Friday, December 20, 2024

అక్రమ వలసల నిరోధంపై అన్నీ ప్రగల్భాలే!

- Advertisement -
- Advertisement -

వలసల సమస్యను మానవతావాదంతో పరిశీలించి, స్థానికుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా పరిష్కారాన్ని కనుగొనవలసి ఉండగా, అనేక దేశాలు ఈ అంశాన్ని రాజకీయ స్వలాభాలకు సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి. భావోద్వేగాలను రెచ్చగొట్టడం చాలా తేలిక. కానీ సమస్యను అర్థవంతంగా పరిష్కరించడమే కష్టం. అక్రమ వలసలను అరికట్టలేనని అసమర్థత ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కాగా, ఆ సమస్య పట్ల దృక్పథం దాదాపు పాక్షికం, జాతి సంబంధితం, మతపరమైనదిగా ఉంటున్నది. భారత్‌సహా దాదా పు ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం సొంత వైఫల్యాలను అరుదుగా గుర్తిస్తుంది, తప్పుడు విధానాలకు తమ రాజకీయ ప్రత్యర్థులను నిందిస్తుంటుంది. అక్రమ వలసవాదుల సమస్య చుట్టూ రెండు విలక్షణ వైఖరులు ఎల్లప్పుడూ ఉంటున్నాయి మొదటిది అక్రమ వలసవాదుల దుష్ప్రభావం నుంచి తమ పౌరులను ప్రభుత్వం కాపాడడం, రెండవది మానవత కోణం. రోహింగ్యా టు, అక్రమ బంగ్లాదేశీ పౌరుల సమస్య భారత్‌లో భావోద్వేగాలను రేకెత్తించాయి.

అదే విధంగా, సంఘర్షణల బాధిత మధ్య ప్రాచ్యదేశాలు లేదా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే ఆఫ్రికన్ దేశాల నుంచి వలసల సమస్య యూరప్‌ను చుట్టుముట్టుతోంది. ఇప్పుడు యుఎస్‌లో అక్రమ వలసదారుల సంఖ్యపై అధికారిక డేటా ఏదీ అందుబాటులో లేకపోయినప్పటికీ, యుఎస్ అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ 15 20 మిలియన్ల మంది అక్రమ వలసదారులను వెనుకకు పంపివేస్తానని శపథం చేశారు. అవసరమైతే వారిని వెనుకకు పంపివేయడానికి సైన్యాన్ని వినియోగించుకుంటానని ఆయన ప్రకటించారు. అయితే, తన పూర్వపు హయాం (2016 2020)లో తాను వ్యవహరించిన తీరుపై మౌనముద్ర దాలుస్తున్నారు. సరిహద్దులో ‘గోడ’ నిర్మిస్తానని, కొన్ని ‘ఇస్లామిక్ దేశాల’ నుంచి వలసవచ్చేవారిపై నిషేధం విధిస్తానని ఆయన ఆనాడు చెప్పారు.

డెమొక్రాట్ల కన్నా తాను అక్రమ వలసదారుల కట్టడిలో మరింత సమర్ధంగా వ్యవహరించే మరింత నిర్ణయాత్మక నేతను అనే అభిప్రాయం కలిగించడం ట్రంప్ అసలు ఉద్దేశం. యుఎస్‌కు జనం అక్రమ వలసలకు డెమొక్రాట్లదే తప్పు అని ఆయన ఆరోపించారు. భారత్‌లో పరిస్థితి అందుకు భిన్నమైనదేమీ కాదు. అధిక సంఖ్యాక పాలకులు వలసల సమస్యపై ఒకే వైఖరి అనుసరిస్తుంటారు. అసోంలో బంగ్లాదేశీ పౌరుల అక్రమ వలసల సమస్య ఆరు సంవత్సరాలు సాగిన అసోం ఉద్యమం(19791985) సమయంలో చోటుచేసుకున్నది. అధికారం కైవసానికి ఆ సమస్యను ఉపయోగించుకుని అసోం ఉద్యమ నేత 1985లో అధికారంలోకి వచ్చారు.

