న్యూఢిల్లీ : గల్ఫ్‌లో త్వరలోనే ఐఐటి ఢిల్లీ ప్రవాస క్యాంపస్‌ను ఆరంభించనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా అబూధాబి చేరారు. ఈ దశలో కేంద్ర విద్యామంత్రిత్వశాఖ, అబూధాబి విద్యా, విజ్ఞాన విభాగం (ఎడిఇకె) మధ్య అబూధాబిలో ఐఐటి ఢిల్లీ క్యాంపస్ స్థాపనకు సంబంధించిన అవగావహనాపత్రాలు (ఎంఒయు)పై సంతకాలు జరిగాయి. ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ విద్యారంగం అంతర్జాతీయకరణ దిశలో ఇదో ముందడుగు అన్నారు.
విద్య అనేది మానవాళిని కలిపే బంధం అని, భారతదేశపు సృజనాత్మక శక్తికి ఇక్కడ ఐఐటి ఢిల్లీ ఏర్పాటు కీలకం అవుతుందన్నారు. ఇప్పటికే ఐఐటి మద్రాసు గత వారం టాంజెనియాలోని జంజిబార్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటుకు అంగీకారం కుదుర్చుకుంది. దీనితరువాత ఐఐటి ఢిల్లీ ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు కానుంది. అబూధాబిలో వెలిసే ఐఐటి ఢిల్లీ క్యాంపస్‌లో వచ్చే ఏడాది జనవరి నుంచి మాస్టర్స్ కోర్సులు ఆరంభిస్తారు. సెప్టెంబర్ నుంచి డిగ్రీ కోర్సులు ప్రారంభిస్తారని అధికారికంగా వెల్లడించారు.