వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ ఇటీవల మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాతో యుద్ధం సాగుతున్న పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు అందించే మిలిటరీ సాయాన్ని నిలిపివేసింది. అధ్యక్షుడు ట్రంప్ శాంతిస్థాపనపై దృష్టి సారించారు. మా భాగస్వాములు కూడా ఆ లక్షానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. మేము మా సాయాన్ని నిలిపివేస్తున్నాం. ఇది ఒక పరిష్కారాన్ని చూపిస్తోంది ” అని వైట్‌హౌస్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.
అయితే ఇది తాత్కాలికమేనని వెల్లడించారు. రష్యాతో శాంతి చర్చలకు కీవ్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లండన్‌లో ఐరోపా దేశాధినేతల సమావేశం తరువాత జెలెన్‌స్కీ అగ్రరాజ్యంతో ఖనిజాల ఒప్పందానికి తాము సిద్ధమేనని ప్రకటించారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉండారని , ట్రంప్‌తో మరోసారి భేటీకి వెళ్తానన్నారు. యుద్ధం ముగింపు సుదూర తీరం లోనే ఉందని, అప్పటివరకు అగ్రరాజ్య సహకారం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యం లోనే వాషింగ్టన్ మిలిటరీ సాయం నిలిపివేయడం గమనార్హం.