Monday, January 20, 2025

ఆర్ద్రతకు అక్షరూపం..

- Advertisement -
- Advertisement -

కరోనా ఎంత చెడ్డ రోగమైనా మనుషుల్లో కొంత మానవీయతను పెంచింది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే గుణాన్ని నేర్పింది. శత్రువులని సైతం క్షమించే హృదయ వైశాల్యతను ఇచ్చింది. ప్రేమను పంచితే పెరుగుతుందని రుజువు చేసింది. సమాజ సంబంధాల్లోని ఉద్రిక్తతలను, మత ఉన్మాదాన్ని, మానవుల్లోని ఆగ్రహాన్ని, అసంతృప్తి, అసూయ, మౌఢ్యం, జాడ్యలను అన్నింటిని కరోనా ఫిల్టర్ చేసి హృదయమున్న మనుషులుగా తీర్చి దిద్దింది. ఆలోచనల్లో నిలకడను నేర్పింది. నిర్ణయాల్లో క్షణికావేశాలకు తావులేకుండా చేసింది. ఆచి తూచి మాట్లాడే సంస్కారాన్ని నేర్పింది. సారాంశంలో మనం మనుషులం అని గుర్తు చేసింది. వీటన్నింటిని గుండెతడితో అక్షరాలుగా మలిచిన కవి బాణాల శ్రీనివాసరావు. కవితా సంపుటి ‘రాత్రి సింఫని’.
ద్వీప కల్పాల్లో నివాసముంటూ అందులోకి, తన, మన అనుకునే వారెవ్వరికీ ప్రవేశం లేకుండా చూసుకుంటున్న కొందరి అర్బన్ మనుషుల ‘గేటెడ్’ ఒంటరి తనాన్ని సమూహం తరపున ధిక్కరించిన కవి బాణాల శ్రీనివాసరావు. కరోనాకు ముందు ఇట్లాంటి జీవితం కొంత ఆమోదనీయంగానే ఉండేది. ‘మూడడుగుల దూరం’ అంటూ పాటించిన కరోనా కాలం నాటి దూరాలు ఇప్పుడు చేరువవుతున్నాయి.

ఈ సమయంలో మనుషుల్లో ముఖ్యంగా సజనకారుల్లో మానవీయతను పెంచిన క్రెడిట్ కరోనాకే దక్కుతుంది. చావు భయం ఎట్లాగూ వెన్నాడుతోంది, అయితే దానికన్నా ఎక్కువగా ఇంట్రాస్పెక్షన్ పెరిగింది. అందుకే సమాజానికి బకాయిపడ్డ ఆర్ద్రత, సహానుభూతి అనే అప్పును వడ్డీతో సహా చెల్లించేలా చేస్తున్నది. ఆ చెల్లింపులో కొంత భాగమే ఈ రాత్రి సింఫని కవితా సంపుటి. ‘ఆచూకీ’కవిగా షురువై, బహుజన అస్తిత్వ బావుటాను రెండున్నర దశాబ్దాల కిందటే భుజానికెత్తుకొని ఊరేగుతున్న కవి బాణాల శ్రీనివాసరావు ఇప్పుడు ఆ దారి నుంచి కొంచెం పక్కకు జరిగి హద్యంగానూ, హదయమున్న మనిషిగానూ స్పందించాడు. ‘ప్యూర్ కవిత్వ’మై నిలబడ్డాడు.
తెలంగాణ భూమి పుత్రులను, ఇక్కడి మట్టి పరిమళాన్ని, మానవ సంబంధాలను, మరింత మానవీయంగా మారిన ఆచరణఆలోచనలను బాణాల శ్రీనివాసరావు ఈ కవితా సంపుటిలో ఆర్ద్రంగా చిత్రిక గట్టిండు. మానవత్వం మీద బాణాలకు ఎనలేని ప్రేమ. ఆ ప్రేమను రాత్రి సింఫని కవిత్వంలో సంపుటిలో రికార్డ్ చేసిండు. మతోన్మాదాన్ని దునుమాడుతూ మానవీయంగా స్పందించిండు. గాయపడ్డ హదయాలకు కవితా లేపనం పూసిండు. అట్లాగే మనుషులు కరోనా తర్వాత మరింత మానవీయులుగా మారిన సందర్భాన్ని కవి గుండె లోతుల్లోంచి చెప్పిండు. చెప్పిండు అనేకంటే గుండెలోతుల్లో కొట్టుమిట్టాడిన వేదనను అక్షరాల్లోకి తర్జుమా చేసిండు. ఇట్లాంటి కవిత్వాన్ని మనుషుల పట్ల ప్రేమ, వారి తప్పుల్ని క్షమించే హదయ వైశాల్యత ఉన్న వాళ్ళు మాత్రమే సృజించగలరు. ‘రాత్రి సింఫని’ ద్వారా బాణా ల దాన్ని ప్రదర్శించుకున్నాడు.

