Wednesday, January 22, 2025

అప్పుల కుప్ప

- Advertisement -
- Advertisement -

ఎదురు చూడని ప్రతికూల ఆర్థిక పరిణామాలు కలిగితే 2027-28 నాటికి భారత దేశ రుణం జిడిపిలో 100 శాతం, అంతకు మించి కావచ్చునని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటించిన అంచనాను మన ప్రభుత్వం తోసిపుచ్చడం ఊహించని పరిణామమేమీ కాదు. అయితే అప్పు ఇచ్చేవాడు నీ బాకీ పెరిగిపోతోందని హెచ్చరించాడంటే దాని లెక్క దానికి వుంటుంది. అంతర్జాతీయ ఆర్ధిక సంస్థ ప్రతినిధులు దాదాపు ఏటా ఈ సమయంలో వచ్చి దేశ ఆర్ధిక పరిస్థితిని అంచనా వేసి ఇచ్చే నివేదికలో ఈసారి ఈ హెచ్చరిక వుంది. గతంలో ఇటువంటిది లేదు ఇప్పుడే ఒక హెచ్చరిక మాదిరి ధ్వనితో ఇది వెలువడడాన్ని పట్టించుకోకుండా వుండలేము. కేంద్ర రుణ భారంపై ఇటీవల కొంత చర్చ కూడా జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్ప చేసిందనే విమర్శ పెద్ద ఎత్తున వినవస్తున్నది. ప్రస్తుతం దేశ రుణ భారం రూ. 155.6 లక్షల కోట్లు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014 మార్చి నాటికి దేశ అప్పు రూ. 53 లక్షల 11 వేల 81 కోట్లు. అంటే ఈ తొమ్మిదేళ్లలో మూడింతలు పెరిగింది. దేశ ప్రజలపై రుణభారం పెరుగుతోంది.

అదే సమయంలో కార్పొరేట్ కంపెనీల అప్పు భారాన్ని రూ. 5 లక్షల 50 వేల కోట్ల మేరకు రద్దు చేసిందనే విమర్శను ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ హెచ్చరిక వచ్చింది. అప్పు చేయడం వర్ధమాన ఆర్ధిక వ్యవస్థలకు తప్పదు. దేశానికి అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించుకోడానికి, పేదరికాన్ని త్వరగా నిర్మూలించడానికి ప్రాజెక్టులు, పథకాలకు నిధులు సమాకుర్చుకోవలిసిందే. అయితే రుణ సేకరణ, పరిమితులు మించినప్పుడు దానిని తీర్చగల స్థోమత రుణ గ్రహీతకు ఉన్నదా లేదా అని అప్పు ఇచ్చేవాడు ఆలోచిస్తాడు. ఈ ఆలోచనే ఇప్పుడు ఐఎంఎఫ్ చేసింది. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే అమెరికా రుణభారం దాని జిడిపిలో 160 శాతం, బ్రిటన్ అప్పు దాని జిడిపిలో 140 శాతం, చైనా ది 200 శాతం కానున్నట్టు కూడా ఐఎంఎఫ్ తన పరిశీలన పత్రంలో పేర్కొన్నది. దీనిని చూపించి మన పరిస్థితి వారి కంటే మెరుగేనని మోడీ ప్రభుత్వం తనను తాను సమర్థించుకొంటున్నది. అయితే రుణ సేకరణలో జోరును తగ్గించడం, పొదుపును ఆశ్రయించడం అవసరం. ప్రస్తుతం భారత దేశ అప్పు స్థూల దేశీయోత్పత్తిలో 81.9 శాతం, చైనా ది 83 శాతం.

రెండు దేశాల అప్పు అధికమేనని, ఇది తీవ్ర భారమేమీ కాకపోవచ్చునని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. అలాగని బేపర్వాగా ఉండ తగదు. అప్పు తీర్మానం (వడ్డీ చెల్లింపులు) కింద జిడిపిలో 5.4 శాతం మేరకు ఇండియా చెల్లిస్తున్నది. ఊహించని దెబ్బలను ఎదుర్కొన్నప్పుడు ఉత్పత్తి కార్యక్రమాలు స్తంభించిపోతాయి. ఇంతకు ముందు కోవిడ్, ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం సరఫరాలకు ఆటంకం కలిగించి ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలను కుంగదీశాయి. ఆయిల్ దిగుమతి ఖర్చు మన ఆర్ధిక వ్యవస్థకు గుదిబండ వంటిది. అందువల్ల మన దిగుమతుల వ్యయం ఎప్పుడూ అధికంగానే వుంటుంది. అదే సమయంలో ఎగుమతులలో ఆశించిన అభివృద్ధి కనిపించడం లేదు. చైనా చవకగా నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్లలో విశేష లబ్ధి పొందగలుగుతున్నది. అక్కడ శ్రమ వ్యయం తక్కువ, లేబర్ చవకగా దొరుకుతారు. అది ప్రపంచ ఫ్యాక్టరీగా సమస్త వస్తు సరఫరాదారుగా ప్రసిద్ధికెక్కింది. పని చేసేవారు తక్కువ జీతాలకే దొరకడం, శాంతి భద్రతలు దానికి అత్యంత అదనుగా వున్నాయి. అందువల్లనే బహుళ జాతి సంస్థలు అక్కడ తమ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయి.

అక్కడి మాదిరిగానే భారత దేశంలో సైతం తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకోడానికి పాలకులు ప్రయత్నిస్తున్నారు, ధరలు తగ్గించి జీవన వ్యయాన్ని అదుపులో వుంచినప్పుడే అది సాధ్యమవుతుంది. చైనా పని వారు మనవారి కంటే ఎక్కువ ఉత్పాదకతను కలిగి వుంటారు. అలాగే చదువు సంధ్యలుండి వైద్య ఆరోగ్య సౌకర్యాలు మెండుగా పొందుతారు. మన మాదిరిగానే అత్యధిక జనాభా కలిగి ఆర్ధికంగా అమెరికాకు దీటైన శక్తిగా చైనా అభివృద్ధి చెందడంలో ఇండియా తెలుసుకొని పాటించవలసిన పద్ధతులు అనేకం వున్నాయి. రుణ తీర్మాన భారాన్ని సునాయాసం చేసుకోవాలంటే మన ఆర్ధిక విధానాల్లో సమూలమైన మార్పులను తీసుకొని రావాలి. మన సరకులకు అంతర్జాతీయ మార్కెట్లలో గిరాకీని పెంచుకోగలిగితే కొండంత రుణ భారాన్ని సైతం మోయగలుగుతాము. ప్రధాని మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా తన ఆర్థిక విధానాలను పునస్సమీక్షించుకోవాలి. కార్పొరేట్ శక్తులను మేపడం ద్వారా వారికి పేద రైతులను, నిరుద్యోగులను, ప్రభుత్వ రంగ పరిశ్రమలను బలి పెట్టడం ద్వారా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళగలననే భ్రమలను వదిలించుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News