రూపేష్, ఆకాంక్షా సింగ్ హీరో, హీరోయిన్లుగా, ‘లేడీస్ టైలర్’ కపుల్ రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం‘షష్టిపూర్తి’. ఈ సినిమాకి వున్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ చిత్రానికి విశ్వవిఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ఆర్.కె. సినీ మాక్స్.లో జరిగింది. సంగీత దర్శకుడు ఇళయరాజా, ఈ చిత్రంలోని ‘ఏదో ఏదేదో’అంటూ సాగే ఒక పాటకు లిరిక్స్ అందించిన మరో సంగీత దర్శకుడు కీరవాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘షష్టిపూర్తి’ మూవీ టీజర్ ‘మేస్ట్రో’ ఇళయరాజా చేతుల మీదుగా విడుదలైంది. దర్శకుడు పవన్ ప్రభ, డీఓపీ రామ్, ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్, గీత రచయిత చైతన్య ప్రసాద్, రూపేష్, ఆకాంక్షాసింగ్, కీరవాణి, రాజేంద్రప్రసాద్, ఇళయరాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భగా దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ, “ఇంత గొప్ప వారు నా సినిమాకి పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నేను అదృష్టవంతుడిని” అని అన్నారు. కథనాయకుడు, నిర్మాత రూపేష్ మాట్లాడుతూ, ఇంత పెద్ద దిగ్గజాలతో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కీరవాణి మాట్లాడుతూ..
“ఈ సినిమాలో రాజా సార్ ట్యూన్‌కి నేను రాసిన పల్లవి ‘ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం. నీదో, నీవల్ల నాదో ఈ పరవశం. రాగం నీదై, పల్లవి నాదై చరణం, చరణం కలిసిన వేళ పయనాలు ఏ హిమాలయాలకో ’ అనే పాట రాశాను. ఈ సినిమాలో నేను రాసిన పాట ఈ సినిమాలోని సందర్భంతోపాటు, నా జీవితానికి కూడా సంబంధించింది ఇళయరాజా సంగీతానికి పాడాలని అనుకున్నాను. కానీ, ఆ అవకాశం రాలేదు. కానీ ఆయన సంగీతానికి పాట రాసే అవకాశం వచ్చింది’ అని పేర్కొన్నారు. రాజేందప్రసాద్ మాట్లాడుతూ ‘నేను నిజ జీవితంలో ‘షష్టిపూర్తి’ చేసుకోలేదు. నాకు నట జీవితంలో ‘షష్టిపూర్తి’ వచ్చింది. చక్కటి కథతో రూపొందిన సినిమా ఇది‘అని తెలియజేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా మాట్లాడుతూ.. ‘కీరవాణి రాసిన పాట పల్లవి వినిపించినప్పుడు, తన మనసులో నామీద వున్న ఆత్మబంధాన్ని రాశారని నాకు అర్థమైంది. నా మీద వున్న అభిమానం కీరవాణిలో ఎప్పుడూ మారలేదు‘అని అన్నారు.