మౌంట్ సీనాయ్ ఆస్పత్రి పరిశోధకుల అధ్యయనం
వాషింగ్టన్ : కరోనాతో దీర్ఘకాలం బాధపడిన చాలా మందిని నెలల తర్వాత కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా వైరస్‌ల ఇన్‌ఫెక్షన్ సోకిన తరువాత సీఎఫ్‌సీ (క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ ) ఎదురౌతుంది. దీనివల్ల తీవ్ర అలసట, కుంగుబాటు వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే కొవిడ్ దీర్ఘకాల బాధితుల్లో పోస్ట్ అక్యూట్ సీక్వెల్ ఆఫ్ సార్స్ కొవ్2 (పీఎఎస్‌సీ) కనిపిస్తోందని , ఇంట్లోనే ఉండి, స్వస్థత పొందిన వారి లోనూ ఇది తలెత్తుతోందని మౌంట్ సీనాయ్ ఆస్పత్రి పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా తీవ్ర అలసట, దేనిపైనా ఏకాగ్రత కుదరక పోవడం, గ్రహణశక్తి మందగించడం, నిద్రలేమి, ఒళ్లు, కండరాల నొప్పులు , శ్వాస సరిగా ఆడక పోవడం వంటి సమస్యలు ఉంటున్నట్టు గురించారు. 23 69 సంవత్సరాల వయసు మొత్తం 41 మంది కొవిడ్ దీర్ఘకాల బాధితుల ఆరోగ్య పరిస్థితిని వారు విశ్లేషించారు. పల్మనరీ, కార్డియాలజీకి సంబంధించి సీపీఈటీ వంటి అనేక వైద్య పరీక్షలు కూడా చేపట్టారు. ‘ 2005 లో సార్స్‌కొవ్ 1 కు గురైన వారిలోనూ దాదాపు ఇలాంటి లక్షణాలే కనిపించాయి. వారిలో 27 శాతం మంది నాలుగేళ్ల వరకు సిఎఫ్‌సీ సమస్యతో బాధపడ్డారు. తీవ్రస్థాయి కొవిడ్ బాధితుల్లో అవయవాలకు నష్టం వాటిల్లుతున్నట్టు గుర్తించాం’ అని పరిశోధనకర్త డాక్టర్ డొన్నా మాన్సిని వివరించారు.