Thursday, January 23, 2025

ఐక్య ప్రతిపక్షం కోసం…!

- Advertisement -
- Advertisement -

‘నాకేమీ వద్దు, ప్రధాని పదవి పోటీలో నేను లేను’ అని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీని దేశాధికార అందలం నుంచి దింపడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నానని ఎరుక పరిచారు. ఇందుకోసం ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టేందుకు సోమవారం నాడు మరో గట్టి ప్రయత్నం చేశా రు. ఇంతకు ముందు ఈ పని మీదనే ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను, ఇతరులను కలుసుకొన్న నితీశ్ ఈసారి కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో, లక్నోలో ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్‌లతో భేటీ అయ్యారు.

ఎప్పటి మాదిరిగానే ఆయన వెంట బీహార్ ఉప ముఖ్యమంత్రి రాష్ట్రీయ జనతా దళ్ అధినేత తేజస్వి యాదవ్ వున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు నేడున్న పరిస్థితిని గమనిస్తే నితీశ్ లక్ష సాధన సులభం కాదని గట్టిగా చెప్పొచ్చు. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి లోక్‌సభలో సంఖ్యా బలాన్ని భారీగా కోల్పోయి బక్కచిక్కిపోయిన కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించి వున్న తన ఉనికిని, జాతీయ ప్రతిపక్ష హోదాలో తానే కొనసాగుతున్న వాస్తవాన్ని చూసుకొని తిరిగి ఒంటరిగానే పోటీ చేసి కేంద్రంలో అధికారంలోకి రావాలన్న లక్షంతో అందుకు తగిన వ్యూహంతో ముందుకు వెళుతున్నది.

అయితే ఈ విషయంలో గతంలో వుండిన పట్టు, పదును మీద అదిప్పుడు లేదని బోధపడుతున్నది. అయినా చివరి వరకు తలవాటా, అగ్ర ప్రాధాన్యం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదిపే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. కాంగ్రెసేతర ప్రతిపక్ష ఐక్యత ద్వారా బిజెపిని గద్దె దింపడం సాధ్యమనే భరోసా లోపించడం వల్లనే నితీశ్ దానిని కూడా కలుపుకొని వెళ్ళాలని సంకల్పించినట్టు అనుకోవలసి వున్నది. మిగతా ప్రతిపక్షాల ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో బలంగా వేళ్ళూనుకొని వున్న ప్రాంతీయ పక్షాల నేతలు కూడా ప్రధాని పదవిపై దృష్టి నిలిపి వున్న మాట నిజం. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించి అందరినీ ఒక్క త్రాటి మీదికి తేవడం అనేది భగీరథ యత్నమే అవుతుంది. ఆ కష్టనష్టాలు నితీశ్‌కు తెలియవనుకోలేము. ఎంతో అనుభవం వున్న ఆయన అంచనాలు ముందు ముందుగాని పూర్తిగా వెల్లడి కావు. ఒక వైపు చూస్తే ప్రతిపక్షానికి గల బలమైన నాయకుల్లో ఒకరైన శరద్ పవార్ కట్టుతెంచుకొని బిజెపి అనుకూల వైఖరికి మొగ్గిపోతారేమో అనే అనుమానాలు రోజురోజుకీ చిక్కబడుతున్నాయి. ఆయన ఇటీవల అదానీతో కలిసిన సందర్భమూ ఆయన స్టాక్ మార్కెట్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు చేయించాలన్న డిమాండ్ సమంజసమైనది కాదని స్వయంగా వ్యాఖ్యానించడమూ తెలిసిందే.

మరో వైపు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటి నేతలు బిజెపికి వ్యతిరేక దిశకు మళ్ళుతారనే నమ్మకం ఏర్పడడం లేదు. బిజెపికి, కాంగ్రెస్‌కు సమాన దూరంలో వుంటామని మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్ ఇంతకు ముందు ప్రకటించి వున్నారు. అదే నిజమైతే బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావడమనేది జరిగే పని కాదు. అయినా ఇంకా ఏడాది పైచిలుకు దూరంలో వున్న లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రతిపక్ష నేతల వైఖరుల్లో ఎటువంటి మార్పు అయినా సాధ్యమే. ఆ మార్పును తెచ్చే వరకు నితీశ్, తేజస్విలు పట్టుదలతో కృషి చేస్తారా, మధ్యలోనే కాడి వదిలేస్తారా అనే ప్రశ్న వుండనే వుంటుంది. ప్రస్తుతానికైతే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షం సంఘటిత శక్తిగా బిజెపిని ఎదుర్కోడానికి నితీశ్ పకడ్బందీ వ్యూహాన్నే రూపొందించుకొన్నారు. ప్రతి లోక్‌సభ స్థానంలోనూ ప్రతిపక్షం ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనను ముందుకు తీసుకుపోదలచారని అర్థమవుతున్నది. ఇది జరిగితే బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా చూడగలుగుతారు. అది బిజెపికి గట్టి పోటీని ఇవ్వగలుగుతుంది.

సోమవారం నాడు నితీశ్, తేజస్విలు కలిసిన సందర్భంగా మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్ మాట్లాడిన తీరు బిజెపిని దించడమే లక్షంగా పని చేయడానికి వారు సిద్ధంగా వున్నట్టు అనిపించింది. బిజెపి మీడియా మద్దతుతో, బూటకపు ప్రచారాలు, వాగ్దానాలు, వీడియోలు, దుస్తంత్రాలతో పెద్ద హీరోగా తనను తాను చూపించుకొంటున్నదని, దానిని జీరో చేయాలని కోరుకొంటున్నానని మమతా బెనర్జీ అన్నారు. అంతేకాకుండా తాను, నితీశ్ కలిసి ప్రతిపక్ష నేతలందరి వద్దకు వెళ్ళదలచామని ఇందులో వ్యక్తిగత భేషజాలు, అహంకారాలకు తావుండదని ఆమె చెప్పడం గమనార్హం. బీహార్‌లో అఖిల ప్రతిపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆమె నితీశ్‌ను కోరారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం నితీశ్ కుమార్ చేపట్టిన కార్యక్రమానికి తన మద్దతు వుంటుందని, బిజెపి తప్పుడు ఆర్థిక విధానాల వల్ల రైతులు, పేదలు, కార్మికులు బాధలు పడుతున్నారని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇప్పటికైతే అంతా సవ్యంగానే జరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ నితీశ్ కృషి అంతిమ గమ్యం చేరుతుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News