Friday, November 22, 2024

బిజెపిలో చేరను.. కాంగ్రెస్‌లో ఉండను

- Advertisement -
- Advertisement -

I'm leaving Congress but not joining BJP

తేల్చిచెప్పిన కెప్టెన్ అమరీందర్ సింగ్
పొమ్మనలేక పొగబెడితే ఉంటామా?
సిద్ధూ టీమర్ కాదు ఒంటరి తుంటరి
స్థిరత్వం లేనోడికి పిసిసి పీఠమిచ్చారు
పంజాబ్‌లో కాంగ్రెస్‌కు చెల్లుచీటే

న్యూఢిల్లీ : తాను బిజెపిలో చేరడం లేదని, అయితే కాంగ్రెస్‌ను వీడటం ఖాయమని పంజాబ్ మాజీ సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. ఇటీవలే అమరీందర్ బలవంతంగా పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ దశలో ఆయన బిజెపిలోకి వెళ్లుతారనే బలీయ ఊహాగానాలు వెలువడ్డాయి. ఒక్కరోజు క్రితమే అమరీందర్ ఢిల్లీలో బిజెపి సీనియర్ నేత , హోం మంత్రి అమిత్ షాను కలిశారు. గంటకు పైగా వీరిరువురి భేటీ జరిగింది. తరువాత ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు. అయితే ఇందులో రాజకీయాలులేవని, కేవలం రైతుల సమస్యల గురించి మాట్లాడానని ఆ తరువాత అమరీందర్ విలేకరులకు తెలిపారు. ఇప్పుడు ఆయన ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ భవిష్యత్తు గురించి తెలిపారు.

‘ఇప్పటికైతే కాంగ్రెస్‌లోనే ఉన్నా. అయితే కాంగ్రెస్‌లో ఇకపై ఉండటం లేదు. ఈ అంశాన్ని ముందుగానే స్పష్టం చేశారు. నా పట్ల ఈ విధమైన వ్యవహార శైలి పనికిరాదు ’ అని కెప్టెన్ చెప్పారు. అమిత్ షాను కలిసిన తరువాత ఈ మాజీ సిఎం తమ ట్విట్టర్ బయో నుంచి కాంగ్రెస్ పేరును తీసేశారు. ఈ విధంగా పార్టీ వీడుతున్నట్లు సంకేతాలు వెలువరించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పని అయిపోయినట్లే అని ఆయన సాదాసీదాగానే తేల్చిచెప్పారు. నవజోత్ సింగ్ సిద్ధూ వట్టి పిల్లచేష్టల వ్యక్తి అని తెలిపారు. పార్టీ ఆయనకు పెద్ద పదవి ఇచ్చింది. పిసిసి పీఠం కట్టబెట్టింది. దీనితో ఆయన బ్యాటాట ఆడుకున్నట్లుగా వ్యవహరించారని అమరీందర్ విమర్శించారు.

మేడం చెప్పగానే రాజీనామా చేసేశా

తాను 52 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నాయని, ఈ క్రమంలో తనకు అనేక నమ్మకాలు, సొంత సిద్ధాంతాలు ఉన్నాయని, అయితే వీటికి భంగకరంగా పార్టీ తనపట్ల వ్యవహరించిందని జరిగిన పరిణామాలను సింగ్ గుర్తు చేశారు. ఆ రోజు ఉదయం పదిన్నరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు తనకు ఫోన్ చేశారని, పదవికి రాజీనామా చేయండని చెప్పారని, తాను మారు మాటలేకుండా ఓకె చెప్పానని, తరువాత సమయం తీసుకోకుండానే గవర్నర్‌కు రాజీనామా పత్రం అందించానని తెలిపారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవిత విశ్వసనీయతను, సమగ్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం తన మనసు చివుకు మన్పించిందని అన్నారు. నమ్మకం లేకపోతే పార్టీలో ఉండటం ఎందుకు అని అనుకున్నానని తెలిపారు.

మూడుసార్లు అవమానాలు

తాను పదవి నుంచి వైదొలగడానికి ముందు సెప్టెంబర్ 18న తాను సోనియాకు ఫోన్ చేసి, ఒకటి కాదు రెండుకాదు మూడుసార్లు తనకు అవమానం జరిగిందని చెప్పానని కెప్టెన్ తెలిపారు. విశ్వాసం లేని చోట , నమ్మని వారి పార్టీలో కొనసాగడం భావ్యం అన్పించుకుంటుందా? అని ప్రశ్నించారు. తాను అమిత్ షాతో కలియడంతో వేరే ఊహాగానాలు వచ్చాయని, అయితే తాను బిజెపిలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను క్షణకాలపు నిర్ణయాలకు దిగే చంచల స్వభావిని కానని అన్ని ఆలోచించుకునే ముందుకు వెళ్లుతానని తెలిపారు.

సిద్ధూకు స్థిరత్వం లేదే

సిద్ధూ అపరిపక్వపు వ్యక్తి. ఈ విషయాన్ని తాను పలుసార్లు చెప్పానని ఇది నిజమని కెప్టెన్ తేల్చిచెప్పారు. ఆయన జట్టులో వ్యక్తిగా ఉండడు. టీం స్పిరిట్ లేదు. ఒంటరి. పైగా రాజకీయాలకు వచ్చిన తరువాత తుంటరి అయినట్లుందన్నారు. పంజాబ్ పిసిసి నేతగా పార్టీని ఆయన ఏ విధంగా ముందకు తీసుకుపోతాడు? త్వరలోనే ఎన్నికలు జరిగే రాష్ట్రానికి టీం ప్లేయర్ అవసరం . అంతేకాని సిద్ధూ వంటి ఒంటరి వ్యక్తిత్వపు వారితో ఒరిగేదేమీ లేదని తెలిపారు. అయితే సిద్ధూ వస్తే సభలకు జనం వస్తారు. బాగా నటించడం చేతనైన వ్యక్తి. ఆయన కపిల్ శర్మ షోలో ఇదే చేశాడు. బాగా మెప్పు పొందాడు. సీరియస్ వ్యక్తి కాదు. ఇటువంటి వారితో కీలకమైన ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమా? పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడం వీలయ్యే పనేనా అని ప్రశ్నించారు.

రాహుల్..సలహాలు రుచించని వ్యక్తి

పంజాబ్ వ్యవహారాన్ని రాహుల్ సరిగ్గా నిర్వహించలేకపొయ్యారనే అంశంపై అమరీందర్ స్పందించారు. పార్టీలోకి యువరక్తం చేరాలని ఆయన ఆశిస్తున్నారు. అయితే పార్టీ బాగుకు పాతతరం ఇచ్చే సలహాలు తీసుకోవడం ఆయనకు ఇష్టం లేదని చెప్పారు. దీనితో పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. పాతకొత్తల కలయికతో పార్టీకి మేలు జరగాల్సి ఉంటుంది తప్ప ఏకపక్ష ధోరణితో నష్టమే అన్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ను చీకటి కమ్ముకున్నట్లే అని తెలిపారు. దేశ రాజధానికి వచ్చిన కెప్టెన్ పార్టీ వీడకుండా నచ్చచెప్పేందుకు సీనియర్ నేతలు అంబికా సోనీ, కమల్‌నాథ్‌లు విఫలయత్నం చేశారు. మంగళవారం నుంచి ఢిల్లీలోనే మకాం వేసి ఉన్న కెప్టెన్ సోనియా గాంధీని కలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇతర పక్షాల నేతలను వరుసగా కలుస్తూ వస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News