జాతీయ స్థాయిలో తమకు బద్ధ విరోధి అయిన కాంగ్రెస్‌తో పొత్తు ఏర్పాటు చేసుకున్న డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే బిజెపి నాయకత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. తమకు సొంతంగా ఎన్ని సీట్లు వచ్చినా పట్టించుకొనే స్థితిలో ఆ పార్టీ లేదు. అయితే శశికళ లక్ష్యం మాత్రం తాను జైలుకు వెళ్ళగానే పార్టీని ‘హైజాక్’ చేసిన పళనిస్వామి బృందాన్ని ఇంటికి పంపడమే. ఈ విషయంలో డిఎంకెకు పరోక్ష సహాయం చేయడానికి సహితం ఆమె వెనుకడుగు వేయకపోవచ్చు. జయలలిత చనిపోయే వరకు శశికళ ఎప్పుడు అన్నా డిఎంకెలో సభ్యురాలు కాదు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, నాలుగేళ్ల పాటు అక్రమార్జన కేసులో జైలు శిక్ష అనుభవించి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న సమయంలో చెన్నైకి తిరిగి రావడం తమిళ రాజకీయాలను గందరగోళానికి గురి చేస్తున్నది. ఆమె ప్రస్తుతానికి మౌనంగా ఉన్నప్పటికీ ఆమె లక్ష్యం అంతా తాను జైలుకు వెళ్ళగానే అన్నాడిఎంకెలో తన పదవిని మాత్రమే కాకుండా, పార్టీ సభ్యత్వాన్ని కూడా తీసివేసిన ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలపై ‘పగ’ తీర్చుకోవడమే అని ఆమె కదలికలు స్పష్టం చేస్తున్నాయి.
త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకె కూటమిని ఓడించడం కోసం అధికారంలో ఉన్న అన్నాడిఎంకె జైలు నుండి విడుదలై వస్తున్న శశికళతో కలసి పని చేయాలని తుగ్లక్ సంపాదకుడు, ప్రముఖ రాజకీయ పరిశీలకుడు ఎస్ గురుమూర్తి గత నెలలో పిలుపు ఇవ్వడం గమనిస్తే ఆమె రాక పళనిస్వామిలో ఖంగారుకు దారితీసిన్నట్లు వెల్లడి అవుతుంది.
ఈ సందర్భంగా సొంతంగా బలం లేకపోయినప్పటికీ తమిళనాడు రాజకీయాలలో చక్రం తిప్పాలని ఎదురు చూస్తున్న బిజెపి అంచనాలు సహితం తలకిందులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం శశికళ ‘కీలు బొమ్మ’ వ్యక్తిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన పళని స్వామి గత నాలుగేళ్లలో రాజకీయంగా నిలదొక్కుకో గలిగారు. తనకంటూ పాలనపై, రాష్ట్ర రాజకీయాలపై ఒక పట్టు సాధించుకోగలిగారు. శశికళ జైలు నుండి రాకముందే పన్నీరు సెల్వంతో అవగాహనకు వచ్చి పార్టీ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోగలిగారు. అంతేకాదు అనధికారికంగా ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. శశికళ మేనల్లుడు దినకరన్ పార్టీలో చేరి, అన్నాడిఎంకెతో పొత్తుకు ప్రయత్నం చేయవచ్చని అందరూ అనుకున్నారు.
కానీ ఆమె అన్నా డిఎంకె జెండాను కారుకు తగిలించి చెన్నై కు చేరుకోవడం, ఇంకా ఆమెనే పార్టీ ప్రధాన కార్యదర్శి అంటూ ఆమె మద్దతుదారులు ప్రకటనలు ఇస్తుండడం గమనిస్తే ఆమె అధికార పార్టీ నాయకత్వం కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడవుతుంది. ఈ విషయమై ఆమె రాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఎన్నికల లోపుగా హైకోర్టు నుండి సానుకూల ఉత్తర్వు పొందే అవకాశం లేకపోయినా, అధికార పార్టీలో గందరగోళం సృష్టించే ఎత్తుగడలు వేస్తున్నట్లు అర్ధం అవుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికలలో బిజెపితో పొత్తుకు జయలలిలత సుముఖత వ్యక్తం చేయక పోవడం గమనిస్తే బిజెపితో పొత్తు తమిళ ప్రజలలో ప్రతికూల సంకేతాలు పంపుతుందనే భయమే కారణం.
తమిళ రాజకీయాలను ద్రవిడవాదం వైపు నుండి జాతీయవాదం మళ్లిస్తారని బిజెపి నేతలు భావిస్తూ వచ్చిన రజనీకాంత్ సహితం బిజెపితో పొత్తు పెట్టుకోవద్దని సొంత మద్దతుదారుల నుండే వత్తిడికి గురయ్యారు. జయలలిత మృతి చెందిన సమయంలో ఈ సందర్భంగా తెరపైకి వచ్చిన అనుమానాలను నివృతి చేసే ప్రయత్నం చేయకుండా గవర్నర్ ద్వారా తెరచాటు రాజకీయాలు నడిపి తమకు నమ్మకస్థుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగేటట్లు ప్రయత్నించిన బిజెపి పట్ల తమిళ ప్రజలలో వైముఖ్యత ఏర్పడిన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మొదటగా ఆమె మరణించగానే బిజెపి సూచనపైననే పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ తర్వాత ఆయనను దించివేసి బిజెపి ప్రమేయంతోనే పళని స్వామి ముఖ్యమంత్రిగా గద్దె ఎక్కారు. ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు డిఎంకె చేసిన ప్రయత్నాలను బిజెపి అండతోనే పళనిస్వామి ఎదుర్కొన్నారు.
