Thursday, January 23, 2025

సీరియళ్ళు, స్త్రీలు, సమాజం..

- Advertisement -
- Advertisement -

మాధ్యమాల్లో విలువల పతనానికి లాభాపేక్ష గల బాధ్యతారహిత పెట్టుబడిదారీ పత్రికా వ్యవస్థ కారణం. పఠన, శ్రవణ మాధ్యమాల కంటే దృశ్య మాధ్యమాల ప్రభావం తీవ్రమైంది. సీరియళ్ళు చూసేది ఎక్కువ స్త్రీలే. ఇవి వారి మెదళ్లను పాడు చేసి, సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. సీరియళ్ళ కథనాలు, స్త్రీ పాత్రల చిత్రీకరణ అసహజంగా, మానవత్వ విచ్ఛిన్నంగా ఉంటున్నాయి. సమాజంలోని నైతిక విలువల ప్రభావం సీరియళ్ళలో, సీరియళ్ళ ప్రభావం సమాజంలో పరస్పరం ప్రతిఫలిస్తున్నాయి. టివి సీరియళ్ళన్నీ కల్పనలే. వాటి లక్ష్యం వినోదమే.

ఈ వినోదపు తీరుతెన్నులు, సామాజిక ప్రయోజకత్వం, ప్రత్యేకించి స్త్రీలపై వీటి ప్రభావం రచయిత అవగాహనపై ఆధారపడి ఉంటాయి. శాస్త్రీయ దృక్పథం, సామాజిక స్పృహ బాధ్యతలు లేని రచయితలు సమాజ వినాశక రచనలు చేస్తారు. నిర్మాతలు వాటిని చిత్రీకరిస్తారు. దర్శకులు సహకరిస్తారు. పౌరాణిక కవులు ఒక పాత్రలో ఒక గుణాన్నిఎత్తి చూపడానికి ఆ పాత్ర మానవత్వాన్నే హత్యచేశారు. పరశురాముని పితృభక్తిలో ఆయన మాతృప్రేమను, మానవత్వాన్ని మంటకలిపారు. సీరియళ్ళ పాత్రల చిత్రీకరణలోనూ ఇదే జరుగుతోంది. 15 ఏళ్ల క్రితం ఒక మహిళా అధ్యయన సంస్థ నివేదిక ఇలా ఉంది. ఉదయం 11 నుండి రాత్రి 11 దాకా కొందరు స్త్రీలు క్రమం తప్పక సీరియళ్ళు చూస్తారు. వారి ప్రవర్తనలో ఊహించని మార్పొస్తుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగువారు, స్నేహితులతో సంబంధాల్లో గణనీయమైన మార్పు వస్తుంది. తోటి స్త్రీలపై నమ్మకం పోతుంది. వారితో మనసు విప్పి మాట్లాడే అలవాటు, స్నేహభావం మాయమౌతాయి.

సీరియళ్ళలోని ఆడంబరతలతో తమ స్థితిగతులను పోల్చుకొని న్యూనతాభావం చోటు చేసుకుంటుంది. మానసికరోగులుగా మారతారు. సీరియళ్ళతో ప్రయోజనంలేదని, అన్నీ నష్టాలేనని వీక్షకులు గమనించాలి. 40-60 ఏళ్లవారు సీరియళ్ళ పాత్రల్లో దూరుతున్నారు. ప్రమాదకర మానసిక స్థితికి చేరుతున్నారు. సీరియళ్ళలో స్త్రీని స్త్రీకి శత్రువుగా చూపిస్తున్నారు. అత్తాకోడళ్ళు, తోడుకోడళ్లు, అక్కాచెల్లెళ్లు, ఆడపడుచులు, అమ్మా కూతుర్లు కొట్లాడుకుంటారు. కుట్రలు పన్నుతారు. పరపతి, ఆస్తి, అధికారం, ఉద్యోగం ఉన్న మగాడిని, ప్ళ్ళైనవాడైనా సరే, వలలో వేసుకోడానికి చేయరాని పనులు చేస్తారు. మగాడికి ఇద్దరు పెళ్ళాలుంటారు.ఆ మగాడి అమ్మ లేదా అమ్మాయి అమ్మ వంతపాడతారు. ఆ మగాడి తప్పేమి లేనట్లు, భార్యలతో భర్త తెగ బాధపడిపోతున్నట్లు, తీవ్ర కష్టనష్టాలు భరిస్తున్నట్లు చూపిస్తారు.

గయ్యాళ్ళు కాని స్త్రీలంతా ఏడుస్తూనే ఉంటారు. ఎంత పేరు ప్రఖ్యాతులున్నా అవివాహిత స్త్రీలను ఉన్నతంగా, ఆదర్శంగా చూపరు. నీచులుగా, మగాళ్లను మోసగించేవాళ్లుగా చిత్రిస్తారు. ఇవన్నీ వాస్తవ విరుద్ధాలు. నిజ జీవితానికి దూరమైనవి.సీరియళ్ళ స్త్రీలకు సౌందర్య పిచ్చిఎక్కువన్నట్లు చూపుతారు. 24 గంటలూ అలంకరించుకునే ఉంటారు. కట్టుబొట్టు, అలంకరణ, ఆహార్యం వికారంగా, వెటకారంగా ఉంటాయి. అలాంటి ఆభరణాలు, అలంకారాలు లేని బతుకు సాధారణ స్త్రీలకు దండగనిపిస్తుంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు కూడా అసభ్య వస్త్రధారణతో, జుగుప్సాకర అలంకారాలతో ఉంటారు. స్త్రీలు అందంగా ఉండాలన్న భావన కల్పిస్తారు. వారి శరీర సౌందర్యానికే కాని, వృత్తి, శక్తిసామర్థ్యాలు, వ్యక్తిత్వాలకు విలువనివ్వరు.

