మాస్కో : రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సంబంధించిన విమానం ‘ఇల్యుమిష్ ఐఎల్ 80 మాక్స్‌డోమ్, తాజాగా మాస్కో చుట్టూ చక్కర్లు కొట్టడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఈ విమానానికి అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేరు పెట్టారు. ఆపద సమయాల్లో దీన్ని వినియోగిస్తుంటారు. అణుయుద్ధం లాంటివి సంభవించేటప్పుడు రష్యాను కాపాడటం దగ్గర నుంచి అణుదాడికి ఆదేశాలు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఈ విమానంలో ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సాగిస్తున్న తరుణంలో ఇది మళ్లీ ప్రత్యక్ష మైంది. ఈ విమానంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కావలసిన ఇంథనాన్ని ఆకాశం లోనే నింపుకోవచ్చు. ఈమేరకు కాక్‌పిట్ కిందనే ఏర్పాట్లు చేశారు. ఆకాశం నుంచే మిలిటరీకి ఆదేశాలు జారీ చేయవచ్చు. కాక్‌పిట్‌కు తప్ప మరెక్కడా విమానానికి కిటికీలు లేవు.
విమానంలో ముఖ్యమైన భాగం జ్వెనో ఎస్. ఇందులో అత్యంత ఆధునికమైన కమ్యూనికేషన్ గది ఉంది. విమానం పైన ముందు భాగంలో ఏర్పాటు చేసిన శాటిలైట్ యాంటెన్నాల సాయంతో ఇది పనిచేస్తుంది. సముద్రం లోని సబ్‌మెరైన్లలో ( బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉన్నవి) ఉన్న అధికారులకు ఆదేశాలు ఇవ్వడానికి వీలుగా వెరీలో ఫ్రీక్వెన్సీ యాంటెన్నా వ్యవస్థ కూడా ఉంది. 1987 లో తయారైన ఈ విమానం మొదట తయారు కాగా, ఇలాంటివి తరువాత నాలుగు తయారయ్యాయి. 2008 లో వీటిని ఆధునీకరించారు. ఈ విమానం పొడవు 60 మీటర్లు. రెక్కల పొడవు 48 మీటర్లు. గంటకు 850 కిలో మీటర్ల వేగంతో దూసుకువెళ్తుంది. ఒకసారి ఇంధనం నింపాక 3600 కిలో మీటర్ల వరకు వెళ్లగలదు.