పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలోనే ఇమాన్వీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇమాన్వీ కుటుంబానికి పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమెను ఫౌజీ సినిమా నుంచి తీసేయాలంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమాన్వీ స్పందిస్తూ… పాకిస్తాన్ ఆర్మీతో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈమేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
“పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నా ప్రగాఢ సంతాపం. నేను ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా ఇంట్లో వాళ్లకు ఎవ్వరికీ పాకిస్తాన్ ఆర్మీతో ఎలాంటి సంబంధం లేదు. సోషల్ మీడియా, మీడియాలో నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. నేను ఇండియన్ అమెరికన్‌ని. హిందీ, తెలుగు, గుజరాతి, ఇంగ్లీష్ భాషలు మాట్లాడతాను. నేను లాస్ ఏంజిల్స్‌లో పుట్టాను. మా అమ్మానాన్న యుక్త వయస్సులో ఉన్నపుడే అమెరికాకు వచ్చేశారు. నేను చదివింది మొత్తం అమెరికాలోనే.. నటన, కొరియోగ్రఫీ, డ్యాన్స్‌లో శిక్షణ కూడా అమెరికాలోనే తీసుకున్నాను. నాది కూడా భారత రక్తమే. ఇండియన్ సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను”అని ఇమాన్వి అన్నారు.