చదువుకున్న పట్టణప్రాంత కోడలు గ్రామీణ ప్రాంత తోడుకోడలును రాచిరంపాన పెడుతుంది. సీరియళ్ళలో శారీరక శ్రమకు విలువఉండదు.శ్రమసంస్కృతిని నాశనంచేశారు. కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు.చదువుకున్న స్త్రీలను సంస్కారహీనులుగా, దుర్మార్గురాళ్ళుగా చూపిస్తారు. జాతీయ భాష హిందీతో సహా ప్రాంతీయ భాషల సీరియళ్ళన్నీ ఒకేలా ఉంటాయి. హిందీ సీరియళ్ళ మహిళా నిర్మాత ఏకతా కపూర్, స్త్రీ పాత్రలను హీనంగా చిత్రీకరించారు. ఈవరవడి ఇతర సీరియళ్ళకు ప్రాకింది. మగాళ్లు మద్యపాన, వ్యభిచార ప్రియులు. స్త్రీలు వాళ్ళను సహిస్తారు. భరిస్తారు. యువ పాత్రలు గడ్డాలతో ఉంటాయి. వీటిని చూసేనేమో నేటి యువకులు పెళ్ళిలో కూడా గడ్డం తీయరు.

పెళ్ళికూతుర్లు భరిస్తారు. కథకు అవసరమైతే తప్పితే సీరియళ్ళలో కామన్ మ్యాన్ కనపడడు. అంతా ధనవంతులే. ఇళ్ళు రాజభవనాలే. మానవ సంబంధాలను అమానవీకరిస్తారు. అడుగడుగునా లింగవివక్ష కన్పిస్తుంది. మోసాలు, హత్యలు, శృంగారం, క్షుద్ర పూజలు ప్రదర్శిస్తారు. పూజలు, ఆచారాలు, యజ్ఞయాగాలు, క్రతువులు, పుట్టిన రోజులు, నామకరణాలు, అక్షరాభ్యాసాలు, కర్మకాండలు ఆడంబరంగా చేయిస్తారు. ఆడంబరాలు, గుడ్డి నమ్మకాలను పెంచుతున్నారు. విరామ సమాజం హానికరం. సీరియళ్ళు విరామ సమాజపు ఫలితాలు. సమాజంలో సగమైన స్త్రీలు సీరియళ్ళ మత్తులో మునిగితే సామాజిక ప్రగతి కుంటుపడి సమాజం వెనకకు నడుస్తుంది. సీరియళ్ళలో డైలాగులు నిదానంగా పట్టిపట్టి పలుకుతారు. సాధారణంగా ఒకరు మాట్లాడేటప్పుడు మరొకరు మాట్లాడరు.

ఈ లక్షణాలు మంచివే. అయితే కెమెరా ఒకరిని మార్చి ఒకరిపై నిలిపి వెలుతురు పెంచి, చుక్ చుక్ అన్న విచిత్ర శబ్దాలతో ప్రసారం చేస్తారు. ఇవి వీక్షకుల కళ్ళకు హానికరం. అరగంట సీరియల్‌లో ఐదు నిమిషాల కథ కూడా నడవదు. కాలమంతా ప్రకటనలతో, జరిగిన కథతో, జరగబోయే కథతో గడిచిపోతుంది. సీరియల్ ఏళ్ల తరబడి సాగుతుంది. వీక్షకుల కాలం వృథా అవుతుంది. వారు ఏమౌతుందోనన్న వత్తిళ్లకులోనవుతూనే ఉంటా రు. సీరియళ్ళ నిర్మాతలు విపరీత లాభార్జన పొందుతారు. మంచి సీరియళ్ళు ఉండవుకాని కొన్నింటిలో మంచి అంశాలు ఉంటాయి. ఒక సీరియల్‌లో కొడుకు వదిలేసిన కోడలుతో అత్త చాలా ప్రేమగా వ్యవహరిస్తారు. వీటిని ప్రచారం చేయాలి.

మగాళ్లు క్లబ్బులు, పబ్బులు, బార్లు, సినిమాలు, షికార్లలో మునిగిపోతే సరిపోదు. జీవిత భాగస్వాములను పట్టించుకోవాలి. స్త్రీలకు వ్యాపకం, ప్రత్యామ్నాయ పనులు కల్పించాలి. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలి. స్త్రీలు పాల్గొంటేనే ఏపనైనా విజయవంతమౌతుంది. నల్ల సాగు చట్టాల వ్యతిరేక రైతు ఉద్యమంలో స్త్రీల పాత్ర తాజా ఉదాహరణ. సీరియళ్ళ నియంత్రణ ప్రజల చేతుల్లోనే ఉంది. వీటిని చూడకపోవడమే పరిష్కారం. స్త్రీ వ్యతిరేక సీరియళ్ళను తీసేవారి కంటే చూసేవారే అపాయకారులు. ప్రజల్లో సామాజిక స్పృహ, చైతన్యం పెంచటానికి పౌర సంఘాలు కృషి చేయాలి. వీక్షకులు తమను తాము సంస్కరించుకోవాలి. మంచీచెడుల అవగాహనకు రావాలి. చెడు సీరియళ్ళను చూడొద్దని ప్రచారం చేయాలి. దీనితో క్రమేపీ మంచి సీరియళ్ళు నిర్మిస్తారు. సీరియళ్ళను స్త్రీలు వినోదాత్మకంగాకాక విమర్శనాత్మకంగా చూడాలి. స్త్రీ వ్యతిరేక సీరియళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. ఇందుకు మహిళా సమాఖ్యలు చొరవ తీసుకోవాలి.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి- 9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News