హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజులపాటు వాన కురియనున్నదని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ(ఐఎండి) తెలిపింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వానలు పడకపోవచ్చు. కాకపోతే మండుతున్న ఎండల వేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగించొచ్చు.
ఆదివారం నుంచి మంగళవారం వరకు అనేక జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 8న ఆదిలాబాద్, నిర్మల్, కుమరం భీమ్, నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల్ ప్రాంతాల్లో వానలు పడవచ్చు. కామారెడ్డిలో ఏప్రిల్ 9న వానలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. కాగా వానల వల్ల ఉష్ణోగ్రత తగ్గవచ్చు. హైదరాబాద్ లోని గోల్కొండలో గురువారం ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ గా నమోదవ్వడం ఇక్కడ గమనార్హం. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నల్గొండలో 43.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. ఈ వానల వల్ల రాష్ట్రంలోని ప్రజలకు ఎండల వేడిమి నుంచి కాస్త ఉపశమనం కలగవచ్చునని ఐఎండి పేర్కొంది.