Tuesday, December 24, 2024

ఉమ్మడి వల్ల ఆదివాసీలకు హాని

- Advertisement -
- Advertisement -

దేశ వ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు ప్రతిపాదన పై 22వ లా కమిషన్ అభిప్రాయాల సేకరణ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట ఉమ్మడి పౌర స్మృతి ప్రస్తావనతో ఆదివాసీ తెగలలో ఆందోళన నెలకొని ఉంది. ముఖ్యంగా ఆదివాసీ సంస్కృతి, ఆచార, సంప్రదాయ నియమాల తో పాటు, దేశ షెడ్యూల్డ్ ప్రాంతాలలో భిన్న రాజ్యాంగ, శాసనాలు అమలులో ఉన్న కారణంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు ఎలా సాధ్యమనేది మౌలిక ప్రశ్న. నిజమే దేశ వ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు అనేది రాజ్యాంగం 44 అధికరణ ప్రకారం ఆదేశిక సూత్రం. 1954లో ఉమ్మడి పౌర స్మృతి బదులు హిందూ కోడ్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంలో జరిగిన చర్చలో ఉమ్మడి పౌర స్మృతి అమలుకు పరిపక్వత రాలేదని జవహర్ లాల్ నెహ్రూ అన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఉమ్మడి పౌర స్మృతి అమలుకు అవకాశం ఉందా?
స్వార్ధపూరిత మత, కుల రాజకీయాలు దేశంలో పెచ్చరిల్లిపోతున్నాయి. పాత ఆలోచన కొత్తగా తెరపైకి తీసుకురావడం వెనుక మత రాజకీయాల పునాదిని మరింత దృఢ పరుచుకోవడానికనే భావన సర్వత్రాలేకపోలేదు. మెజారిటీ హిందువుల భావజాలం ఆదివాసీలపై రుద్దే ప్రయత్నం ఎంత వరకు సబబు. భారత దేశంలో 700 ఆదివాసీ తెగలు ఉండగా వాటిలో 75 తెగలు ప్రత్యేక తెగలుగా గుర్తింపుబడ్డాయి. దేశంలో అమలులో ఉన్న హిందూ వివాహ చట్టం 1955, హిందూ వారసత్వ చట్టం 1956, హిందూ మైనారిటీ, సంరక్షణ చట్టం 1956, హిందూ దత్త, మనోవర్తి చట్టాలు హిందూ, బౌద్ధ, సిక్కులకు మాత్రమే వర్తిస్తాయి. ఆ చట్టాలలోనే ఆదివాసీలకు వర్తించవని పేర్కొనబడ్డాయి. వారి సాంస్కృతిక, ఆచార, సంప్రదాయ నియమాలే కుటుంబం, ఆస్తి ఇతర వ్యక్తిగత వ్యవహారాలకు వర్తిస్తాయి.
ఆదివాసీలు హిందూ లేదా క్రైస్తవ లేదా ముస్లింలకు చెందిన వారు కాదు. రాజ్యాంగ నియమాల కింద ప్రకటించబడిన తెగలు. అందువల్ల ఇతర ప్రజల వ్యక్తిగత వ్యవహార శాసనాలు వారికి వర్తించవు. అందువల్లనే వారి సంస్కృతిని ఛిన్నాభిన్నం చేసే ఉమ్మడి పౌర స్మృతి అమలు ఆలోచనను ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. ఆదివాసీల జీవనం, సంస్కృతి నేపథ్యంలోనే ఆదివాసీలు నివసించే వెనుకబడిన ప్రాంతాలలో బ్రిటిష్ ప్రభుత్వం మైదాన ప్రాంత శాసనాలు, పాలన నుంచి మినహాయించింది. ఆ ప్రాంతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా గుర్తిస్తూ 1874లోనే చట్టం చేసింది. ఆదివాసీ సంప్రదాయ పరిరక్షణ, ప్రత్యేక శాసనాల అమలుకు సైమన్ కమిషన్ 1930లో బ్రిటిష్ ప్రభుత్వానికి సిఫారసు చేసిన తర్వాతే భారత ప్రభుత్వ చట్టం 1935 కింద దేశంలో నివసించే ఆదివాసీ ప్రాంతాలను సాధారణ పరిపాలన నుంచి కొన్ని ప్రాంతాలను మినహాయిస్తూ పాక్షిక, సంపూర్ణ మినహాయింపు ప్రాంతాలుగా ప్రకటించింది.
