మన తెలంగాణ/కూకట్‌పల్లి : హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ భవన నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు కూలీలు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైన సంఘఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి సర్కిల్ ప్రధాన రహదారిలోని ఎస్‌ఆర్‌డిజి స్కూల్ ఎదురుగా ఉన్న ప్రసాద్ హాస్టల్ సమీపంలో అనుమతి లేని ఓ అక్రమ నిర్మాణంలో 5వ స్లాబ్ వేస్తున్న సమయం లో 4 స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. ఈ ఘటనలో 4వ స్లాబ్ లో పనిచేస్తున్న ఐదుగురు కూలీల్లో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా మరో ఇద్దరు శిధిలాల్లో చిక్కుకున్నారు.
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థ్ధలానికి చేరుకుని వివిధ విభాగాల అధికార, సిబ్బందికి సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది, జిహెచ్‌ఎంసి అధికారులు, సిబ్బంది రెండు అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. రెస్య్కూ అపరేషన్ నిర్వహించి శిధిలాల కింది చిక్కుకున్న మృతదేహాలను తీసేందుకు శ్రమించి మృతదేహాల ను బయటకు తీశారు. కనీస నిబంధనలను కూడా పాటించకుండా భవన నిర్మాణం చేపడుతున్న ని ర్మాణ అధికారులు ఎలా అనుమతించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ కూలీల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారు ఆనంద్, దయాలుగా ప్రమాదం లో గాయాలతో బయటపడ్డ మరో ముగ్గరు కూలీలు తెలిపారు.
ప్రమాదం జరిగినప్పుడు భవనం యజమాని సైతం అక్కడే ఉన్నట్లు తనకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు సమాచారం. అయితే నిర్మాణదారునిపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో అనుమతికి మించిన నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లకు, నిర్మాణాదారులు టౌన్‌ప్లానింగ్ అధికారులు అందినకాడికి దండుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే ఇలాంటి సంఘటనలు చేటు చేసుకుంటున్నాయి. కనీస నిబంధనలను సైతం పాటించకుండా అక్రమ భవనాన్ని నిర్మించి కూలీల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.