ఢాకా : ‘నా మాతృభూమికి తిరిగి వస్తాను& కార్యకర్తల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను’ అని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రతిజ్ఞ చేశారు. దేవుడు తనను ప్రాణాలతో ఉంచింది అందుకేనని ఆమె తెలిపారు. బంగ్లాదేశ్ ప్రజలను ప్రస్తుతం ఉగ్రవాద ప్రభుత్వం పాలిస్తోందని, మహ్మద్ యూనస్ ఒక ఉగ్రవాది అని హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల ఏర్పాటు చేసిన ఒక బహిరంగ కార్యక్రమంలో హసీనా జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు. హసీనా ఈ సందర్భంగా తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను త్వరలోనే తిరిగి వస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అంత వరకు ఓపిక పట్టాలని ఆమె కోరారు.నిరుడు జూలై, ఆగస్టు నెలల్లో విద్యార్థులు చేసిన ఆందోళనల్లో పలువురు పోలీసులు, అవామీ లీగ్ కార్యకర్తలు, విద్యావంతులు, కళాకారులు హత్యకు గురయ్యారని హసీనా గుర్తు చేశారు.
అయినప్పటికీ ఆ హత్యలకు కారకులపై యూనస్ చర్య తీసుకోలేదని ఆమె ఆరోపించారు. విచారణ కమిటీలను రద్దు చేసి యూనస్ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలపైన, అధికారులపైన దాడులు చేయడం యూనస్ అసమర్థతకు నిదర్శనమని హసీనా విమర్శించారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా అల్లర్లు ఆగలేదని ఆమె విమర్శించారు. దేశంలో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని ఆమె ఆరోపించారు. ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని హసీనా ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఆందోళనల్లో మరణించిన పలువురు పోలీసుల కుటుంబాలతో హసీనా ఈ సందర్భంగా మాట్లాడారు.