ఈ కవితా సంపుటిలో కొన్ని కవితలు కరోనా కాలంలో బతుకులు ఎట్లా చిన్నాభిన్నం అయ్యాయో, ఆ రోగం వలస కార్మికులపై ఎట్లా కత్తి కట్టిందో, దాని మూలాలు, పర్యవసానాలు ఎట్లా మెలిపెట్టాయో హదయాల్ని కదిలించేలా కైగట్టిండు.
లెక్చరర్ గా పనిచేస్తూ రోజు పిల్లల కోడిలా తిరిగే శ్రీనివాసరావు కరోనా సమయంలో విద్యార్థులు కళాశాలకు రాకపోతే ఆన్లైన్ క్లాసులు తీసుకున్న సమయంలో ఒకవైపు ‘నెట్టు’ మరోవైపు విద్యార్థులు కనెక్ట్ కాక చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. అయితే బాణాల ఆ పిల్లలు కరోనా తర్వాత కళాశాలకు వచ్చిన సంబరాన్ని కవితగా మలిచిండు. సంబర పడ్డడు. పిల్లల పట్ల వారి చదువు పట్ల, భవిత పట్ల ఎంత మమేకమై ఉద్యోగం చేస్తున్నాడో ఈ కవితలో ప్రస్ఫుటమైతున్నది. ప్రకతి మీద ప్రేమ సీతాకోకచిలుకలపై ఆర్తిని కైగట్టిండు. / ‘కొమ్మనుండి రాలిపడే/ పూలకయ్యే గాయాలు/ నిన్ను బాధించలేనప్పుడు” నీకు భుజకీర్తులెందుకు అని నిలదీస్తాడు. అంటే సున్నితత్వానికి నిదర్శనంగా కవితా పాదాలకు లేపనాలు పూసి చేయి పట్టుకుని మన మధ్యకు తీసుకొచ్చి నిలబెట్టడమే! చదివిన పాఠకుల్ని సైతం మానవీయమైన మనుషులుగా మారేలా అక్షరాలద్దడమే!!
తెలంగాణఉద్యమంలో ఆత్మహత్యలు, సాకారమైన స్వరాష్ర్టంలో పాలన,

