Thursday, December 19, 2024

అవినీతి ఆరోపణలు నిరూపిస్తే.. రాజకీయాలకు గుడ్‌బై చెబుతా: హేమంత్ సోరెన్

- Advertisement -
- Advertisement -

అవినీతి ఆరోపణలు నిరూపించండి
రాజకీయాలకు గుడ్‌బై చెబుతా
ఝార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్
బిజెపిపై నిశిత విమర్శలు
రాంచీ : భారతీయ జనతా పార్టీ (బిజెపి) తనపై మోపిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, అరెస్టయిన హేమంత్ సోరెన్ సోమవారం సవాల్ చేశారు. అవినీతి ఆరోపణలు రుజువైనట్లయితే తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని ఆయన ప్రకటించారు. తన వారసుడు చంపయి సోరెన్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చలో జెఎంఎం ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ పాల్గొంటూ, కేంద్రం కుట్ర పన్నిన తరువాత తన అరెస్టులో రాజ్ భవన్ ప్రమేయం ఉందని ఆరోపించారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) క్రితం హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసిన తరువాత ఈ నెల 2న జెఎంఎం శాసనసభా పక్షం నాయకుడు చంపయి సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

‘నాపై చేసిన అవినీతి ఆరోపణలను రుజువు చేయవలసిందిగా బిజెపిని సవాల్ చేస్తున్నా. అవి రుజువైనట్లయితే రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని హేమంత్ సోరెన్ చెప్పారు. ఇడి కస్టడీలో ఉన్నహేమంత్ సోరెన్‌ను విశ్వాస పరీక్షలో వోటు వేసేందుకు ప్రత్యేక పిఎంఎల్‌ఎ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం) కోర్టు అనుమతించింది. ‘జనవరి 31 భారత చరిత్రలో చీకటి అధ్యాయం. రాజ్ భవన్ ఆదేశంతో ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేశారు. ఝార్ఖండ్‌లో గిరిజన సిఎం ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేయాలని బిజెపి కోరుకోవడం లేదు. వారు తమ హయాంలలో కూడా దీనిని అనుమతించరు’ అని హేమంత్ ఆరోపించారు.

గిరిజనేతర బిజెపి నేత రఘువర్ దాస్ మినహా కాషాయ పార్టీకి లేదా జెఎంఎంకు చెందిన తక్కిన పది మంది పూర్వ ముఖ్యమంత్రులు ఎవ్వరూ రాష్ట్రంలో పూర్తిగా ఐదు సంవత్సరాలు అధికారంలో లేరు. ఝార్ఖండ్ 2000లో ఏర్పాటైన విషయం విదితమే. ‘అయితే, నేను ఇప్పుడు కన్నీళ్లు కార్చను. తగిన సమయంలో భూస్వామ్య శక్తులకు సముచిత సమాధానం ఇస్తాను’ అని హేమంత్ సోరెన్ చెప్పారు. బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతానికి మారవలసి వచ్చినందున గిరిజనులను వారి మతాన్ని త్యజించేలా బలవంతం చేయగలరని ఆయన ఆరోపిస్తూ, బిజెపి గిరిజనులను ‘అస్పృశ్యులుగా’ పరిగణిస్తోందని అన్నారు. ‘దేశంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గిరిజనులు, దళితులు సురక్షితంగా లేరు. నేను మరింత బలంగా తిరిగి వస్తా. ప్రతిపక్షాల కుట్రను భగ్నం చేస్తా’ అని హేమంత్ సోరెన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News