మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఎస్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఈ నెల 12 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 11వ తేదీన జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల కానుండగా, ఆ మరుసటి రోజు నుంచి కౌన్సెలింగ్ మొదలు కానుంది. ఈ నెల 20వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఐఐటీ బాంబే తెలిపింది. అసలు కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సారి ఆరు రౌండ్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటాయి. అందులో 23 ఐఐటీలు, 31 ఎస్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఎస్ ఐటీలు, మరో 33 కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి. గత నెల 28న జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగగా 1,56,089 మంది హాజరయ్యారు.
ఒక్కో సీటుకు 2.5 రెట్ల మంది పరీక్షలో అర్హత సాధించేలా కటాఫ్ నిర్ణయిస్తారు. అంటే దాదాపు 42వేల మందికి జోసా కౌన్సెలింగ్‌కు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈసారి ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్లు 16,598కు చేరాయి. గత ఏడాది వాటి సంఖ్య 16,232 ఉండగా.. ఈసారి 10 ఐఐటీల్లో మరో 366 సీట్లు పెరిగాయి. ఈ మేరకు ఐఐటీ బాంబే సీట్ల వివరాలు ప్రకటించింది. దేశంలో 23 ఐఐటీలు ఉండగా వాటిలోని మొత్తం సీట్లలో బాలికలకు 1,567 సీట్లను సూపర్‌న్యూమరీ కోటా కింద కేటాయిస్తారు.గత ఏడాది సంవత్సరం ఆ సీట్లు 1,534 ఉండగా, ఈ ఏడాది ఐఐటీ హైదరాబాద్‌లో 35 సీట్లు అధికంగా అందుబాటులోకి వచ్చాయి.
ఆరు రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు
మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 23,2022
2వ రౌండ్: సెప్టెంబరు 28,2022
3వ రౌండ్: అక్టోబరు 3,2022
4వ రౌండ్: అక్టోబర్ 8,2022
5వ రౌండ్: అక్టోబర్ 12, 2022
6వ రౌండ్ (చివరి): అక్టోబరు 16, 2022