బహుజన జీవితాలు, అమ్మా, నాయిన జ్ఞాపకాలు, సబాల్టర్న్ చైతన్యం, ప్రకృతిపై ప్రేమ, నోస్టాల్జిక్ జ్ఞాపకాలు, జూలూరు గౌరిశంకర్‌తో దోస్తానా, ‘శుద్ధ కవిత్వం’ అన్నీ ఈ కవితా సంపుటిలో సంగీతమై వినిపిస్తున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి రాస్తున్న కవితలు మొదలు కరోనా కష్టా ల వరకు సుదీర్ఘంగా కొనసాగుతున్న ప్రయాణాన్ని బాధ తో, బాధ్యతతో రికార్డు చేసిండు. జరుగుతున్న సంఘట నలకు బాధపడుతూనే, చారిత్రక వాస్తవాలను బాధ్యతతో రికార్డు చేసిండు. కవిత్వాన్ని తనదైన బాణిలో నిర్వచించిండు. ‘గ్లోబల్’ నేరస్థులెవరో ఎరుక పరిచిండు. లోకల్ నుంచి గ్లోబల్ వరకు హృదయమున్న మనుషుల బాధను, ఆకాంక్షను, ఆందోళనను అక్షరబద్ధం చేసిండు.
తెలంగాణప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం విజయం సాధించిన తర్వాత ఆ స్ఫూర్తితో బహుజన చైతన్యం శాఖోపశాఖలుగా విస్తరించాల్సింది. కానీ అట్లాంటి బహుజన సాహిత్యం చాలా తక్కువగా వెలువడింది. ధిక్కార స్వరం గట్టిగా వినిపించాల్సిన సమయంలోనూ సంయమనం పేరిట చాలా మంది కవులు మౌనం పాటించారు. రెండు దశాబ్దాల కిందట ‘కుంపటి’ వెలిగించి బహుజన నిప్పుని రగిల్చిన తొలితరం బీసీ అస్తిత్వవాద కవుల్లో ఒకరైన బాణాల అందుకు పాక్షిక మినహాయింపు. ‘రహదారుల్లోకి’ శీర్షికన రాసిన కవితలో ‘రహదారుల్లో కాళ్ళు మొలిపిద్దాం’ అని పోరుబాటలో నడవాలని పిలుపు నిచ్చాడు.

/ “కలాలకు / చీకటి గుహల ఆహ్వానాలు/ లాఠీ కర్రల నాట్య విన్యాసాలు’/ “నాకెందుకీ గొడవని/ నాలుకను జోకొడుతూవుంటే!/ గుండెలోపలి గొంతు చేసే/ తారాస్థాయిలో స్వరాలాపాన” అంటూ ఉద్యమాల బాటలో అవరోధాలను రాసిండు./ ఈ కవితా సంపుటిలో తన పాత జ్ఞాపకాలను తిరగదోడుకుంటూ దిశా నిర్దేశం చేసిండు. అందుకే ‘వ్యూహగామి’లో బీసీ సోయిని ఇట్లా రికార్డు చేసిండు.
“చుట్టూ నిశ్శబ్దం/ చిన్నప్పటి చెప్పుల్లేని/ నెత్తురోడుతున్న పాదాలు/ సలుపుతున్న జ్ఞాపకాలు/ గుండె శబ్దాలతో రెట్టింపై/ మనసుపొరల్లో సుడితిరుగుతుంటే/ నిన్ను ఉవ్వే ఓదార్చుకొంటూ/ మాసిపోని మచ్చని మాన్పుకోవాలి” అంటూ జ్ఞాపకాలను చేదుకున్నాడు. /“అవమానాల పలుగురాళ్ళపై/ ఆయుధాల్ని సానబెట్టుకొని/ అదృశ్య ఆగంతకునిపై గురిపెట్టాలి” అన్నాడు./ “చుట్టూ మోగుతున్న వృత్తి పనిముట్ల శబ్ధాల్లో/ అప్పటి మా ఆకలి మంటల/ శ్రమసౌందర్యపు ధ్వనులు వినిపిస్తయి” అని శ్రమైక జీవన సౌందర్యాన్ని, దుర్భర పేదరికాన్ని రికార్డు చేసిండు. నిజానికి వృత్తులు సర్వనాశనం అయితేగానీ బహుజనుల బతుకుల్లో మార్పులు రావు. అంబేడ్కర్ పట్టణాలకు తరలండి అని అందుకే పిలుపునిచ్చిండు. వృత్తి ఆధారంగా కులం నిర్ణయమై, తద్వారా వివక్షను ఎదుర్కొంటున్నారు. ఈ వివక్షను నిరసిస్తూనే వృత్తి కులాల వాండ్ల శ్రమను, కళను కైగట్టిండు బాణాల. స్వర్ణకార, వడ్రంగి, కుమ్మరి, చేనేత, చాకలి, మంగలి, యాదవ సోదరుల వృత్తి జీవితాలను గుండెలో తడితో చిత్రించిండు.

