Monday, January 20, 2025

నగరంలో విచ్చలవిడిగా తుపాకులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తుపాకులతో హైదరాబాద్ మహానగరంలో నిండిపోయింది. నగరంలో ఎక్కడ కాల్పులు జరిగినా కూడా నాటుతుపాకులు లభిస్తున్నాయి. ఫ్యాషన్ కోసం కొందరు, శత్రువులను చంపెందుకు మరికొందరు, భద్రత కోసం కొందరు నాటు తుపాకులను కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వస్తున్నారు. ముఖ్యంగా బీహార్ రాష్ట్రానికి వెళ్లి వారికి కావాల్సిన తుపాకీని కొనుగోలు చేసి తీసుకుని వస్తున్నారు. వాటిని చూపించి కొందరు బెదిరింపులకు పాల్పడుతుండడంతో మరికొందరు కాల్పులు జరిపి ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా కాల్పుల సంఘటనలు జరుగుతున్నాయి. పాతబస్తీలో కొంత కాలం క్రితం ఆస్తి వివాదంలో ఓ న్యాయవాది కాల్పులు జరపడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు, ప్రాణాలు పోలేదు. తాజాగా మియాపూర్‌లో ఓ హోటల్ జనరల్ మేనేజర్ దేబేందర్ గయాన్‌పై రతీష్ నాయర్ కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

దీంతో హైదరాబాద్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉద్యోగం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో నిందితుడు బీహార్‌కు వెళ్లి నాటు తుపాకీ కొనుగోలు చేసి తీసుకుని వచ్చి మరీ కాల్పులు జరిపాడు. నాటు తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా బీహార్ రాష్ట్రం వెళ్లి తుపాకీ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చినట్లు ఒప్పుకున్నాడు. రియల్ ఎస్టేట్ గొడవ కారణంగా కార్వాన్‌కు చెందిన ఆకాష్ సింగ్‌ను అతడి ప్రత్యార్థులు ఇంటికి పిలిచి మరీ కాల్పులు జరిపారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనలో నిందితులు బీహార్ రాష్ట్రం నుంచి నాటుతుపాకీని కొనుగోలు చేసి తీసుకుని వచ్చారు. మరోవైపు కొందరు కూలీలు పనిచేసుందుకు నగరానికి వచ్చి నాటు పిస్తోల్‌లను విక్రయిస్తున్నారు. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు పనిచేసేందుకు హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. వారు కొంత కాలం తర్వాత తమ రాష్ట్రానికి వెళ్లి నాటు తుపాకులను తక్కువ డబ్బులకు కొనుగోలు చేసి తీసుకుని వస్తున్నారు.

ఇక్కడ అవసరం ఉన్న వారికి ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ షాబుద్దిన్ అన్సారీ నిర్మాణ రంగంలో కూలీగా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు సొంత రాష్ట్రానికి వెళ్లి తక్కువ ధరకు పిస్తోల్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చాడు. దానిని ఎక్కువ ధరకు విక్రయించేందుకు చూస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం, బిహిడ్ జిల్లా, లహర్ మండలం, అస్వార్ గ్రామానికి చెందిన రాకేష్ త్యాగి దమ్మాయిగూడలో ఉంటూ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. సొంతరాష్ట్రానికి వెళ్లిన త్యాగి అక్కడ రూ.50వేలతో కంట్రీ మేడ్ పిస్తోల్‌ను కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చాడు. ఎక్కువ డబ్బులకు ఇక్కడ విక్రయించేందుకు తీసుకుని వచ్చినట్లు తెలియడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. కాటేదాన్ పారిశ్రామిక వాడలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు చేయడంతో అక్కడ వారికి పిస్తోల్ లభ్యమైంది. నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా కూలీ పనిచేందుకు వచ్చిన వారు తమ రాష్ట్రంలో దానిని కొనుగోలు చేసి తీసుకుని వచ్చినట్లు తెలిసింది. ఇలా వీరే కాకుండా కంట్రేమేడ్ పిస్తోళ్లు నగరంలోని ఎంత మంది వద్ద ఉన్నాయో కూడా పోలీసులు ఇప్పటి వరకు తెలియదు.

యువతి ఒంట్లో బుల్లెట్…
పాతబస్తీకి చెందిన ఓ యువతికి తీవ్రమైన వెన్నునొప్పి రావడంతో నిమ్స్‌కు తీసుకుని వచ్చారు. అక్కడ పరిశీలించిన వైద్యులు యుతికి ఎక్స్‌రే తీశారు, దానిని పరిశీలించిన వైద్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమె వెన్నెముకలో బుల్లెట్ ఉండడంతో ఎప్పుడు గాయపడింది, ఎవరు కాల్పులు జరిపారో తెలియకుండా ఉంది. దీనిపై ఎలాంటి దర్యాప్తు ముందుకు సాగలేదు, అటు పోలీసులు కానీ,ఇటు వైద్యులు కానీ వివరాలు బయటపెట్టలేదు. యువతి తండ్రి ఓ పార్టీకి చెందిన నాయకుడి ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది. సదరు నాయకుడు కాల్పులు జరపడంతో యువతి ఒంట్లోకి బుల్లెట్ వెళ్లినట్లు తెలిసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గుట్టు చప్పుడు కాకుండా యుతిని ఆస్పత్రి నుంచి డిఛార్చ్ చేసి ఇంటికి పంపించారు.

గన్ లైసెన్స్ గగనం …
సాధారణంగా తుపాకీ లైసెన్స్‌ను పోలీసులు ప్రాణాపాయం ఉన్న వారికి ఇస్తుంటారు. దీనిని జారీ చేసేందుకు వారి పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ విచారణ చేసి నివేదికను ఆయా పోలీస్ కమిషనర్లకు సమర్పించిన తర్వాత దానిని పరిశీలించి తుపాకీ లైసెన్స్ జారీ చేస్తారు. వారికి నిజంగా ప్రాణాపాయం ఉందని భావిస్తేనే ఇస్తారు లేకుండా ఇచ్చేందుకు నిరాకరిస్తారు. లైసెన్స్ తీసుకున్న వారు దానిని దుర్వినియోగం చేసినా కూడా రద్దు చేస్తారు. కానీ తుపాకీ లైసెన్స్ రావాలంటే చాలా కష్టం గతంలో మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నవారికి ఎక్కువగా గన్‌లైసెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు వారి ఉనికి అంతగా లేకపోవడంతో గన్‌లైసెన్స్ ఇవ్వడం కఠినం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News