Monday, December 23, 2024

ఆర్థిక ఊబిలో పాక్!

- Advertisement -
- Advertisement -

పుట్టి మునిగిపోతున్న దశలోని పాకిస్తాన్‌కు 3 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చి ఆదుకోడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంగీకరించడానికి కారణం దాని షరతులకు ఇస్లామాబాద్ దాసోహమనడమే. ఈ రుణ షరతుల్లో భాగంగా పాక్ తన ప్రజల మీద 627 మిలియన్ డాలర్ల మేరకు అదనపు పన్నులు విధించడానికి ఒప్పుకొన్నది. ఇందుకోసం బడ్జెట్‌లో మార్పులు చేయడానికి అంగీకరించింది. డాలర్‌తో పాకిస్తాన్ రూపాయి విలువ జోరుగా పతనమైపోతున్నది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ గత ఫిబ్రవరిలోనే ప్రకటించారు. గత ఏడాది పాక్‌ను కుదిపేసిన వరదలు అపార నష్టాన్ని కలిగించాయి. దేశంలో మూడో భాగాన్ని ముంపుకి గురి చేశాయి. 80 లక్షల మంది నిర్వాసితులయ్యారు. 20 లక్షలకు పైగా ఇళ్ళు ధ్వంసమయ్యాయి. 30 బిలియన్ల డాలర్ల మేరకు ఆర్థిక నష్టం సంభవించింది. కొవిడ్ తర్వాత విరుచుకుపడిన ఉక్రెయిన్ యుద్ధం, ఆ తర్వాత సంభవించిన వరదలు 24 కోట్ల జనాభా కలిగిన పాకిస్తాన్‌ను అతలాకుతలం చేశాయి.

పాలనలోని లోపాలు వీటికి తోడయ్యాయి. నిరుద్యోగం ప్రబలిపోడంతో 2022 సంవత్సరంలోనే 7 లక్షల 50 మంది దేశం విడిచి వెళ్ళిపోయారు. 2021 నాటి వలసలకు ఇది మూడు రెట్లు ఎక్కువ. పాకిస్తాన్ వద్ద ఇప్పుడున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం 2.9 బిలియన్ డాలర్లే. తొమ్మిదేళ్ళలో ఎన్నడూ లేనంత అత్యంత అథమ స్థాయి నిల్వలు. వాస్తవానికి పాక్ తన తక్షణ బాధల నుంచి విముక్తి కోసం ఐఎంఎఫ్ నుంచి 1.1 బిలియన్ డాలర్ల రుణం కోసమే జూన్‌లో ప్రయత్నించింది. అయితే అది విధించిన కఠినమైన షరతులన్నింటికీ అంగీకరించడంతో ఐఎంఎఫ్ మరింత ఉదారంగా 3 బిలియన్ డాలర్ల మేరకు సహాయాన్ని సమకూర్చడానికి ఒప్పుకొన్నది. 3 బిలియన్ డాలర్ల రుణాన్ని ఐఎంఎఫ్ తొమ్మిది మాసాల వ్యవధిలో అందచేయడానికి అంగీకరించింది. ఐఎంఎఫ్ నుంచి 6.5 బిలియన్ డాలర్ల రుణం తీసుకోడానికి 2019లో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒప్పందం కుదుర్చుకొన్నాడు. ఇది గత జూన్‌లో ముగింపుకి చేరుకొన్నది.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అంగీకరించిన షరతులను పాటించలేకపోయింది. ఇప్పటి వరకు ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ 23 సార్లు రుణాలను తీసుకొన్నది. ఐఎంఎఫ్ పాకిస్తాన్‌కు ఐసియు వంటిదని అమెరికాలో దాని మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ చేసిన వ్యాఖ్యానం గమనించదగినది. ఎవరైనా 23 సార్లు ఐసియులోకి వెళ్ళాల్సి వచ్చిందంటే ఆ వ్యక్తి ఆరోగ్యం దారుణంగా దెబ్బ తిన్నట్టుగా భావించాల్సి వుంటుందని ఆయన అన్నారు. అవినీతిపరులైన రాజకీయ నాయకులు, సాగు నీరు, ఇంధనం కొరతతో తీసుకొంటున్న వ్యవసాయ రంగం, అత్యధిక ధరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్న ఇంధనం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు గుది బండలుగా తయారయ్యాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రుణ తీర్మానం కింద పాకిస్తాన్ 25 బిలియన్ డాలర్లు చెల్లించవలసి వస్తున్నదంటే అది ఎంత భారం కింద కుంగిపోతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చైనా, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి పాకిస్తాన్ భారీగా రుణాలు చేసింది.

దేశంలోని సంపన్నులు మితిమించిన రాయితీలు పొందుతుండడం పాక్ ఆర్థిక సంక్షోభానికి మరొక కారణం. వారి ముక్కు పిండి వసూలు చేయడం పాలకులకు అలవికాని పనిగా వుంది. ఒక వైపు రాజకీయ అనిశ్చితి, ఇంకొక వైపు ఆహార అభద్రత పాక్‌ను ఎక్కడికి తీసుకు వెళతాయో ఊహించడం కష్టం. నాలుగు ప్యాకెట్ల గోధుమ పిండి ఖరీదు 3000 పాక్ రూపాయలకు చేరుకొన్నదంటే ప్రజలు ఎంత దుర్భరమైన బతుకులు బతుకుతున్నారో తెలుస్తున్నది. ఈ పిండి కోసం ఘర్షణలు చోటు చేసుకొంటున్నాయని వార్తలు చెబుతున్నాయి. గోధుమ, గోధుమ పిండి ట్రక్కులను ఎస్కార్టుతో ఒక చోటి నుంచి ఇంకొక చోటికి తరలించవలసి వస్తున్నదని సమాచారం. గత రంజాన్ సందర్భంగా కరాచీలో ఉచితాలు పంచుతున్న చోట తొక్కిసలాట జరిగి 12 మంది దుర్మరణం పాలయ్యారు. వరుసగా గత రెండు మాసాల్లో 38% ద్రవ్యోల్బణం రికార్డు కావడం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా నుంచి గాని, ఐఎంఎఫ్ నుంచి గాని మరింత రుణాన్ని సంపాదించడం తప్ప పాకిస్తాన్‌కు వేరే మార్గం కనిపించడం లేదు.

ఐఎంఎఫ్ ఎంత ప్రమాదకరమైన రుణ దాత అంటే అది అప్పు ఇచ్చే దేశాలు మరింతగా అడుక్కు తినవలసిన దుస్థితిలోకి జారుకుంటాయి. అందుచేత తమ ఆర్థిక వ్యవస్థకు కొత్త చూపు, కొత్త దారి అవసరమని పాకిస్తాన్ ప్రజలు కోరుకొంటున్నారు. దేశీయ ఉత్పత్తిని గణనీయంగా పెంచి ఎగుమతులను విశేషంగా సాధించలేకపోతే ఏ దేశ పరిస్థితి అయినా ఇందుకు భిన్నంగా వుండదు. ఇంతకు ముందు శ్రీలంకను ఐఎంఎఫ్ ఎన్ని అగచాట్ల పాలు చేసిందో తెలిసిందే. పాకిస్తాన్ తన దిక్కు మార్చుకోలేకపోతే అంతకంటే అధ్వానమైన పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News