“మా చేతుల పెద్ద బాడిశతో/ ఆరుగాలం అరకల్ని చెక్కి చెక్కి/ ఆకలిగొన్న దేశానికి/ అన్నం పెట్టినా/ అర్ధాకలితో అలమటించే/ చెదలు తిన్న చెక్కపేళ్ళం” అని ‘బహుజనం’ కవితలో ‘కుల’వృత్తిలో కునారిల్లుతున్న జీవితాలను రికార్డు చేసిండు. అంతేకాదు ఆ జీవితాల్లో మార్పుకు మార్గ నిర్దేశనం ఇట్లా చేసిండు./ “ఇకనైనా…/ మా గాయాల గేయాలకు/ కొత్తరాగాలల్లుకుంటాం/ మా వేదనల నాదాలను/ పదునైనగొంతుల్లో / సవరించుకుంటాం/ పగిలిన మా గుండెల్ని/ ధైర్యంగా మేమే/ అతికించుకుంటాం” అని నినదించిండు.
కవులు సున్నిత హృదయులు. చిన్న బాధకు పెద్దగా తల్లడిల్లుతారు. సామూహిక బాధను వైయుక్తికంగా అనుభవిస్తారు. ఆ బాధ సమాజానికి సంబంధించినదైతే మరింతగా కదిలిపోతారు. కవిత్వమైతారు. అందుకే బాణాల కూడా ‘కరోనా’ పూర్వపరాలు, పర్యవసానాలు, గాయపడ్డ బతుకులను, వలస వెతలను కైగట్టిండు. ఇంకా చెప్పాలంటే ఈ సంపుటిలో ఎక్కువ కవితలు ‘కరోనా’మీద రాసినవే! ‘భయం ఊబిలో’, ‘అరచేతిలో గ్లోబు’, ‘కనుమరుగైన చిరునామాలు’, ‘మార్చింగ్ టు బీజింగ్’, ‘ఐసొలేషన్’, ‘చివరి ఎలిజీ’, ‘వలస జీవులు’, ‘భవిష్యత్ దారుల్లో’, ‘దు:ఖనది’ కవితల్లో కరోనా కాలపు విలయాన్ని, మానవ సంబంధాలను, బతుకు వెతలను చిత్రించిండు. ‘వలస జీవులు’ ఎన్ని ఎతలకోర్చిండ్రో ఇట్లా చెప్పిండు.

