Sunday, November 17, 2024

ఇంటర్నెట్‌లో పరువు తాకట్టు

- Advertisement -
- Advertisement -

Illusion is that judges are appointed by judges:CJI

ప్రతిష్టలకు భంగం కలిగించే కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు
పాలన వ్యవస్థ సహకారం లేకపోవడం న్యాయవ్యవస్థకు సవాలే
జడ్జిలను జడ్జీలే నియమిస్తారనడం అదో భ్రమ
అనుకూలంగా తీర్పులివ్వకుంటే నిందలు, భౌతిక దాడులా?
కోర్టు స్పందించేవరకు అధికారులు పట్టించుకోవడం లేదు
జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాస సభలో సిజెఐరమణ కీలక వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్: జడ్జిలను జడ్జీలే నియమిస్తున్నారనడం అనేది అతిపెద్ద భ్రమ అని సిజెఐ జస్టిస్ ఎన్‌వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాలలో ఆదివారం నాడు దివంగత జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాస సభలో ‘భారత న్యాయవ్యవస్థ- భవిష్యత్ సవాళ్లు’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఇటీవలి కాలంలో జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయని, అయితే అది కేవలం ప్రచారంలో ఉన్న భ్రమేనన్నారు. మిగతా అన్ని వ్యవస్థల్లాగే న్యాయవ్యవస్థ కూడా ఆటలో ఓ పావే అని అన్నారు. జడ్జిల నియామకాల్లో కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియం, ఇంటెలిజెన్స్ బ్యూరో, అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర కూడా ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. జడ్జిల నియామకాల్లో ఇంత జరుగుతున్నా, అది తెలిసిన వాళ్లు కూడా ‘జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే ఎన్నెన్నో నిందలు వేయడంతో పాటు భౌతిక దాడులకూ దిగుతున్నారని ఆయన అన్నారు.

ఆ ఘటనలపై కోర్టులు స్పందించేంత వరకూ ఏ అధికారులూ స్పందించడం లేదని, ఘటనలపై దర్యాప్తు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు సురక్షితమైన వాతావరణం కల్పించినప్పుడే జడ్జిలు నిర్భయంగా విధులు నిర్వహించగలుగుతారన్నారు. దురదృష్టంకొద్దీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లంతా ఎన్నో దశాబ్దాలుగా ప్రభుత్వాల చేతుల్లో కీలు బొమ్మల్లాగే ఉంటున్నారని, కావున ప్రాసిక్యూటర్లు స్వతంత్రంగా పనిచేయలేరన్నది పెద్ద ఆశ్చర్యపోయే విషయమేమీ కాదన్నారు. అవసరం లేని కేసులు కోర్టు వరకు రాకుండా నిలువరించడంలో వారేమీ చేయలేకపోతున్నారన్నారు. ఏమాత్రం ఆలోచించకుండానే బెయిల్ అప్లికేషన్లను తిరస్కరిస్తుంటారని, నిందితులకు లాభపడేలా విచారణ సమయంలో ఆధారాలను తొక్కిపెట్టేస్తుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి సంబంధించి ఓ స్వతంత్ర ఎంపిక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఇటీవల పార్లమెంట్ లో ‘ద హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ (శాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్) సవరణ బిల్లు 2021’ చర్చ సందర్భంగా కేరళ ఎంపి జాన్ బ్రిట్టీస్ జడ్జిలను జడ్జిలే నియమించడమేంటని, దానిని తానెక్కడా వినలేదని ఆయన చేసిన వ్యాఖ్యలను సిజెఐ గుర్తు చేశారు.

ఇటర్నెట్ కేంద్రంగా అక్రమాలు 

దేశవ్యాప్తంగా ఇంటర్‌నెట్ కేంద్రంగా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా పరువుకు భంగం కలిగించే కంటెంట్‌ను ఇంటర్‌నెట్‌లో ప్రచారం చేస్తున్నారని సిజెఐ వివరించారు. ఇలాంటివన్నీ న్యాయవ్యవస్థకు సవాళ్లుగా మారాయని, మనీ లాండరింగ్, వర్చువల్ కరెన్సీ ద్వారా క్రైమ్ ఫండింగ్ చేస్తున్నారన్నారు. క్రిమినల్ చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా న్యాయవ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోందని, వ్యక్తుల స్వేచ్ఛను కాపాడడంలో న్యాయవ్యవస్థది కీలక పాత్ర అని సీజేఐ వ్యాఖ్యానించారు. ‘ఎగ్జిక్యూటివ్, శాసన వ్యవస్థల్లో ఉల్లంఘనలు జరిగితే దాన్ని సరిదిద్దే పాత్ర న్యాయవ్యవస్థదేనని, పరిపాలన వ్యవస్థ నుంచి సరైన సహకారం లేకపోవడం కూడా న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో ప్రధానమైందన్నారుది. న్యాయవ్యవస్థలో సాంకేతిక నిపుణులకు భాగస్వామ్యం ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు.

న్యాయపరమైన అంశాలు 

దేశంలో చట్టాలు చేసే ముందు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా.. లేదా..? అనేది సమీక్షించుకోవాలని సిజెఐ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో దేశంలో జడ్జిలపై భౌతికదాడులు పెరిగాయని, అనుకూల తీర్పులు రాకుంటే జడ్జిలపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ తరహా ఘటనలపై విచారణ జరపాలని కోర్టులు ఆదేశిస్తేనే విచారణ ముందుకెళ్తోందని ఇదో దురదృష్టకరమని తెలిపారు. జడ్జిలకు స్వేచ్ఛ వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని, జడ్జిల నియామకంలో అనేక వ్యవస్థల పాత్ర ఉంటుందన్నారు. రిటైర్మెంట్ తర్వాత జడ్జిలకు సరైన భద్రత ఉండడం లేదని, కనీసం గృహ, వైద్య సదుపాయాలు కూడా సరిగా ఉండడం లేదన్నారు. దేశంలో 4.60 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, పెండింగ్ కేసుల్లో 46 శాతం ప్రభుత్వ కేసులే ఉన్నాయన్నారు. వాటిల్లో ఎక్కువగా భూ సంబంధిత వ్యవహారాల కేసులేనని, అందరి సహకారం ఉంటేనే న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పని చేయగలదని సిజెఐ వ్యాఖ్యానించారు.

హైకోర్టులో ఖాళీలను భర్తీ చేస్తాం 

దేశవ్యాప్తంగా హైకోర్టులో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని సిజెఐ తెలిపారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు త్వరలోనే కొత్త న్యాయమూర్తులను నియమించి ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ కీర్తిని ఇనుమడింపజేస్తానని మాట ఇస్తున్నానని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News