Saturday, November 23, 2024

రేపు జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -
IIT JEE Advanced Result 2021 Tomorrow
ఎల్లుండి నుంచి కౌన్సెలింగ్

హైదరాబాద్ : దేశంలో ప్రతిష్టాత్మకమైన ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్‌టిఐ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐఐటి ఖరగ్‌పూర్ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 3వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరిగింది. పేపర్ 1, పేపర్ 2 ఒక్కో పేపర్ 180 మార్కుల చొప్పున రెండు పేపర్లు 360 మార్కులకు పరీక్ష నిర్వహించారు. ప్రతి సబ్జెక్టు నుంచి 19 ప్రశ్నల చొప్పున ఒక్కో పేపర్‌లో మొత్తం 57 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ఇచ్చారు. గత ఏడాదికి భిన్నంగా ప్రశ్నలు, మార్కులు ఉండటంతో గత ఏడాదితో పోల్చలేని పరిస్థితి నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మొత్తంగా గత ఏడాది కంటే ఈసారి జెఇఇ అడ్వాన్స్‌డ్ కఠినంగా ఉందని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 25 వేల మంది విద్యార్థులు జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యారు.

16 నుంచి జోసా కౌన్సెలింగ్

దేశంలో ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్‌టిఐ కోర్సులలో ప్రవేశాలకు జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) ఆధ్వర్యంలో శనివారం(అక్టోబర్ 16) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జోసా కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా 23 ఐఐటిలు, 31 ఎన్‌ఐటిలు, 20 జిఎఫ్‌టిఐ (గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్), 23 ట్రిపుల్ ఐటిల వంటి 97 విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి చేయనున్నారు. జోసా కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమై నవంబర్ 18 వరకు ఆరు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్లను ఈ నెల 27న కేటాయిస్తారు. నవంబర్ 1న రెండో విడత సీట్లు, నవంబర్ 6న మూడో విడత, 10న నాలుగవ విడత, 14న ఐదు, 18న చివరి విడత సీట్లు కేటాయించనున్నారు.

జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఏయే విద్యాసంస్థలో, ఏయే కోర్సుల్లో సీటు కావాలనుకుంటున్నారో తెలుపుతూ ముందుగానే ఆన్‌లైన్‌లో ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. ఎన్ని ఆప్షన్లనైనా వరుస క్రమంలో ఇచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. జెఇఇ అడ్వాన్స్‌డ్ ర్యాంకులు వెలువడిన తర్వాత ఈ నెల 16 నుంచి 25 వరకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అడ్మిషన్ కోల్పోవాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి విద్యార్థి కళాశాలలను ఎంపిక చేసుకోవాలి. లేదంటే సీటు కేటాయించరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News