మన తెలంగాణ/హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాడు తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశానని గుర్తుచేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతుల కోసం దీక్ష చేస్తానని, త్వరలో 72 గంటల పాటు దీక్ష చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 246ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. గత మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా టిఆర్‌ఎస్ సర్కార్ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తోందన్నారు. ఈ జీవో వల్ల నల్గొండ జిల్లా ఏడారిగా మారుతుందని.. ఈ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్గొండ-మహబూబ్ నగర్ జిల్లాల మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. జీవో నెంబర్ 246ని రద్దు చేయకపోతే తాను దీక్షకు దిగుతానని వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తోడుకుపోతున్నా టిఆర్‌ఎస్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఎంపి మండిపడ్డారు. ఈ విషయంలో అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తానని పేర్కొన్నారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితం ఇదే విషయమై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య రక్తపాతం జరిగితే టిఆర్‌ఎస్ సర్కార్‌దే బాధ్యత వహించాలని ఆయన కోరారు. ఎఎస్‌ఎల్‌బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో తెచ్చిందన్నారు. ఎస్‌ఎల్ బిసికి 45 టిఎంసీలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎస్‌ఎల్ బిసికి కేటాయించిన 45 టిఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించారని చెప్పారు. గతంలో ఎస్‌ఎల్ బిసికి కేటాయించిన 45 టిఎంసీలను యధావిధిగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్ బిసీ నల్గొండ జిల్లాకు సాగు తాగు నీరు అందించే ప్రాజెక్టు అని ఆయన గుర్తు చేశారు.
I’ll 72 hrs Deeksha for Farmers: MP Venkat Reddy