Monday, January 20, 2025

రికార్డు స్థాయిలో చిన్న పడవలపై బ్రిటన్‌కు భారతీయుల అక్రమ వలస

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్‌కు చిన్న పడవల ద్వారా ఇంగ్లీష్ ఛానెల్ మీదుగా అక్రమంగా వలసపోతున్న భారతీయుల సంఖ్య గత ఏడాది చాలా ఎక్కువగా పెరిగిందని బ్రిటన్ రికార్డు వెల్లడించింది. దాదాపు 683 మంది భారతీయులు చిన్నపడవల ద్వారా బ్రిటన్ తీరాలు చేరుకున్నారు. బ్రిటన్‌కు అక్రమ వలస అన్న పేరు మీద బ్రిటన్ హోం కార్యాలయం 2022 డిసెంబర్ ఆఖరికి ఎంతమంది అక్రమంగా బ్రిటన్ చేరుకున్నారో గణాంకాలు వెల్లడించింది. 2018 నుంచి 2019 వరకు ఎవరూ అక్రమంగా బ్రిటన్‌కు వలస వెళ్ల లేదని , 2020 లో 64 మంది చేరగా, 2021లో 67 మంది భారతీయులు చిన్నపడవలపై బ్రిటన్‌కు చేరుకున్నారని వివరించింది. మైగ్రేషన్ అండ్ మొబైలిటీ పార్టనర్‌షిప్ ( వలస మరియు చలనశీలత భాగస్వామ్యం ఎంఎంపి ) ఒప్పందం కింద అక్రమంగా వలస వచ్చేవారిని తిరిగి స్వదేశానికి పంపించి వేస్తామని భారత్‌తో బ్రిటన్ ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని పునస్సమీక్షిస్తామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గత వారం పార్లమెంట్‌లో ప్రస్తావించారు.

భారత్, పాకిస్థాన్, సెర్బియా, నైజీరియా, కీలకంగా ఇప్పుడు అల్బేనియా లతో ఈమేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని వందలాది మందిని తిరిగి వారి స్వదేశాలకు పంపించి వేస్తున్నామని సునాక్ వివరించారు. అక్రమంగా ఎవరైనా బ్రిటన్‌కు వలస వస్తే శరణార్థుల కింద పరిగణింపబడరని, ఆధునిక బానిసత్వ వ్యవస్థతో అనుసంధానం కాలేరని, మానవ హక్కులను కూడా పొందలేరని వలసదారులను ఉద్దేశించి సునాక్ హెచ్చరించారు. అక్రమ వలసలకు సంబంధించి హోం కార్యాలయం డేటా ప్రకారం 2022లో ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా బ్రిటన్‌కు అక్రమంగా 400 మంది భారతీయులు వచ్చారని తేలింది. 25 నుంచి 40 ఏళ్ల యువకులు భారత్ నుంచి బ్రిటన్‌కు అక్రమంగా చిన్న బోట్లపై చేరుకుంటున్నారు. 2022 లో బ్రిటన్‌కు అక్రమంగా చేరుకున్న వలసదారులు మొత్తం 45,755 మందిలో అల్బేనియా, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చేవారే ఎక్కువగా ఉన్నారు. తరువాతి స్థానాల్లో ఇరాన్, ఇరాక్, సిరియా, దేశాల వారున్నారు.

దక్షిణాసియాలో మిగతా దేశాలను పరిశీలిస్తే పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వారున్నారు. బ్రిటన్‌కు అక్రమంగా చేర్చడానికి అక్రమ రవాణాదారులు వేలకొలది పౌండ్లను వసూలు చేస్తున్నారు. శరణార్ధులమన్న పేరుతో బ్రిటన్‌లో ఉండడానికి ఎలాంటి భద్రత లేని చిన్నపడవలపై వీరిని చేరుస్తున్నారు. ఇలాంటి అక్రమ ప్రయాణాలలో గత కొన్నేళ్లుగా అనేక మరణాలు సంభవిస్తున్నాయి. అయినా వలసలు తగ్గడం లేదు. ఇలాంటి అక్రమ రవాణా పడవలను ఆపు చేయడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యంగా ప్రధాని సునాక్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్త అక్రమ వలస నిరోధక బిల్లును ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం ఎవరైనా అక్రమంగా బ్రిటన్ లోకి వలస వస్తే వారిని తిరిగి వారి స్వదేశాలకు తిరిగి పంపించి వేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News