అటు పిమ్మట బిజెపి 2016 అసోం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, తదుపరి పార్లమెంటరీ, రాష్ట్ర ఎన్నికల్లో ఆ అంశాన్ని ఉపయోగించుకుంది. సుదీర్ఘ కాలం అసోంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను బిజెపి తప్పు పట్టింది. పార్టీకి పటిష్ఠమైన ఓటు బ్యాంక్ సమకూర్చుకోవడానికి అసోంలోకి బంగ్లాదేశ్ నుంచి వలసలను కాంగ్రెస్ ప్రోత్సహించిందని బిజెపి ఆరోపించింది. బిజెపి అసోంలో అధికారంలోకి వచ్చినట్లయితే బంగ్లాదేశీ ప్రజలను అందరినీ అసోం నుంచి తిప్పి పంపివేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. 1985లో సంతకాలు జరిగిన అసోం ఒప్పందాన్ని తుచ తప్పకుండా అమలు పరుస్తామని బిజెపి 2016 రాష్ట్ర శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేసింది. బిజెపి 2016 నుంచి అసోంలో అధికారంలో ఉన్నది. కానీ అక్రమ వలసల సమస్య అపరిష్కృతంగానే ఉండిపోయింది. అందుకు భిన్నంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టాన్ని చేసింది. 2014 డిసెంబర్ 31న లేదా అంతకు ముందు అసోంలోకి, భారత్‌లోకి ప్రవేశించిన హిందు బంగ్లాదేశీలు, మూడు ఇతర వర్గాల పౌరులకు ఆ చట్టం పౌరసత్వం మంజూరు చేస్తుంది. ప్రస్తుతం సాగుతున్న జార్ఖండ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అదే వివాదాన్ని బిజెపి ముందుకు తెచ్చింది. బంగ్లాదేశీ ప్రజల అక్రమ వలసల వల్ల జార్ఖండ్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో జనాభా తీరును మార్చివేసిందని బిజెపి వాదిస్తూ, ముఖ్యంగా బెంగాల్, బీహార్ సరిహద్దుల్లోని సంతాల్ పరగణాలో ఆదివాసీల జనాభా ‘క్షీణత’ను ఉటంకించింది. ప్రధాని మోడీ జార్ఖండ్‌లో తన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘వారు (చొరబాటుదారులు) జెఎంఎంకు అండగా ఉన్నారు, వారు ఇప్పుడు దానిపై పట్టు సాధిస్తున్నారు’ అని చెప్పారు.

వారిలో కొందరు జెఎంఎంలో కూడా చేరారు. జార్ఖండ్‌లోకి అక్రమ బంగ్లాదేశీ వలసలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు సందర్భంగా నిర్వహించిన దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఇద్దరు బంగ్లాదేశీ జాతీయులతో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిందని అధికారవర్గాలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ రోజు ఈ నెల 13న తెలియజేశాయి. భారత్‌లోకి అక్రమంగా మానవ రవాణాకు వీలు కల్పించినందుకు ఏజెంట్లుగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను బంగ్లాదేశీ చొరబాటుదారుల కేసులో పశ్చిమ బెంగాల్ నుంచి అరెస్టు చేశారు. వారిని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ మనీలాండరింగ్ కేసులో ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఈ నెల 12న పశ్చిమబెంగాల్‌తో పాటు ఎన్నికలు జరగనున్న జార్ఖండ్‌లోని 17 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. దాడుల్లో నకిలీ ఆధార్ కార్డులు, ఫోర్జరీ చేసిన పాస్‌పోర్ట్‌లు, అక్రమ ఆయుధాలు, స్థిరాస్తి పత్రాలు, నగదు, ఆభరణాలు, ప్రింటింగ్ పేపర్, మెషీన్లు, ఆధార్ ఐడి ఫోర్జరీ కోసం ఉపయోగించే ఖాళీ ప్రొఫార్మా వంటి ‘కీలక’ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఇడి అధికారులు వెల్లడించారు. జార్ఖండ్‌లోని 43 అసెంబ్లీ సీట్లకు ఈ నెల 13న పోలింగ్ జరగడం గమనార్హం.