“నెత్తిన మాసిన బతుకు మూటల్తో/ ఒంటి నిండా చెమట శరాల వర్షంతో/ మబ్బులనే గొడుగులు చేసుకొని/ ఎండవేడి కత్తుల గాయాలతో/ మైళ్ళకు మైళ్ళను/ తమ కాళ్లనే నమ్ముకొని/ కదులుతున్న కష్టజీవులు” అంటూ బతకడానికి దూర ప్రాంతాలకు వెళ్ళినవారు రవాణా సదుపాయాలన్నీ రద్దు కావడంతో కాలి నడకన వేల కిలోమీటర్లు పాదాలు రక్తాలు కారుతుంటే నడిచిన తీరుని బాణాల కండ్లల్లో నీళ్లు తెప్పించేలా చెప్పిండు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవాడు కావడంతో ఆత్మహత్యలను ధిక్కరించిండు. ఇందుకు రాజకీయ నాయకులదే బాధ్యత అని హెచ్చరించిండు.
“ఊడిపోయే పదవులకు వేళ్ళాడుతున్న/ ఓ రాజకీయులారా!/ త్యాగవీరుల రక్తంతో దాహం తీర్చుకునే/ చరిత్ర హీనులు/ తెలంగాణ ద్రోహులు మీరే” అంటూ రాజకీయ నాయకులను యువత ఆత్మహత్యలకు దోషిగా నిలబెట్టిండు. ఎనుకటి మాదిరిగా తెలంగాణను ఏమార్చలేరని చెప్పిండు. ఉద్యమ తెలంగాణ చైతన్యాన్ని ఇట్లా ఆవిష్కరించిండు./ “నాటి తెలంగాణ/ దగాపడ్డ నెత్తుటి నేలే/ కానీ…/ నేటి తెలంగాణా/ కొత్త వ్యూహాల పురిటిగడ్డ!/ పోరాటంలో వెన్ను చూపని/ వీరుల్ని కన్న మట్టిబిడ్డ!!” అంటూ గుండె ధైర్యాన్ని చాటి చెప్పిండు. 60 ఏండ్ల నిరంతర పోరాట ఫలితంగా సాకారమైన తెలంగాణ స్వపాన్ని ఇట్లా అనువదించిండు.

“ఎందరో అమరవీరుల / ఆత్మాహుతి మంటల్లోంచి/ మరెందరో ఉద్యమకారుల/ త్యాగాల రక్తపుధారల్లోంచి/ ఫీనిక్స్ పక్షిలా/ పురుడు పోసుకున్న/ సద్దుల బతుకమ్మ” అని తెలంగాణ ఆవిర్భావాన్ని రికార్డు చేసిండు. / కరోనా కాలపు ఒంటరి తనం కవులు గతాన్ని నెమరువేసుకునేలా చేసిందని చెప్పవచ్చు. నడిచొచ్చినదారిని మళ్ళొక్కసారి యాద్జేసుకునేలా చేసింది. దీంట్లో బాల్యమే గాకుండా తల్లిదండ్రుల త్యాగాలు కచ్చితంగా రికార్డవుతున్నాయి. కరోనానంతర కాలంలో రాసిన చాలామంది కవుల సంపుటాల్లో వీటిమీద కవితలున్నాయి. అట్లానే బాణాల శ్రీనివాసరావు కవిత్వంలోనూ అవి చోటు చేసుకున్నాయి. ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా ఏదో ఒక జ్ఞాపకం సుడితిరిగి ఇబ్బంది పెడుతున్నదని ఇట్లా చెప్పిండు.
“ఎంత ప్రశాంతంగా ఉందామన్న/ ఏదో ఆలోచన/ కళ్ళల్లో గుచ్చుకొని/ కన్నీటి ప్రవాహం” అంటూ తన వేదనాభరిత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ‘అమ్మొక సముద్రం’ అంటూ తల్లిని తలుచుకున్నాడు. / “కనురెప్పల్ని మూసినా తెరిసినా/ కనుపాపల్లో కదలాడుతున్న అమ్మరూపం/

