సత్తుపల్లి : ఐఐటీ కోచింగ్ అంటే 6వ తరగతి విద్యార్థికి 8వ తరగతి సిలబస్ చెప్పి మెటీరియల్, కోచింగ్ పేరిట వేలాది రూపాయలు దండుకోవటం కాదని ప్రముఖ విద్యావేత్త కోటేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి సమీపంలోని నాగుపల్లి కు చెందిన కోటేశ్వరరావు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి శ్రీ చైతన్య, నారాయణ తదితర కార్పొరేట్ విద్యాసంస్థల్లో 30 ఏళ్ల పాటు లెక్చరర్ గా పని చేశారు. పీహెచ్‌డి అనంతరం కార్పొరేట్ సంస్థల్లో లెక్చరర్ గా పనిచేయడం ద్వారా ఐఐటి, నీట్, జేఈఈ, ఏఐఈఈఈ శిక్షణలో రాష్ట్రంలో పేరు ప్రతిష్టలు సాధించారు.
ఐఐటి, నీట్ కోర్సులలో సీట్ సాధించటం ఎలా? అనే అంశంపై బుధవారం కోటేశ్వరరావు స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. నెక్స్ట్ జెన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా విశ్వశాంతి విద్యార్థులకు ఉచితంగా ఐఐటి మెటీరియల్ అందజేస్తానని, క్లాసెస్ నిర్వహిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విశ్వశాంతి ఉపాధ్యాయులు, విద్యార్థులు కోటేశ్వరరావు ఘనంగా సత్కరించారు.