Thursday, January 23, 2025

కృష్ణజింకల మనుగడపై ఐఐఎస్‌సి పరిశోధన

- Advertisement -
- Advertisement -

దేశంలో కృష్ణజింకలు ప్రాకృతిక, మానవ ప్రేరేపిత సవాళ్లను ఎదుర్కొని మనుగడ సాగిస్తున్నాయి? అన్న కోణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. కృష్ణజింకలు భారత దేశంలో తప్ప మరేదేశంలో కనిపించవు. మగ కృష్ణజింకలు సుడులు తిరిగిన కొమ్ములు, నలుపు నుంచి ముదురు గోధుమరంగు వరకు చర్మంతో ఉంటాయి. ఆడ కృష్ణజింకలు సాధారణమైన జింక రంగులోనే ఉంటాయి. దేశం మొత్తం మీద ఇవి భారీ గుంపులుగా ఉత్తరాది, దక్షిణాది, తూర్పు ప్రాంతాలు అనే మూడు ప్రాంతాల్లో ఇవి జీవిస్తుంటాయి.

భౌగోళిక విభిన్న పరిస్థితులు, జన సమూహ నివాసాలు ఉండడంతో ఇవి ఒక చోట నంచి వేరొక చోటికి వెళ్లడానికి కష్టమౌతుందని పరిశోధకులు తెలిపారు. దేశం మొత్తం మీద వీటి జన్యు చరిత్ర ఎలా ఉంటుందో వీరు అధ్యయనం చేస్తున్నారు. ఈ మేరకు దేశం లోని ఎనిమిది రాష్ట్రాల లోని 12 వేర్వేరు ప్రాంతాల నుంచి కృష్ణజింకల మల విసర్జన నమూనాలను సేకరించారు. వీటి జన్యు క్రమాన్ని విశ్లేషించడం కోసం ప్రయోగశాలల్లో వీటి మల విసర్జన నమూనాల నుంచి డిఎన్‌ఎను పరిశీలించారు. ఈ జన్యుడేటాతో వీటి భౌగోళిక ప్రాంతాలను అంచనాగా చిత్రీకరించడానికి కంప్యూటరీకరణ సాధనాలను ఉపయోగించారు. వీటి ఏకైక ప్రాచీన కృష్ణజింక తెగ నుంచి ప్రస్తుత మూడు తెగల కృష్ణజింకలు ఎలా ఆవిర్భవించాయో తెలుసుకోడానికి సాంకేతికతను అనుసరించారు.

దీన్ని బట్టి ప్రాచీన కృష్ణజింక జనాభా మొట్టమొదట ఉత్తరాది, దక్షిణాది అనే రెండు గ్రూపులుగా విడిపోయిందని, తూర్పు గ్రూపు దక్షిణాది గ్రూపు నుంచే వెలువడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. తరువాత అన్ని అసమానతలు ఉన్నప్పటికీ మగ కృష్ణజింకలు అనుకున్నదాని కన్నా ఎక్కువగా విస్తరించాయి. ఫలితంగా ఈ తెగల్లో జన్యువ్యాప్తి బాగా జరిగింది. మరోవైపు ఆడ కృష్ణజింకలు స్థానిక సమూహాల్లోనే ఉండిపోయాయి. ప్రతి సమూహం లోను ప్రత్యేక మైటోకాండ్రియా చిహ్నాలు కనిపించాయి. కణాల్లో జరిగే జీవన క్రియలకు అవసరమైన శక్తిని మైటోకాండ్రియాలు సిద్ధం చేసి ఉంచుతాయి.

గతంలో కన్నా ప్రస్తుతం వీటి సంతతి పెరుగుతోందని పరిశోధకులు గమనించారు. మనుషులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఇవి మనుగడ సాగించగలుగుతున్నాయి. అయితే మానవ ప్రేరేపిత బెదిరింపుల మధ్య ఇవి ఎలా మనగలుగుతున్నాయో ఆ రహస్యం ఏమిటో తెలుసుకోడానికి వాటి డిఎన్‌ఎ, జీర్ణాశయం లోని బ్యాక్టీరియాను అధ్యయనం చేయవలసి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News