ఇప్పటికి ఆసుపత్రి బెడ్ పైనుంచి/ శీనయ్యా అని పిలుస్తున్నట్లే నా చెవుల్లో/ చిన్నప్పుడు ఇంటిపనుల్లో వంట పనుల్లో/ నేచేయందించిన జ్ఞాపకాలు/ కళ్ళల్లో సుడితిరిగే మాసిపోని చిత్రాలు” అంటా తీపిచేదు అనుభూతులను యాద్జేసుకున్నాడు. అట్లాగే కరోనా కాలంలో దు:ఖనది పారినట్లుగా అందరి జీవితంలో వేదనలున్నాయి. ఒకరినొకరు కలిసి ముచ్చటబెట్టుకోలేని స్థితి. చుట్టాలు ఇంటికొచ్చే స్థితి లేదు. మారుతున్న కాలమాన పరిస్థితులను కైగట్టిండు. ఎనుకట జీవితం ఎట్లా ఉండేదో నాయినను యాద్జేసుకొని చెప్పిండు. చుట్టపక్కాలతో సందడిగా ఉండే జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకున్నాడు.
“మా నాయన మాత్రం తక్కువనా!/ చుట్టాల్ని చూడంగనే/ చేస్తున్న పుస్తెమెట్టెలైనా!/ ఎంతపెద్ద నగనైన సగంలో ఆపేసి/ కుంపట్లో మండుతున్న సూర్యుళ్లను/ బొగ్గుల మబ్బులతో కప్పేసి/ పనిముట్లకు జోలపాడి/ దుకాణంలోంచి జింకపిల్లోలనే సప్పునలేసి/ చుట్టపోళ్ళతో మంచి చెడ్డ మాట్లాడుకుని/ బజారికి పోయి యాటమాంసమో/ కోడికూరో ఎగురుకుంటూ తెచ్చేటోడు” అంటూ కరోనా కాలంలో నాయినను ఆర్ద్రంగా యాది చేసుకున్నాడు./ మిత్రుడు జూలూరు గౌరిశంకర్ తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమితులైనప్పుడు ఆయన మీద ప్రేమతో రాసిన కవిత ‘కవిత్వ కాలభైరవుడు’ పేరిట అచ్చయ్యింది. జూలూరు ప్రత్యేకతలను, విశిష్టతను ఇందులో బాణాల లెక్కలేసి చెప్పిండు.

“నడిగూడెం శనగనేల ఎర్రసెలకలమీంచి/ తంగేడు పూల గుడుగు నీడల్లోంచి/ ‘ముండ్లకర్ర’ను త్రిశూలంగా తిప్పుతూ/ డమరుకంతో దిగంతాలను మోగిస్తూ/ నలుదిక్కుల్ని ఆలింగనం చేసుకొని/ తన ‘పాదముద్ర’లను తానే చెరిపేసుకొంటూ/ విశ్వనగరంలో ‘నాలుగోకన్ను’ తెరిచిన కవిత్వ కాలభైరవుడు” అంటూ ఆయన పుట్టుక, రచనల గురించి కవిత్వీకరించాడు. / కవిత్వమంటే ఉన్న ప్రేమతో ఎన్నో పంక్తులను అక్షరమాలలుగా కూర్చి అర్పించిండు. ఈ అక్షరాల్లో కాఠిన్యం లేదు. మాలిన్యం లేదు. కేవలం ఆర్ద్రత, ఆప్యాయత కనుమరుగైతున్న మానవీయత ఉన్నది. చిన్నపిల్లలు అర్ధరాత్రి గుక్కపెట్టి ఏడిసినట్లు నడి రాత్రి నిద్దుర లోంచి మేల్కొని జ్ఞాపకాల వలతపోతను కండ్లల్లో చిప్పిల్లే నీళ్లను అదిమిపట్టి అక్షరాలుగా మలిచిండు. మనుషులు, మానవ సంబంధాలు, ప్రకృతి మీద ఆపారమైన ప్రేమ ఉంటే గానీ ఇది సాధ్యం కాదు. తానే చెప్పుకున్నట్లు “నిరంతరం ఆకాశాన్ని/ భూమిని కలిపి కుడుతూ/ గాలి తెరచాప” లాగా బంధాలను, బాంధవ్యాలను, సామాజిక అనుబంధాలను దు:ఖాన్ని అదిమిపెట్టుకొని అక్షరాలుగా మలిచిన కవితలే ‘రాత్రి సింఫని’ ఈ శ్రావ్యమైన స్వరవర్ణ సమ్మేళనం. సప్త రాగ సంగీతానికి, గీత ‘సింగిడి’ల ఈ సమ్మేళనానికి స్వాగతం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News