఇగా సునాయాసంగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించింది. అంతేగాక ఈ గెలుపుతో స్వియాటెక్ మహిళల సింగిల్స్‌లో తన వరుస విజయాల రికార్డును మరింత మెరుగుపరుచుకుంది.
కనీస పోటీ ఇవ్వకుండానే..
మరోవైపు ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగుతుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అమెరికా యువ సంచలనం గాఫ్ ఫైనల్ మ్యాచ్‌లో కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. ఫైనల్‌కు చేరే క్రమంలో అసాధారణ ఆటతో అలరించిన గాఫ్ ఈ మ్యాచ్‌లో మాత్రం స్వియాటెక్ ధాటికి ఎదురు నిలువలేక పోయింది. రెండు సెట్లలోనూ పూర్తిగా చేతులెత్తేసింది. మరోవైపు స్వియాటెక్ ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో గాఫ్‌ను హడలెత్తించింది. కాగా, స్వియాటెక్‌కు ఇది రెండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. 2020లో కూడా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. తాజాగా మరోసారి గెలిచి సత్తా చాటింది.
నాదల్‌కు ఎదురుందా?
ఇక పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరు ఆదివారం జరుగనుంది. స్పెయిన్ బుల్, మట్టి కోర్టు రారాజు రఫెల్ నాదల్ తుది పోరులో నార్వే యువ ఆటగాడు, 8వ సీడ్ కాస్పర్ రూడ్‌తో తలపడనున్నాడు. ఇక ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో 21 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో నాదల్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక తనకు ఎంతో అచ్చివచ్చే రొలాండ్ గారొస్‌లో మరోసారి టైటిల్‌ను సాధించాలనే పట్టుదలతో నాదల్ తుది పోరుకు సిద్ధమయ్యాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌కు కళ్లు చెదిరే రికార్డు ఉంది. కెరీర్‌లో ఇప్పటి వరకు 13 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను నాదల్ గెలుచుకున్నాడు. తాజాగా 14వ టైటిల్‌పై కన్నేశాడు. ఫైనల్లో కూడా గెలిస్తే నాదల్ ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరుతుంది. ఇప్పటికే 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నాదల్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇక నార్వే ఆటగాడు కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక అపార అనుభవజ్ఞుడైన నాదల్‌కు అతను ఎంత వరకు పోటీ ఇస్తాడనేది సందేహమే. అయితే ప్రతిభావంతుడైన రూడ్‌ను తక్కువ అంచనా వేయలేం. ఫైనల్‌కు చేరే క్రమంలో రూడ్ పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించాడు. ఇక సెమీస్‌లో జ్వరేవ్‌తో తీవ్ర పోటీని ఎదుర్కొన్న నాదల్‌కు ఫైనల్ పోరు అంత తేలికేం కాదనే చెప్పాలి. ఏ మాత్రం నిర్లక్షంగా ఆడిన చేదు అనుభవాన్ని ఎదుర్కొవడం ఖాయం.

Iga Swiatek won French Open 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News