మన తెలంగాణ/హైదరాబాద్ :వాయుగుండం వ ణుకు పుట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. తెలంగాణ, ఆంధ్రపప్రదేశ్‌లో ని పలు జిల్లాల్లో వర్షభీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. రెండు రాష్ట్రాల్లో జరిగిన వే ర్వేరు ఘటనల్లో పది మంది ప్రాణాలు కోల్పోయా రు. ఏపిలోని విజయవాడ నగరం మొగల్రాజపురంలో కొండచరియలు విరగిపడి ఐదుగురు మృతిచెందారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు వాగులో కారు కొట్టుకుపోయి మరో ముగ్గురు మృతి చెందారు. పాఠశాలకు సెలవు ఇవ్వటంతో ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నాచుపల్లిలో డిగ్రీ విద్యార్ధిని స్వాతి విద్యుత్‌ఘాతానికి గురై మృతి చెందింది. ములుగు జిల్లా తడ్వాయి మండలం
నార్లాపూర్ వద్ద పిడుగుపాటుకు మహేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. భారీ వర్షానికి వివిధ జిల్లాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు మార్గాల్లో వాగులు పోటెత్తడంతో రాకపోకలు స్తంబించి పోయాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, కాజీపేటలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. రహదారులపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా గార్ల మండల శివారులో గల పాకాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా గార్ల నుంచి రాంపురం, మద్దివంచతో పాటు పలు తండాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పర్వతగిరి మండలం పెద్ద తండాలో వరద నీరు ఇళ్లలోకి చేరి తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. వానల ధాటికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్దకొత్తపల్లి మండలం గండ్రావుపల్లిలో వర్షానికి ఓ పాత ఇల్లు కూలిపోయింది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లేపల్లి వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నారాయణపేట మండలం అభంగాపూర్ వద్ద వాగు పొంగింది. ధన్వాడ మండలం మందిపల్లి, పాతపల్లి, ఎమ్మనోనిపల్లి వద్ద వాగులు పొంగి ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దామరగిద్ద మండలంలో పలుచోట్ల వరి సహా ఇతర పంటలు నీట మునిగాయి.
మద్దూరు-బూనీడు మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వనపర్తి జిల్లా మదనపురం మండలంలో సరళాసాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. అడ్డాకుల మండలం వర్ని వద్ద పెద్దవాగు పొంగి పొర్లుతోంది. జడ్చర్ల మండలంలోని వందపడకల ఆసుపత్రిలోకి భారీగా వర్షం నీరు చేరి రోగులు నానా అవస్థలు పడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల, మండలాలను వరుణుడు వదల్లేదు. మధిర నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు నదులు పొంగిపొర్లుతున్నాయి. మధిర- విజయవాడ, మధిర – ఖమ్మం మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతకాని మండలం పాతర్లపాడు వద్ద వరద నీరు రోడ్డుపైకి చేరడంతో బోనకల్ ఖమ్మం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రుపాలెం మండలం నర్సింహాపురం గ్రామం సమీపంలో వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని మోకు సహాయంతో స్థానిక ప్రజలు కాపాడారు. మధిర మండలం మాటూరు విద్యానగర్ కాలనీలో ప్రధాన విద్యుత్తు లైన్ వైరు తెగి ఇల్లు మీద పడటంతో స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు శివారు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కొట్టుకుపోయిన వంతెన 40 గ్రామాలు తెగిన సంబంధాలు :
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి, బొమ్మలరామారంలో వర్షం దంచికొట్టింది. మిర్యాలగూడలోని విద్యుత్ కార్యాలయం ముందు భాగం నీటితో నిండిపోయింది. త్రిపురారం మండలం బాబుసాయిపేట వద్ద తాత్కాలిక మట్టి వంతెన కొట్టుకుపోయి 40 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. హుజుర్‌నగర్‌లో డ్రైనేజీలు పొంగి పొర్లి ఇళ్లలోకి మురుగు నీరు చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ముసురు ముసుగులో గ్రేటర్ హైదరాబాద్ :
గ్రేటర్ హైదరాబాద్ నగరంపై ముసురు ముసుగేసింది. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో ఉదయం వర్షం కురుస్తోంది. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపూల్‌లో తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నిలిచిన వాననీటితో వాహనదారులు, ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యాట్నీ ప్యారడైజ్, బేగంపేట ప్రాంతాలలో వర్షం కురిసింది. కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి వికారాబాద్‌లోని మద్గుల్‌లో చిట్టంపల్లివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శివసాగర్ ప్రాజెక్టు అలుగుపారుతుండగా సర్పంచ్‌పల్లి ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది.
ఖమ్మంలో అత్యధికంగా 192మి.మి వర్షం
రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లా యెర్రుపాళెంలో 192..4మి.మి వర్షం కురిసింది. నారాయణపేట జిల్లా మరికెల్‌లో 113.3,దామరగిద్దలో 102.4, భద్రాద్రి కొత్తగూడెం జల్లా చంద్రుగొండలో 93.7 మి.మి వర్షం కురిసింది. రాష్ట్రంలోని 167కేంద్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
అతి నుంచి అత్యంత భారీ వర్షాలు 23 జిల్లాలకు రెడ్ అలర్ట్ ..
తెలంగాణలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోని 23జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదిలాబాద్, కొమరంభీమ్ , నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ , హనుమకొండ, వరంగల్ , సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. వాతావరణ సూచనల నేపధ్యంలో అధికారులు ఈ జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు . గ్రేటర్ పరధిలో కూడా ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు.