ర్యాంకులు ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థగా మద్రాసు ఐఐటి హ్యాట్రిక్ సాధించింది. జాతీయ వ్యవస్థల శ్రేణుల సంవిధానం (ఎన్‌ఐఆర్‌ఎఫ్) 2021లో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఐఐటి మద్రాసుకు ఈ నెంబర్ ఒన్ ర్యాంకు ఇచ్చారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ 2021 ర్యాంకింగ్‌లను గురువారం కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్ పద్ధతిలో ప్రకటించారు. విద్యాబోధన, అధ్యయనం, వనరులు (టిఎల్‌ఆర్), పరిశోధన, వృత్తిపర నైపుణ్య విధానాలు (ఆర్‌పి). గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్స్, ఔట్‌రీచ్ అండ్ ఇంక్లుజివిటి, పర్సెప్షన్ వంటి ఐదు విస్తృత ప్రధాన అంశాల ప్రాతిపదికన విద్యాసంస్థలకు ప్రమాణాలను ఖరారు చేస్తారు.
వేర్వేరు అంశాలలో విద్యాసంస్థలకు దక్కే మూల్యాంకాలను కలిపి చూసుకున్న తరువాత ఉత్తమ విద్యాసంస్థలను ఖరారు చేసి, ర్యాంకింగ్‌లు ఇవ్వడం జరుగుతోంది. విద్యాసంస్థల మధ్య ప్రామాణిక పోటీని సాధించేందుకు ఈ ర్యాంకింగ్‌ల విధానాన్ని 2013లో ఏర్పాటు చేశారు. మరుసటి సంవత్సరం నుంచి ర్యాంకింగ్‌లను ప్రకటిస్తూ వస్తున్నారు. మద్రాసు ఐఐటికి వరుసగా ర్యాంక్‌లు వస్తూ ఈ సంస్థ తన హ్యాట్రిక్ ఘనతను నిలబెట్టుకొంటోంది. మద్రాసు ఐఐటి తరువాతి స్థానంలో వరుసగా కర్నాటక ఐఐటి, మహారాష్ట్రలోని ఐఐటి, ఢిల్లీ ఐఐటి తరువాతి స్థానంలో కాన్పూర్ ఐఐటి తమ ర్యాంకులను నిలబెట్టుకున్నాయి.