Sunday, January 19, 2025

త్వరలో మేం నలుగురం జైలుకు: ఆతిశీ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ ఎన్నికల సమయంలో మరికొందరిని అరెస్ట్ చేయడం దేశ రాజకీయాల్లో వాడి, వేడి చర్చగా మారింది. ఈడీ విచారణలో కీలక విషయాలను కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. నిందితుడైన విజయ్ నాయర్ తన మంత్రివర్గం లోని ఆతిశీ, సౌరభ్‌కు రిపోర్టు చేసేవాడని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నట్టు ఏఎస్‌జీ ఎస్‌వీ రాజు కోర్టుకు వెల్లడించారు.

తమ పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆప్ నేత, మంత్రి ఆతిశీ తాజాగా మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. “నిన్న కోర్టులో ఈడీ … నాపేరు, సౌరభ్ పేరు ప్రస్తావించింది. ఈ స్టేట్ మెంట్ సీబీఐ, ఈడీ వద్ద ఎప్పటి నుంచో ఉంది. కానీ దానిని ఇప్పుడు బయటపెట్టడానికి కారణం… కేజీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్‌సింగ్, సత్యేంద్ర జైన్ అరెస్ట్ తర్వాత కూడా ఆప్ ఐక్యంగా ఉందని బీజేపీ భావించడమే . దాంతో వారి తర్వాత వరుసలో ఉన్న నేతలను జైలులో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తరువాత ఆప్ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ ఊహించింది. కానీ రాంలీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలు ఒక్కటవడాన్ని చూసి వారు భయపడ్డారు. త్వరలోనే మాకు సమన్లు జారీ చేస్తారు. ఆపై జైల్లో పెడతారు. అయినా మేము బీజేపీకి భయపడడం లేదు. మా చివరి శ్వాస వరకు కేజ్రీవాల్ తోనే పోరాడతాం. అందరినీ జైలులో పెట్టండి. అక్కడి నుంచే మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం” అని ఆతీశీ స్పష్టం చేశారు. బీజేపీలో చేరాలని తనకు సంప్రదింపులు వచ్చాయని, ఈ పనిచేసి రాజకీయ జీవితాన్ని కాపాడుకోవచ్చని పలువురు ఆఫర్ చేశారని ఆతిశీ చెప్పారు. ఇప్పటికే సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్‌ను జైలులో వేసిన బీజేపీ త్వరలోనే మిగతా నాయకులపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

కేజ్రీవాల్ రాజీనామా చేయడానికి ఎలాంటి కారణం లేదు
మద్యం కేసు విచారణలో భాగంగా కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆయన సిఎం పదవికి రాజీనామా చేస్తారా ? అంటూ అడిగిన ప్రశ్నకు ఆతిశీ అందుకు ఎలాంటి కారణం లేదన్నారు. “ఈ అంశానికి సంబంధించి రెండు ప్రావిజన్స్ ఉన్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లకు పైగా శిక్ష పడితే ప్రజా ప్రతినిధిగా ఉండేందుకు వీలుండదు. కానీ కేజ్రీవాల్ దోషిగా తేలలేదు. ఆయనకు ఢిల్లీ అసెంబ్లీలో భారీ మెజార్టీ ఉంది. అందుకే ఆయన రాజీనామా చేయడానికి ఎలాంటి కారణం లేదు.” అని తెలిపారు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడం బీజేపీకి మరింత సులభం అవుతుందని విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News