కోల్‌కతా : వచ్చే వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని ( సిఎఎ ) అమలు చేస్తామని కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి శాంతను ఠాకూర్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్ దక్షిణ పరగణాల జిల్లా కాక్‌ద్వీప్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభమైందని, అలాగే వచ్చే ఏడు రోజుల్లో సిఎఎ అమలవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఇది కేవలం పశ్చిమబెంగాల్ లోనే కాదు. దేశం లోని ప్రతిరాష్ట్రం లోనూ అమలు అవుతుందన్నారు. 1971 తర్వాత భారత్‌కు వచ్చిన వారు , ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఉన్నవారు దేశ పౌరులే అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెబుతున్నారని వ్యాఖ్యానించారు. మతువా కులానికి చెందిన వారు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని వేలమందికి ఓటర్ ఐడీలు జారీ చేసేందుకు తిరస్కరించారని విమర్శించారు. పశ్చిమబెంగాల్ లోని బంగాన్ నియోజక వర్గం నుంచి శాంతను ఠాకూర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ మతువా తెగ ప్రజలు ఎక్కువగా ఉంటారు.