అయితే ఇప్పుడు శశికళ నుండి బిజెపి ఏమాత్రం కాపాడగలదనే భయం ముఖ్యమంత్రి మద్దతుదారులతో ఎదురవుతుంది. జాతీయ స్థాయిలో తమకు బద్ధ విరోధి అయిన కాంగ్రెస్‌తో పొత్తు ఏర్పాటు చేసుకున్న డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే బిజెపి నాయకత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. తమకు సొంతంగా ఎన్ని సీట్లు వచ్చినా పట్టించుకొనే స్థితిలో ఆ పార్టీ లేదు. అయితే శశికళ లక్ష్యం మాత్రం తాను జైలుకు వెళ్ళగానే పార్టీని ‘హైజాక్’ చేసిన పళనిస్వామి బృందాన్ని ఇంటికి పంపడమే. ఈ విషయంలో డిఎంకెకు పరోక్ష సహాయం చేయడానికి సహితం ఆమె వెనుకడుగు వేయకపోవచ్చు. జయలలిత చనిపోయే వరకు శశికళ ఎప్పుడు అన్నా డిఎంకెలో సభ్యురాలు కాదు. పార్టీలో, పదవిలో ఎటువంటి హోదా ఆమెకు లేదు. వేదికపై మైకు ముందుకు వచ్చి ఏనాడు ప్రసంగం చేయలేదు. అయినా తెర వెనుక ఉండి మూడు దశాబ్దాలుగా అన్నా డిఎంకె రాజకీయాలలో కీలక పాత్ర వహిస్తున్నారు.
అన్నింటికీ మించి ఆమెకు అపారమైన ఆర్ధిక వనరులు ఉన్నాయి. రెండు ద్రావిడ పార్టీలు సహితం ఆమెతో వనరుల విషయంలో పోటీ పడలేవు. ఇప్పుడు ఎట్లాగు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం శశికళకు లేదు. ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధమైన సమయంలోనే జైలు శిక్ష పడి, జైలుకు వెళ్ళవలసి వచ్చింది. అయితే 2026 ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు అన్నా డిఎంకె ఎన్నికలలో ఓటమి చెందితే, ఆ పార్టీ ఛిన్నాభిన్నమై పార్టీ నాయకత్వాన్ని హస్తగతం చేసుకోవడం తనకు తేలిక అవుతుందనే ఆలోచనతో శశికళ ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. శశికళతో కలిస్తే గాని డిఎంకెను ఓడించలేమని గురుమూర్తి చేసిన ప్రకటన గమనిస్తే ప్రస్తుతం డిఎంకె అధికారంలోకి రావడానికి రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలు సానుకూలంగా ఉన్నట్లు అర్ధం అవుతుంది. అందుకు శశికళ మరింత ఆజ్యం పోస్తే స్టాలిన్ అధికారంలోకి రావడానికి రహదారి ఏర్పర్చిన్నట్లు కాగలదు.
పైగా ఆమెకు స్టాలిన్‌తో గతం నుండి మంచి అవగాహన ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలు సహజంగానే బిజెపికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఆమె మద్దతుతో అన్నా డిఎంకెలో చీలిక తీసుకు వచ్చి, ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే స్టాలిన్ ప్రయత్నాలు ఆమె జైలులో ఉండడంతో పాటు బిజెపి రంగంలో ఉండడంతో సాధ్యం కాలేదు. 2014లో బిజెపి అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు ఇప్పటి వరకు పార్టీ అధికారంలోకి రాలేకపోయిన దక్షిణాది, తూర్పు రాష్ట్రాలలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా ప్రకటించారు. కర్ణాటకలో మినహా మరే రాష్ట్రంలో బిజెపి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. తర్వాత అసోంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడు అధికారం కోసం ముందు వరసలో ఉన్నారు. దక్షిణాదిన మొదటిసారిగా కేరళలో ఒక సీట్ పొందినా మరే రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడలేదు. తెలంగాణలో ఒకటి, రెండు ఎన్నికల విజయాలు సాధించినా ఆ పార్టీకి బలమైన నాయకత్వం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అంతకన్నా అధ్వాన్నంగా ఉన్నాయి. అందుకనే తమిళనాడులో తమ మిత్రపక్షం అధికారంలో కొనసాగేటట్లు చేసుకోవడం ఆ పార్టీకి చాలా అవసరం. మరోవంక, పరిస్థితులు సహకరింపక పళని స్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒప్పుకున్నప్పటికీ అదను చూసి తిరుగుబాటుకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు శశికళకు వ్యతిరేకంగా ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు. వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, దినకరన్ పార్టీ రెండంకెల సీట్లు తెచ్చుకోగలిగితో, చిన్న, చిన్న పార్టీలను కూడదీసుకుని, శశికళ అండతో ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. అటువంటి పరిణామాలు ఏర్పడితే శశికళ కీలక అధికార కేంద్రంగా మారే అవకాశం లేకపోలేదు. తన రాజకీయ ఉనికి కోసం శశికళ చేస్తున్న ప్రయత్నాలు తమిళ రాజకీయాలలో ఎటువంటి మలుపు తీసుకు వస్తాయో చూడవలసి ఉంది.