న్యూఢిల్లీ : భారత వాతావరణ విభాగం (ఐఎండి) దేశ వ్యవసాయ రంగానికి చల్లటి కబురు చెప్పింది. ప్రస్తుత ఏడాది 2022 లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దేశం లోని అత్యధిక భాగాల్లో సమృద్ధిగా వర్షాలు పడతాయని రైతన్నలకు సంకేతాలిచ్చింది. ఈ మేరకు గురువారం ఒక రిపోర్టును ఐఎండి విడుదల చేసింది. వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్‌పీఎ ) లో 99 శాతం మేర నమోదయ్యే అవకాశం ఉందని, అయితే అంచనాల్లో ప్లస్ లేదా మైనస్ 5 శాతాన్ని దోషంగా భావించాలని వివరించింది. ఈశాన్య భారతంతోపాటు వాయువ్యం, దక్షిణ ద్వీపకల్పం లోని కొన్ని దక్షిణ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవ్వవచ్చని విశ్లేషించింది.
అయితే ఈ తక్కువ వర్షపాతం వ్యవసాయ రంగ కార్యకలాపాలను ఏమాత్రం ప్రభావితం చేయబోదని స్పష్టం చేసింది. దేశం లోని అత్యధిక ప్రాంతాలు సాధారణ వర్షపాతాన్ని పొందనుండడమే ఇందుకు కారణమని వివరించింది. ఇక ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనే విషయానికి వస్తే 2022 లో సాధారణ వర్షపాతం నమోదయ్యేందుకు 40 శాతం అవకాశాలున్నాయి. సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదయ్యేందుకు 26 శాతం ఛాన్స్ ఉంది. ఇక లోటు వర్షపాతం నమోదయ్యేందుకు 15 శాతం, అతివర్షపాతం నమోదయ్యేందుకు 5 శాతం అవకాశాలున్నాయని ఐఎండీ లెక్కగట్టింది.