Friday, November 22, 2024

హర్ష సూచన!

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతం తథ్యమని భారత వాతావరణ విభాగం (ఐఎండి) తాజాగా తెలియజేసిన సమాచారం అమిత ఆనంద దాయకమైనది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం, కరువు పొంచి వున్నాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ భయపెట్టిన తర్వాత కొద్ది వ్యవధిలోనే ఐఎండి వెల్లడించిన సమాచారం ఎంతో ఊరట కలిగించింది. వ్యవసాయంలో ఆర్థిక మూలాలున్న భారత దేశంలో వర్షపాతానికి విశేషమైన ప్రాధాన్యమున్నది. అత్యధిక జనాభా (70%) ఇంకా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. వారి ప్రధాన జీవనోపాధులు వ్యవసాయం, పాడి పరిశ్రమ, కుల వృత్తులే. ఇవి మూడు ఒకదానిపై ఒకటి ఆధారపడి వుంటాయి. వర్షాలు బాగా పడితే గాని పంటలు పండవు. అవి విశేషంగా పండితే గాని గ్రామీణ ప్రజలు సుఖంగా జీవించజాలరు. వర్షాలు ముఖం చాటేస్తే వలసలు పెరిగి బతుకులు దుర్భరమవుతాయి.

పట్టణాలు, నగరాల మీద భారం పెరుగుతుంది. ఈ ఏడాది వర్షపాతం ప్రభావం వచ్చే ఏడాదిలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల మీద కూడా వుంటుంది. ప్రజలు సుఖంగా వుంటే ఓటింగ్ శాతం కూడా బాగుంటుంది. అందుచేత ఐఎండి సాధారణ వర్షపాత జోస్యం ఎంతో ఊరట కలిగించింది. 2023 తొలకరిలో సాధారణం కంటే తక్కువ వర్షపాతానికి 40%, సాధారణానికి 25%, వర్షాభావానికి, కరవుకు 20% అవకాశాలున్నాయని స్కైమెట్ జోస్యం చెప్పింది. కాని వచ్చే జూన్ 1 నాటికి కేరళను తాకగల వాయువ్య రుతుపవనాల వల్ల అప్పటి నుంచి సెప్టెంబర్ వరకు సాగే తొలకరిలో సాధారణ వర్షపాతం తథ్యమని ఐఎండి పేర్కొన్నది. అంటే 96% వర్షపాతం వుంటుందని జోస్యం చెప్పింది. ఇది 5% అటు ఇటుగా వుండొచ్చని వివరించింది. తక్కువ తక్కువగా 83.5 సెం.మీ వర్షపాతం తథ్యమని తెలియజేసింది.

గత నాలుగేళ్ళుగా తొలకరి వానలు సంతృప్తికరంగానే వుంటున్నాయి. అత్యధికంగా నీటిని పీల్చివేసే వరి వంటి పంటలు విస్తారంగా పండుతూ వుండడానికి ఇదే కారణం. సాధారణ వర్షపాతం వల్ల సాధారణ ప్రజానీకం పొట్ట పోషించుకోడానికి ఎటువంటి కొరత వుండదు. తయారీ రంగం దారుణంగా దెబ్బతినిపోయింది. ప్రధాని మోడీ ఆర్భాట అట్టహాసంగా తెర లేపిన మేకిన్ ఇండియా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నది. ఎగుమతులు తగ్గిపోయి పాలను సైతం దిగుమతి చేసుకోక తప్పని దుస్థితి తలెత్తింది. 202223లో పాడి ఉత్పత్తి ఆశించినంతగా లేకపోడం వల్ల వెన్న, నెయ్యి వంటి పాడి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవలసి రావచ్చునని కేంద్రమే తెలియజేసింది. అందుచేత ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతం కురిస్తే దేశం అనేక ఇక్కట్ల నుండి బయపడే అవకాశాలు పెరుగుతాయి. రుజువైన అనేక శాస్త్రీయ పద్ధతుల్లో వాతావరణ పరిస్థితులను పసిగట్టి నిఖార్సయిన జోస్యాలు చెబుతుందనే పేరు గడించుకొన్న ఐఎండి ఈ వేసవి తుది దశకు చేరుకొనే వచ్చే మే నెల ఆఖరి వారంలో వర్షపాతంపై తాజా జోస్యం చెబుతుంది.

భారత దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం (936.4 మి.మీ.) 2002లో రికార్డు అయింది. అంతకు ముందు 1905లో, 1965లో, 1972లో, ఆ తర్వాత 2009లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. 1917లో అత్యధికంగా 1098.4 మి.మీ వర్షం నమోదైంది. 1961లో అత్యధికంగా 1053.7, 1988లో 1053.5 మి.మీ. వర్షపాతం రికార్డయింది. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా తక్కువ వర్షపాతమో, కరువు పరిస్థితిలో సంభవించవచ్చని స్కైమెట్ చెప్పగా, ఎల్‌నినో పరిస్థితులున్నప్పటికీ 2023లో సాధారణ వర్షపాతం తథ్యమని ఐఎండి అంటున్నది. ఎల్‌నినో సంవత్సరాలన్నీ తక్కువ వర్షపాత సంవత్సరాలు కాబోవని అటువంటి 40 % సంవత్సరాల్లో సాధారణ, అంతకంటే ఎక్కువ వర్షపాతాలు నమోదయ్యాయని ఐఎండి డైరెక్టర్ జనరల్ మొహాపాత్ర అంటున్నారు. 1951 2022 మధ్య 15 సంవత్సరాల్లో ఎల్‌నినో పరిస్థితులు సంభవించగా అందులో ఆరేళ్ళు సాధారణ, అంతకంటే ఎక్కువ వర్షపాతాన్ని చవిచూశాయని ఐఎండి విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

అయితే జూలై, ఆ సమీప కాలంలో ఎల్‌నినో పరిస్థితులు వాతావరణంలో ఏర్పడితే ఆ తొలకరి రెండో భాగం (ఆగస్టు సెప్టెంబర్) లో వర్షపాతంపై దాని ప్రభావం వుండవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. 193 దేశాలు సభ్యులుగా వున్న ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్లుఎంఒ) లో ఇండియా కూడా వున్నదని అందుచేత దాని జోస్యాన్ని ప్రజలు విశ్వసించాలని ఐఎండి డైరెక్టర్ జనరల్ మొహాపాత్ర అంటున్నారు. కాలువల ద్వారా నీరందించే ఇరిగేషన్ సౌకర్యాలు లేని మెట్ట ప్రాంతాలకు వర్షపాతం అతి ముఖ్యమైనది. దేశంలో చాలా ప్రాంతాల్లో ఇరిగేషన్ సౌకర్యం లేని మాట వాస్తవం. అందుచేత ఐఎండి సమాచారం మెట్ట ప్రాంతాల వారికి గొంతులో చల్లని మంచినీరు పోసినంత ఆహ్లాదకరమైనది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News