రాష్ట్రంలో తక్కిన 38 సీట్లకు ఈ నెల 20న పోలింగ్ జరగనున్నది. ఈ సందర్భంలో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) బిజెపి నేతృత్వంలోని కేంద్రంపై విరుచుకుపడింది. ‘తమ బంగ్లాదేశీ వలసల కథనాన్ని నిరూపించేందుకు కాషాయ శిబిరానికి వీలు కల్పించే’ యత్నమే కేంద్ర సంస్థ చర్య అని జెఎంఎం ఆరోపించింది.జెఎంఎం మిత్రపక్షమైన కాంగ్రెస్ కూడా అటువంటి ఆరోపణే చేసింది. దాడులు బంగ్లాదేశీ చొరబాటుదారుల కోసం కాదని, రాష్ట్రంలో బిజెపి రాజకీయ బలాన్ని కాపాడేందుకు చివరి యత్నం అని కాంగ్రెస్ ఆరోపించింది. బిజెపి జార్ఖండ్‌లో అధికారంలోకి వచ్చినట్లయితే, రాష్ట్రంలో నుంచి చొరబాటుదారులను గుర్తించి వారిని ఏరివేయడానికి, వారు ఆక్రమించుకున్న భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 11న సెరాయికెలాలో ప్రకటించారు. 2014 పార్లమెంటరీ ఎన్నికల నుంచి, ఆ తదుపరి ఎన్నికల నుంచి అసోంలో ఇదే విధమైన ప్రకటనలు చేయడమైంది. బంగ్లాదేశీ ప్రజలు భారీఎత్తున వలస వచ్చిన కారణంగా జార్ఖండ్‌లో స్వదేశీ ఆదివాసీ ప్రజలు మైనారిటీ స్థాయికి తగ్గిపోతారనే వాదనను నిశితంగా పరిశీలించవలసి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, సొంత రాష్ట్రంలోని వారి కంటె కొత్త రాష్ట్రానికి వలస వచ్చిన వారు అంతర్ రాష్ట్ర వలస ప్రజలకు సంబంధించిన అఖిల భారత సగటు సంఖ్య 12.06 శాతంగా ఉన్నది. జార్ఖండ్‌లో తమ ఇళ్లలో నుంచి వలస వెళుతున్నవారిలో 18.66% మంది రాష్ట్రంలోనే కదలడాని కంటె మొత్తంగా రాష్ట్రం వదలి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు.