దేశ స్వాతంత్య్రం అనంతరం పాక్షిక మినహాయింపు ప్రాంతాలను రాజ్యాంగం ఐదవ షెడ్యూల్, సంపూర్ణ మినహాయింపు ప్రాంతాలను ఆరవ షెడ్యూల్‌లో చేర్చారు. ఆ విధంగా ప్రకటించబడిన పాక్షిక మినహాయింపు ప్రాంతాలు దేశంలో ఆంధ్ర, తెలంగాణతో పాటు 10 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఆరవ షెడ్యూల్ ప్రాంతాలు ఈశాన్య భారత రాష్ట్రాలలో ఉన్నాయి.
దేశ మైదాన ప్రాంతాలతో పోలిస్తే షెడ్యూల్డ్ ప్రాంతాలలో అమలులో ఉన్న శాసనాలు, రాజ్యాంగ నియమాలు భిన్నంగా ఉంటాయి. ఆదివాసీల సంస్కృతి, ఆచార సాంప్రదాయాలు పరిరక్షించుకునే అధికారం కేంద్ర షెడ్యూల్ ప్రాంత పంచాయతీ విస్తరణ చట్టం 1996 (పెసా చట్టం) కింద గ్రామసభలకు ఇవ్వబడింది. ఆదివాసీల స్వీయ పాలన అధికారం ఇవ్వబడింది. పెసా చట్టం రాజ్యాంగం 243 (ఎం) అధికరణ కింద ఉద్భవించింది. అందువల్ల ఉమ్మడి పౌర స్మృతి అమలు ఆదివాసీల సాంస్కృతిక పరిరక్షణ ఉద్దేశించిన రాజ్యాంగ హక్కు దెబ్బ తీయడమే. అలాగే ఆరవ షెడ్యూల్ ప్రాంత నాగాలాండ్‌లో నాగాల సంప్రదాయ నియమాల, వారి ఆచరణకు భిన్నంగా జేసే ఎటువంటి పార్లమెంటు చట్టాలు ఆ రాష్ట్ర శాసన సభ తీర్మానం లేకుండా రాజ్యాంగ అధికరణ 371 (ఎ) కింద చెల్లవు. అదే పరిస్థితి మిజోరాంలో కూడా 317(జి) కింద ఉంది. దేశ వ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు సాధ్యం కాదు.
ఆదివాసీ సంప్రదాయ ప్రకారం భూమి వనరులు ఉమ్మడి ఆస్తి. వ్యక్తిగా ఆస్తి కాదు సమిష్టి ఆస్తి. అయితే భూమి సర్వే కాలంలో ఆదివాసీలను హిందువులుగా పరిగణిస్తూ హిందూ భావజాలం ఆధారంగా పురుషుల పేరనే సాగు భూమి నమోదు జేశారు. కలిసి సాగు జేసికొని, సమిష్టిగా వనరులు అనుభవించే సంస్కృతిని ఇప్పటికే ప్రభుత్వ విధానాలు నాశనం చేశాయి. ఆదివాసీ కుటుంబాలలో భూమి తగాదాలు పెంచాయి. హిందూ వ్యవహారాలకు సంబంధించిన చట్టాల వల్ల దొరకని పరిష్కారాలు ఆదివాసీ సమాజంలో వారి ఆచార, సంప్రదాయ నియమాల ఆచరణలో దొరుకుతున్నాయి. హిందూ పురుషాధిక్య భావజాలంలో పుట్టిన అనేక దురాచార పద్ధ్దతులు ఆదివాసీ సంస్కృతిలో లేవు.
అందువల్ల ఆదివాసీల ప్రత్యేక రాజ్యాంగ శాసన, సాంస్కృతిక నియమాలను ఛిద్రం జేసే దిశగా ఉమ్మడి పౌర స్మృతి పేరుతో ఆలోచన, చొరబాటు సరైంది కాదు. దేశ వ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి వ్యతిరేకత, ఆదివాసీల ఆందోళన ప్రభుత్వాలు అర్ధం జేసుకోవాలి. ఉమ్మడి పౌర స్మృతి ఆలోచన విరమించు కోవాలి. భిన్నత్వంలోనే ప్రజాస్వామిక, రాజ్యాంగ మౌలిక సూత్రాల అమలుకు అవకాశం కల్పిస్తున్న రాజ్యాంగ చట్రం మనకు ఉంది. అటువంటప్పుడు ఉమ్మడి పౌర స్మృతి అమలు ఆలోచన ఎందుకు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News