న్యూఢిల్లీ: దేశంలోని లక్షలాది మంది రైతులకు కీలకమైన వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే 199 ఆగ్రోమెట్ యూనిట్ల మూసివేతకు భారత వాతావరణ విభాగం (ఐఎండి) నిర్ణయించింది. ఈ సమాచారం వల్ల రైతులు తమ పంట నష్టాలను తగ్గించుకోవడమే కాక, ఆదాయాన్ని పెంచుకోగలుగుతున్నారు. ప్రస్తుత సంవత్సరంలో ఈ యూనిట్ల సర్వీస్‌లు ఇక కొనసాగబోవని జనవరి 17న ఐఎండి తన ఉత్తర్వులో పేర్కొంది.
గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక సంఘం వ్యయ పద్దులపై నిర్వహించిన సమావేశంలో నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారులు ప్రతి జిల్లా లోను ఆగ్రోమెట్ యూనిట్లకు ఎంతవరకు సిబ్బంది అవసరమో సమీక్షించాలని సలహా ఇచ్చారని పేర్కొంది. యూనిట్ల వారీగా కాకుండా యూనిట్లను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కేంద్రీకృతం చేసి డేటా సేకరించవచ్చని సూచించినట్టు తెలిసింది. 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 199 ఆగ్రో యూనిట్లను మూసివేయడం వల్ల వేలాది మంది రైతులు, శాస్త్రవేత్తలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని సిబ్బంది అభిప్రాయపడ్డారు.