ఇక పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో అంతర్‌రాష్ట్ర వలసలు మరింత తక్కువ రేట్లలో వరుసగా 8.07 శాతం, 8.41 శాతంగా ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం, ఆదివాసీలు, ఆదివాసీయేతరులతో సహా 14.72 లక్షల మంది జార్ఖండ్ వాసులు రాష్ట్రం నుంచి వలస వెళ్లారు. రాష్ట్ర జనాభాలో అటువంటి వారి శాతం 5.46. అయితే, జార్ఖండ్ జనాభాలో ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చినవారు 1.8 లక్షల మంది లేదా 6.67 శాతం మంది ముఖ్యమైన మైనింగ్ పరిశ్రమలోకి వెళ్లి ఉండవచ్చు. 2011 నాటికి జార్ఖండ్ నుంచి వలస వెళ్లినవారి సంఖ్య 17.61 లక్షలకు లేదా రాష్ట్ర జనాభాలో దాదాపు 5.34 శాతానికి పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి సంఖ్య 22.65 లక్షలుగా అంటే రాష్ట్ర జనాభాలో 6.87 శాతంగా ఉన్నది.
జార్ఖండ్ నుంచి వలసదారులకు అత్యంత పాపులర్ ఇతర రాష్ట్ర గమ్యస్థానం పశ్చిమ బెంగాల్ (2011 జనాభా లెక్కల ప్రకారం, 4.59 లక్షల మంది)గా ఉన్నది. తరువాతి స్థానాల్లో బీహార్ (4.34 లక్షలు), ఒడిశా (1.67 లక్షలు), చత్తీస్‌గఢ్ (1.11 లక్షలు), ఉత్తరప్రదేశ్ (1.1 లక్షలు), మహారాష్ట్ర 1 లక్ష), ఢిల్లీ (69,196) ఉన్నాయి. పురుషులకు సంబంధించి జార్ఖండ్ నుంచి వలస వెళ్లడానికి అత్యంగ సాధారణ కారణం ఇతర ప్రాంతాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు ఉండడం. 51.1 శాతం మంది పురుష వలసదారులను ఉటంకిస్తూ ‘జర్నల్ ఆఫ్ మైగ్రేషన్ అఫైర్స్’లో ఐఐఎం రాయిపూర్ పరిశోధకుడు పినాక్ సర్కార్ 2023 నాటి అధ్యయనంలో తెలియజేశారు. మహిళల్లో 70.1 శాతం మంది తాము వలస వెళ్లడానికి వివాహం కారణమని తెలిపారు. జార్ఖండ్‌లో ముఖ్యంగా ఆదివాసీల్లో ఆదాయం స్థాయిలను పరిగణనలోకి తీసుకుంటే ఆ వలసల స్థాయి ఆశ్చర్యం కలిగించదు.

2023 24లో జార్ఖండ్ వార్షిక తలసరి ఆదాయం రూ. 65,062. అఖిల భారత సగటు రూ. 1.07 లక్షల కన్నా ఇది బాగా తక్కువ. 2011 నాటి ఆర్థిక, కులగణనల ప్రకారం, జార్ఖండ్ ఆదివాసీ కుటుంబాల్లో కేవలం 6.08 శాతం వేతన ఉద్యోగాల నుంచి ఆదాయం పొందుతుండగా, వారిలో దాదాపు 80 శాతం మంది నెలకు రూ. 5000 కన్నా తక్కువ ఆర్జించారు. అక్రమ వలసలను అరికట్టడం ప్రభుత్వానికి అత్యంత ప్రధాన బాధ్యత. కానీ దురదృష్టవశాత్తు దానిని తరచు పాక్షిక వైఖరి, సమీకరణాలు, దృష్టి మళ్లించే కారణాలకు ఉపయోగించుకుంటున్నారు, కొన్ని సార్లు ప్రతిపక్షం కూడా అందుకు బలి అవుతోంది. సరిహద్దు నియంత్రణలు పటిష్ఠం చేయడం, పోలీస్ సిబ్బంది సంఖ్య పెంచడం, సరిహద్దు నియంత్రణకు టెక్నాలజీపై వెచ్చించం లేదా భద్రత సంస్థలను జవాబుదారీ వహించేలా చేయడం గురించి మాట్లాడడమే లేదు. బంగ్లాదేశీ, రోహింగ్యాలు లేదా ఇతర ఘుస్పెహ్‌తీ (చాలా వరకు ముస్లింలు) అందరినీ బలవంతంగా తిప్పి పంపివేస్తామని ఊకదంపుడుగా చెబుతున్నారు. వలసల వ్యతిరేక భావజాలం ఎన్నికల్లో విజయానికి అత్యంత శక్తిమంతమైన సాధనం అవుతున్న దృష్టా కేంద్రంలోని అధికార పార్టీ, దాని మిత్రపక్షాలు ఆ విషయమై జూలు విదిలిస్తుంటాయి, ఎందుకటే ఆర్థిక పునరుజ్జీవం, నిరుద్యోగితపై పోరు, తయారీ రంగం, వ్యవసాయ రంగం పునరుజ్జీవం మొదలైన ఇతర కీలక అంశాలపై బాధ్యతల నుంచి దృష్టి మళ్లించేందుకు అది అక్కరకు వస్తుంది.

గీతార్థ పాఠక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News