Thursday, December 19, 2024

హైడ్రానా..మజాకా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో : హైడ్రా తీసుకున్న చర్యలు, కాపాడిన భూముల వివరాలతో కూడిన నివేదిక ప్రభుత్వానికి చేరింది. గత రెండు నెలల నుంచి చెరువుల్లో, పార్కుల్లో, ప్రభుత్వ భూముల్లో చేపట్టిన కూల్చివేతలు, కాపాడిన భూముల వివరాలను ఆ నివేదికలో వివరించారు. ఆదివారంప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తన నివేదికను అందజేశారు. ఓఆర్‌ఆర్ పరిధిలోని 8 మునిసిపల్ కార్పొరేషన్‌లు, 20 మునిసిపాలిటీలు, 33 పంచాయతీల పరిధిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు కమిషనర్ వెల్లడించారు. జూన్ 27 నుంచి ఈనెల 24 వరకు చేపట్టిన కూల్చివేతలకు
సంబంధించిన వివరాలను నివేదికలో పొందుపరిచారు. కూల్చివేతలు చేపట్టిన 18 ప్రాంతాల్లోని కబ్జాల నుంచి 43.94 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఆ నివేదికలో తెలిపారు.

అందరూ ప్రముఖులే, ఆక్రమ నిర్మాణాలే..
హైడ్రా తీసుకున్న చర్యల్లో ముఖ్యంగా చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లతో పాటు పార్కు స్థలాలను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలు ఉన్నాయని, ఇందులో పలువురు రాజకీయ నేతలు, సినీనటులు, క్రీడాకారులు కూడా ఉన్నట్టు హైడ్రా నివేదికలో పేర్కొన్నారు. ఎన్‌ఓసిలు లేవు. అనుమతులు అంతకన్నా లేవు. కోర్టు కేసులు, క్రమబద్ధీకరణ లేకుండానే చెరువులను ఆక్రమించుకోవడం, నిర్మాణాలను చేపట్టడం ఈ చర్యలతో బహిర్గతమైనట్టు తెలిపినట్టు సమాచారం. వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని, సమగ్రంగా విచారణ చేపట్టిన అనంతరం చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సందర్భంలో తెలియజేసినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొందరు కేసులని, అనుమతులు ఉన్నాయని, ఎన్‌ఓసిలు తీసుకున్నామని చెబుతూ వ్యవస్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు రంగనాథ్ తెలిపారనేది సమాచారం.

కూల్చివేతలు, కాపాడిన భూములు..
చింతల్ చెరువులో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు రత్నాకరం సాయిరాజు అక్రమంగా నిర్మించిన 54 నిర్మాణాలను నేలమట్టం చేసి 3 ఎకరాల 5 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ఆ నివేదికలో పొందుపరిచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్ పార్కు స్థలంలో ఎంఎల్‌ఎ నాగేందర్ మద్దతుదారుడు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించి 18 గుంటల భూమిని కాపాడినట్టు వెల్లడించారు. ఎంఐఎం పార్టీకి చెందిన బహదూర్‌పురా ఎంఎల్‌ఎ మహ్మద్ ముబిన్, ఎంఎల్‌సి మిరాజ్ రెహ్మత్ బేగ్‌కు చెందిన రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి బూమ్‌రుఖ్ ఉద్ దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన ఐదంతస్థుల రెండు భవనాలను, ఒకటి రెండంతస్థుల భవనంతో పాటు మరో భవనాన్ని నేలమట్టం చేసినట్టు రంగనాథ్ తన నివేదికలో వివరించారు. ఈ చెరువు పరిధిలో మొత్తం 46 అక్రమ కట్టడాలను తొలగించడం ద్వారా 12 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనంలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు.

గండిపేట్ జలాశయం ఎఫ్‌టిఎల్ పరిధిలోని చిలుకూరు, ఖానాపూర్‌లలో కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరి సీడ్స్ యజమాని జివి భాస్కర్‌రావు, మంథని అసెంబ్లీ ఎంఎల్‌ఎగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమ అధికారికంగా అనుమతులు తీసుకోకుండా నిర్మించిన 8 భవనాలు, 14 తాత్కాలిక షెడ్లు, 4 ప్రహరీలను కూల్చివేసినట్టు తెలిపారు. ఈ చర్యలతో ఖానాపూర్, చిల్కూరు ప్రాంతంలో గండిపేట్ జలాశయం ఎఫ్‌టిఎల్ పరిధిలోని 16 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా నివేదికలో వివరించారు. మాదాపూర్ తమ్మిడికుంట చెరువులో అనుమతులు లేకుండా ఎఫ్‌టిఎల్ పరిధిలో సినీనటుడు నాగార్జున అక్రమంగా నిర్మించిన ఎన్‌కన్వెన్షన్‌లో రెండు నిర్మాణాలను కూల్చివేసి 4 ఎకరాల 9 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఫిల్మ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్రదేశంలోని పార్కు స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాన్ని తొలగించి 16 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

మన్సురాబాద్‌లో 2 గుంటలు, ఎంపి, ఎంఎల్‌ఎల కాలనీలో 6 గుంటలు, బంజారాహిల్స్ మిథిలానగర్‌లో ఎకరం 4 గుంటలు, ఫిల్మ్‌నగర్‌లోని బిజెఆర్ నగర్‌లో నాలాపై అక్రమంగా నిర్మించిన స్లాబ్‌ను కూల్చేసి 5 ఎకరాలు, గాజులరామారం మహదేవపురం వద్ద ఒక గుంట, గాజుల రామారం భూదేవిహిల్స్‌లో ఎకరం ఒక గుంట, అమీర్‌పేట్‌లో గుంట, చందానగర్ ఈర్ల చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న మూడంతస్థుల భవనం ఒకటి, నాలుగు అంతస్థుల భవనాలు రెండు కూల్చేసి 16 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన నివేదికలో తెలిపారు. బాచుపల్లి ఎర్రకుంటలో 29 గుంటలు, బోడుప్పల్ రెవెన్యూ భూమిలో 3 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ఆ నివేదికలో వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News