ఐఐఎస్‌సి( బెంగళూరు ) శాస్త్రవేత్తల రూపకల్పన
న్యూఢిల్లీ : బెంగళూరుకు చెందిన ఐఐఎస్‌సి ( ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) పరిశోధకులు కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌ను నివారించగల కొత్త తరగతి కృత్రిమ మినీ ప్రొటీన్లను అభివృద్ధి చేశారు. ఇది సార్స్ కొవి 2 ను నిర్వీర్యం చేస్తుందని చెప్పారు. జర్నల్ నేచర్ కెమికల్ బయోలజీలో ఈ పరిశోధన వెలువడింది. ఈ మినీ ప్రొటీన్లు మన శరీరం లోని కణాల్లోకి వైరస్ ప్రవేశాన్ని అడ్డుకోవడమే కాక, వైరస్ నలుసులను ముద్ద చేస్తాయి. వాటి సామర్థాన్ని బాగా తగ్గించగలుగుతాయని పరిశోధకులు వివరించారు. ప్రొటీన్‌కు మరో ప్రొటీన్‌కు మధ్య తాళం, కీ విధంగా సంబంధం పెనవేసుకుని ఉంటుంది. ఈ అంతర్గత బంధాన్ని ప్రయోగశాలలో తయారు చేసిన మినీ ప్రొటీన్లు అడ్డుకుంటాయి. మినీ ప్రొటీన్లను తయారు చేయడానికి ఈ విధానాన్ని పరిశోధకులు అనుసరించారు.
సార్స్ కొవి 2 వైరస్ ఉపరితలంపై ఉన్న స్పైక్ ప్రొటీన్‌ను మినీ ప్రొటీన్లు అడ్డుకుంటాయి. ఈ విధమైన కట్టడిని తరువాత క్రియాశీలంగా క్రిపో ఎలెక్ట్రాన్ మైక్రోస్కోపీ, జీవ భౌతిక వ్యవస్థలతో విస్తరింప చేశారు. ఈ మినీ ప్రొటీన్లు గిరగిర తిరిగి , చెంప పిన్ను ఆకారంలో ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ఇటువంటి మరో దానితో జతగూడే సమర్ధత కలిగి ఉంటాయి. దీనినే ద్వయకం అని అంటారు. ఈ రెండు ముఖాలు రెండు వేర్వేరు లక్షిత ప్రొటీన్లతో బంధమై మొత్తం నాలుగింటిని కట్టడి చేస్తాయి. వాటి లక్షాన్ని అడ్డుకుంటాయని పరిశోధకులు చెప్పారు. అయితే రుజువు చేసే సిద్ధాంతం అవసరమని ఐఐఎస్‌సి ఎంబియు యూనిట్ అసోసియేట్ ప్రొఫెసర్ జయంత చటర్జీ పేర్కొన్నారు.