Monday, December 23, 2024

సత్వర న్యాయం అందేనా?

- Advertisement -
- Advertisement -

‘భారతీయుల కొరకు, భారతీయుల చేత, భారత పార్లమెంటు ద్వారా రూపొందిన కొత్త చట్టాలివి. వీటితో వలస కాలం నాటి చట్టాలకు తెరపడింది’ అంటూ సోమవారంనుంచీ అమలులోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాల గురించి హోం మంత్రి భాష్యం చెప్పడం బాగానే ఉంది. దాదాపు 164 ఏళ్లుగా అమలులో ఉన్న కాలం చెల్లిన చట్టాల స్థానంలో ఆధునిక భారతదేశం అవసరాలను తీర్చే విధంగా కొత్త చట్టాలను అమలులోకి తీసుకురావడం సాహసోపేతమైన చర్యేనని చెప్పవచ్చు. నూతన శతాబ్ది అవసరాలను అనుగుణంగా భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధీనియమ్ తాజాగా అమలులోకి వచ్చాయి. ఇప్పటి వరకూ దండ సంహితగా ఉన్న పాత చట్టాల స్థానే న్యాయ సంహితగా కొత్త చట్టాలను రూపొందించామన్న కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను కట్టుదిట్టంగా రూపొందించింది కూడా.

ఐపిసిలో ఉన్న 511 సెక్షన్లను భారతీయ న్యాయ సంహితలో 366కు కుదించింది. నేర విచారణలో ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు అనుమతినివ్వడం, ఆన్‌లైన్ లోనే ఫిర్యాదు చేసే అవకాశమివ్వడం, జీరో ఎఫ్‌ఐఆర్‌కు వెసులుబాటు కల్పించడం, ఏడేళ్లు, అంతకు మించి శిక్ష పడే కేసుల్లో ఫోరెన్సిక్ నిపుణులతో సాక్ష్యాధారాల సేకరణ తప్పనిసరి చేయడం, మైనర్లపై సామూహిక మానభంగాల కేసుల్లో నిందితులకు మరణ శిక్ష లేదా యావజ్జీవ శిక్ష విధించేలా చట్టాన్ని పటుతరం చేయడం, హిట్ అండ్ రన్ కేసుల్లో శిక్షను ఐదేళ్లకు పెంచడం వంటివి హర్షించదగినవే. అయితే కొత్త చట్టాలను రూపొందించే క్రమంలో ప్రభుత్వం కొన్ని వివాదాలను కూడా మూటగట్టుకుంది. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లులపై చర్చ జరుగుతున్నప్పుడు 146 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం వల్ల కొత్త నేర న్యాయ చట్టాలపై సమగ్రమైన చర్చ జరగలేదన్న అభిప్రాయం ఉంది.

న్యాయమూర్తులు, న్యాయవాదులు, దర్యాప్తు సంస్థల అభిప్రాయాలను సేకరించకపోవడం, విస్తృత ప్రజాభిప్రాయ సేకరణకు తావులేకపోవడం కొత్త చట్టాల అమలులో ప్రభుత్వ వేగిరపాటుకు అద్దం పట్టింది. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ చట్టాలకు తగిన మార్పులు చేర్పులు సూచించగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటివి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్న సంగతిని గుర్తుంచుకోవాలి. నిందితుల చేతులకు బేడీలు వేయడం, తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న నిబంధనను తొలగించడం, పోలీసు కస్టడీ సమయాన్ని 15 నుంచి 60 -90 రోజుల వరకూ పెంచడం వంటి మార్పుల వల్ల పౌర హక్కులకు భంగం వాటిల్లుతుందన్న విమర్శలలో నిజం లేకపోలేదు. ఇప్పటికే స్టేషన్ బెయిల్ మంజూరులో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న పోలీసులకు కస్టడీలో నిబంధనల సడలింపు కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా ఉంటుందనడంలో అర్థం లేకపోలేదు.

దీని వల్ల పౌర హక్కులు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. కొత్త చట్టాల అమలును సవాలు చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వం చట్ట సభలలో సమగ్రమైన చర్చకు ఆస్కారం కల్పించి, అవసరమైతే సవరణలు చేపట్టడం ఆవశ్యకం. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపే చట్టాల విషయంలో ప్రభుత్వం పంతాలు, పట్టుదలలకు పోకుండా హుందాగా వ్యవహరించాలి. కొత్త చట్టాలకు రూపకల్పన చేసినంతమాత్రాన సామాన్యుడికి సత్వర న్యాయం అందే పరిస్థితి లేదన్న విషయాన్ని పాలకులు గుర్తిస్తే మంచిది. తాజా చట్టాల్లో సత్వర న్యాయానికి పెద్దపీట వేసే విధంగా కొన్ని సెక్షన్లలో మార్పులు చేర్పులు చేయకపోలేదు.

క్రిమినల్ కేసులలో విచారణ ప్రారంభమైన 60 రోజుల్లో అభియోగాలు నమోదు చేయాలని, విచారణ పూర్తయిన 45 రోజులలోపు తీర్పు ప్రకటించాలని, గరిష్ఠంగా కేసును రెండు సార్లు మాత్రమే వాయిదా వేయాలని కొత్త చట్టాలు నిర్దేశించడం సత్వర న్యాయానికి ఊపిరులూదేవే అయినా త్వరితగతిన కేసుల పరిష్కారానికి ఈ మాత్రం చర్యలు ఏమాత్రం చాలవు. న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న కేసులు సత్వరమే పరిష్కారం కావాలంటే న్యాయమూర్తులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి. యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయాలను కల్పించాలి. ప్రధాన నగరాల్లో హైకోర్టు, సుప్రీం కోర్టు బెంచీలను ఏర్పాటు చేయాలి. వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిందితులను విచారణ జరిపే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నా, అనేక కోర్టులు ఇంకా డిజిటలైజ్ కాలేదన్న సంగతిని గుర్తుంచుకోవాలి. సరికొత్త చట్టాలను రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వం చూపిన చొరవ న్యాయవ్యవస్థను బలోపేతం చేయడంలోనూ చూపాలి. అప్పుడే కొత్త చట్టాలకు సార్ధకత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News