ఎమర్జెన్సీ వివాదం నేపథ్యంలో అభిశంసనకు గురై, అరెస్టు ముప్పు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు సతీమణి రూపంలో మరో వివాదం వచ్చి పడింది. మాస్టర్ థీసిస్‌ను దొంగిలించి యూనివర్శిటీకి సమర్పించారంటూ ఆయన సతీమణి కిమ్ కియోన్ హీపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 2022 నుంచి సూక్‌మ్యూంగ్ మహిళా యూనివర్శిటీ దీనిపై విచారణ చేస్తోంది. కిమ్ తప్పుడు నివేదిక సమర్పించిన విషయం వాస్తవమేనని తాజాగా గుర్తించింది. ఈ ఆరోపణలపై స్పందించడానికి ఆమెకు ఈ నెలాఖరువరకు సమయం ఉంది. ఈలోపు ఆమె స్పందిస్తే , ఆమె అభ్యర్థనను పరిశీలిస్తామని యూనివర్శిటీ వెల్లడించింది. లేకపోతే తాము కనుగొన్న తుది ఫలితాలను ప్రకటిస్తామని తెలియజేసింది.
గతం లోనూ ఆమె అందుకున్న ఓ కానుక అధ్యక్షుడిని చిక్కుల్లో పడేసింది. దేశ రాజకీయాలను కుదిపేసిన ఆ కుంభకోణం ఆయన ప్రతిష్ఠను మసకబార్చింది. కిమ్ కియోన్ హీ రెండేళ్ల క్రితం ఓ ఫాస్టర్ నుంచి ఖరీదైన డియోర్ బ్యాగ్‌ను గిఫ్ట్‌గా అందుకున్నారు. దాని విలువ 2250 డాలర్లు ఉంటుందని (భారత కరెన్సీలో దాదాపు రూ. 1.9 లక్షలు ) అంచనా. ఉత్తర కొరియాపై అధ్యక్షుడి కఠిన వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించే ఫాస్టర్ చాయ్ జే యంగ్ దీన్ని ప్రథమ మహిళలకు కానుకగా ఇచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలు 2023 నవంబరు లోనే వెలుగు లోకి వచ్చాయి. దక్షిణ కొరియా చట్టాల ప్రకారం .. ఒకేసారి 750 యూఎస్ డాలర్లు లేక ఒక ఏడాదిలో 2200 డాలర్ల విలువైన బహుమతులు స్వీకరించడం చట్టవిరుద్ధం. దాంతో ఈ అంశం అక్కడి రాజకీయాలను కుదిపేసింది.