Friday, November 15, 2024

బంగాళాఖాతంలో వాయుగుండం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. చక్రవాతపు ఆవర్తనం ఒకటి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ – మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైందని, ఈ ప్రభావంతోనే తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్,

మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్‌తో పాటు నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 4 రోజులు అక్కడ భారీ నుంచి కుండపోత వానలు కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆవర్తనం ప్రభావంతో మంగళవారం హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది.

బంగాళాఖాతంలో మరింత బలపడ్డ అల్పపీడనం : ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడుతుంది. ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న నేపథ్యంలో తీవ్రంగా అల్పపీడనంతో బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశమున్నట్లు వివరించింది. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అల్పపీడనం బుధవారానికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఈ తుఫాను ఈనెల 17న చెన్నై సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేశారు.

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాగల 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ అమరావతి విభాగం వివరించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ఈ వాయుగుండం పయనిస్తుందని, అదే సమయంలో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వెల్లడించింది. ఏపీలో నేటి నుంచి మూడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక, నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్నాయని, ఈశాన్య రుతుపవనాల వర్షపాతం ప్రారంభమైనట్టు ఐఎండీ అమరావతి తెలిపింది.

ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతుందని, దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, పలుచోట్ల అతి తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశముందన్నారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి -55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి మంగళవారానికి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం బుధవారానికి తుఫాన్‌గా మారుతుందని, 17వ తేదీకల్లా మరింత బలపడి చెన్నైకు దక్షిణం వైపున తీరం దాటుతుందని, అనంతరం వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రంలో ప్రవేశిస్తుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

అరేబియా సముద్రంలో ప్రవేశించాక బలపడి తీవ్ర తుఫాన్‌గా మారే క్రమంలో ఈనెల 23న ఒమన్‌లో తీరం దాటుతుందని విశ్లేషించారు. మరో మోడల్ ప్రకారం అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుంది. అనంతరం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి 17న దక్షిణ కోస్తాలో తీరం దాటుతుంది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయవ్యంగా పయనించి ఈనెల 16కల్లా వాయుగుండంగా బలపడుతుందని ఇస్రో వాతావరణ నిపుణులు తెలిపారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడి 17 దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటుతుందని, ఆ సమయంలో గాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీస్తాయని పేర్కొన్నారు. దీనికితోడు దక్షిణ కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

విద్యా సంస్థలకు సెలవులు పొడగింపు : అల్పపీడనం కారణంగా నెల్లూరు జిలా ్లవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండో రోజు ఎడతెరిపి లేకుండా జిల్లావ్యాప్తంగా వానలు కురిశాయి. మరో రెండు రోజులు పాటు భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల దృష్ట్యా రెండో రోజు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వానల దృష్ట్యా 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు, వెంకటగిరిలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అధికారులు సిద్ధం చేశారు.
నీట మునిగిన పంటలు : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆనుకున్న ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం ఏర్పడి ఏపీవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, విశాఖ, కడప, అన్నమయ్య జిల్లాల్లో పంట పొలాలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో పలు రోడ్లు జలదిగ్బంధమయ్యాయి. వర్షాలు భారీగా కురుస్తున్న జిల్లాల్లోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించారు.

ముందస్తు చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష : ఏపీలో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, నీటిపారుదల, ఆర్ ఎండ్ బీ, విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేశాయన్నారు.
జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రుల నియామకం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దూకుడు పెంచుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు. శ్రీకాకుళం – కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం – వంగలపూడి అనిత, పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాలు – అచ్చెన్నాయుడు, విశాఖపట్నం – డోలా బాలవీరాంజనేయ స్వామి, అల్లూరి .జిల్లా – గుమ్మడి సంధ్యారాణి, అనకాపల్లి – కొల్లు రవీంద్ర, కాకినాడ – పి నారాయణ, తూర్పుగోదావరి – నిమ్మల రామానాయుడు, పశ్చిమగోదావరి

, పల్నాడు జిల్లాలు – గొట్టిపాటి రవికుమార్, ఏలూరు – నాదెండ్ల మనోహర్, కృష్ణా -జిల్లా వాసంశెట్టి సుభాష్, ఎన్టీఆర్ జిల్లా- సత్యకుమార్ యాదవ్, గుంటూరు జిల్లా – కందుల దుర్గేశ్, బాపట్ల – కొలుసు పార్థసారథి, ప్రకాశం – ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు జల్లా – మహ్మద్ ఫరూఖ్, కర్నూలు – నిమ్మల రామానాయుడు, నంద్యాల – పయ్యావుల కేశవ్, అనంతపురం – టీజీ భరత్, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలు -అనగాని సత్యప్రసాద్, కడప – ఎస్ సవిత, అన్నమయ్య – బి.సి. జనార్దన్ రెడ్డి, చిత్తూరు -జిల్లాకు రాంప్రసాద్ రెడ్డిని నియమించారు.

ఎగువన వర్షాలతో కృష్ణా నదికి మళ్లీ వరద : ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి మళ్లీ వరద వస్తోంది. నిన్నటి నుంచే వరద నీరు పెరుగుతుందని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజికి 45వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో అంతే మొత్తంలో నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు ఏఈ దినేశ్ తెలిపారు. వరద వస్తున్న నేపథ్యంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. మత్స్య కారులు ఎవరూ నదిలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇటీవల వరదలకు విజయవాడ పట్టణం అతలాకుతలం అవ్వడంతో మళ్లీ వరద, భారీ వర్షాల హెచ్చరికలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శ్రీశైలం బ్యారేజికి మంగళవారం ఉదయం 1,27,548 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా, 77,821 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News