కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే దేశభక్తి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ పోషించని అత్యంత పవర్‌ఫుల్ రోల్‌లో మోహన్ బాబు కనిపించనున్నారు. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం 11వ శతాబ్దంలో వేదాంత దేశిక రాసిన ‘రఘువీర’ గద్యంని రీమిక్స్ చేస్తున్నారు. శ్రీరాముడి ఘనతను చాటిచెప్పే రఘువీర గద్యాన్ని రీమిక్స్ చేయవలసిందిగా మోహన్ బాబు సంగీత దర్శకుడు ఇళయరాజాను అభ్యర్ధించగా అందుకు ఆయన అంగీకరించారు.
ఈ విషయాన్ని వెల్లడించిన నిర్మాత విష్ణు మంచు ఓ వీడియోని షేర్ చేశాడు. ఇందులో మోహన్ బాబు, – దర్శకుడు రత్నబాబు కలిసి ఇళయరాజాతో ఈ పాట గురించి చర్చించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఆ గద్యాన్ని పాడి వినిపించగా… ‘ఈ పాట మీరే పాడుతారా’ అని ఇళయరాజా అడిగారు. దీనికి ‘నాకు డైలాగ్స్ చెప్పడం మాత్రమే వచ్చు.. పాటలు పాడలేను’అని మోహన్ బాబు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంచు విష్ణు పోస్ట్ పెడుతూ..“ఇద్దరు లెజెండ్స్‌తో సినిమా అనేది నాకు దేవుడు ఇచ్చిన అవకాశం. ఒక ఐకానిక్ గద్యాన్ని పాట రూపంలోకి తీసుకురావడం లెజెండ్స్‌కి మాత్రమే సాధ్యం. నేను ఈ వీడియోను మీతో పంచుకోవాలనుకున్నాను. ఈ పాటను విజువల్‌లో తీసుకురావడం మరొక కథ. అది త్వరలో షేర్ చేస్తాను”అని పేర్కొన్నాడు.