వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరసగా రెండో సారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం స్వయంగా ప్రకటించిన బైడెన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ప్రచారం మొదలుపెట్టారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తనను మరోసారి ఎన్నుకోవాలని, అలాగే దేశానికి సేవ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలని అమెరికన్టకు ఆయన పిలుపునిచ్చారు. తనతో పాటుగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా వచ్చే ఎన్నికల్లో వైస్‌ప్రెసిడెంట్‌గా మళ్లీ పోటీ చేయనున్నట్లు బైడెన్ వెల్లడించారు. ‘ ప్రజాస్వామ్యం కోసం, స్వాతంత్య్రం కోసం ప్రతి తరం వారు నిలబడాల్సిన క్షణం ఒకటి ఉంటుంది. ఇది మన సమయం అని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేస్తున్నా. మాకు మద్దతుగా నిలవండి’ అని బైడెన్ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశారు.
2024 అధ్యక్ష ఎన్నికలను రిపబ్లికన్ల అతివాదంపై పోరాటంగా ఆయన అభివర్ణించారు. 2024 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందే అధ్యక్ష బరిలో నిలిచే తుది అభ్యర్థులఎంపిక కోసం ఆయా ప్రధాన పార్టీల్లో ప్రైమరీ ఎన్నికలు జరుగుతాయి. అయితే అధ్యక్షుడే తిరిగి పోటీ చేయనుండడంతో డెమోక్రటిక్ పార్టీలో ప్రైమరీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవకాశాలు లేనట్లే. మరో వైపు ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి తాను పోటీ చేయాలనుకొంటున్నట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించగా అదేపార్టీ తరఫున ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ కూడా బరిలో దిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. భారతీయ సంతతికి చెందిన మరో ఇద్దరు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి బరిలో ఉండనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో బైడెన్ వయసు ప్రధాన అంశం కానుంది. ఒక వేళ బైడెన్ రెండోసారి విజయం సాధిస్తే పదవీకాలం పూర్తి చేసేసరికి 86 ఏళ్లకు చేరుకోనున్నారు. దీంతో వయసు రీత్యా అమెరికన్లు ఆయనకు మరోసారి ఇస్తారా లేదా అనేది సందిగ్ధంగానే ఉంది. మరో వైపు ఈ ఏడాది ప్రారంభంలో ఆయన ‘రహస్య పత్రాల’ వివాదంలో ఇరుక్కున్నారు. ఇవన్నీ కూడా ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి.